Oct 12,2022 07:17

ఇప్పటికే జాతీయ విద్యా విధానం-2020లో సంస్కృతాన్ని మూడు ప్రధాన బోధనా స్రవంతులలో కలిపి రుద్దుతూ... సంస్కృతాన్ని పైన మొదటగా పెట్టడాన్ని మర్చిపోకూడదు. సంస్కృత విశ్వవిద్యాలయాలను నెలకొల్పడం కూడా ఇందులో భాగమే. ఇప్పుడు ప్రత్యక్షంగా హిందీని బలవంతంగా
మూల భాషగా ప్రమోట్‌ చేసి ... తర్వాత తీరిగ్గా దీనికి సంస్కృతాన్ని జతపరుస్తారు.


        మొన్నటి వరకూ హిందీ రాష్ట్ర భాష అంటూ కూని రాగాలు తీసిన ప్రభుత్వం ఇప్పుడు బృందగానం మొదలుపెట్టింది. దీనికి అవసరమైన వాయిద్యాన్ని ''పార్లమెంటరీ కమిటీ ఫర్‌ అఫిషియల్‌ లాంగ్వేజెస్‌'' మొదలుపెట్టి అప్పుడే కచేరి కూడా ఆరంభించింది. సాంకేతిక, సాంకేతికేతర విద్యా బోధన ఎట్టి పరిస్థితుల్లోనూ ఇకపై హిందీలోనే సాగాలనేది దీని ప్రధాన ఉద్దేశ్యం. అంటే... ఐ.ఐ.టి లు, ఐ.ఐ.యమ్‌ లు, ఎయిమ్స్‌ (ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) లోనే గాక అన్ని విశ్వవిద్యాలయాల లోనూ మరీ ముఖ్యంగా సెంట్రల్‌ యూనివర్సిటీల లోనూ అన్ని ప్రభుత్వ రంగ పాఠశాలల్లోనూ (కేంద్రీయ విద్యాలయాలు, నవోదయా విద్యాలయాలు) ఇకపై టీచర్లు హిందీలోనే పాఠాలు చెప్పాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో, కోర్టుల్లో కూడా ఈ ప్రక్రియ మొదలు పెట్టాలి. ఎవరైనా వ్యతిరేకించినా, విభేదించినా వారికి వార్నింగ్‌ ఇచ్చి తగు కారణాలు అడగాలి. లేదా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు గోవిందా. వార్షిక పర్సనల్‌ అసెస్‌మెంట్‌లో రికార్డ్‌ చేయాలి. అంటే వీరి నిర్ణయాన్ని వ్యతిరేకించినవారి భవిష్యత్తును బ్లాక్‌మెయిల్‌ చేసే స్థాయికి దిగజారింది ప్రభుత్వం. ఇకపై అనివార్యమైతేనే తప్ప ఆంగ్ల భాష అస్సలు వాడకూడదట.
          ఈ కమిటీ ''భారత అధికార భాషల చట్టం-1963'' ఆధారంగా 1976లో ఏర్పడింది. ఇందులో 30 మంది పార్లమెంట్‌ సభ్యులుంటారు (20 మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు). గతంలో కూడా ఇలాంటి ప్రయత్నమే జరిగింది. అప్పుడు తమిళులు పెద్ద ఎత్తున ఉద్యమించి ప్రాణాలకు తెగించి మరీ తమ భాషతో పాటు అందరి భాషా ఉనికిని కాపాడి నిలబెట్టారు. ప్రస్తుత ఈ తాజా కమిటీ రిపోర్ట్‌ నెల క్రితమే వచ్చినా దీనిని రాష్ట్రపతికి సమర్పించడంతో వార్త బయటకు వచ్చింది.
అయితే ఇప్పుడు కూడా మొదటిగా దీనిని వ్యతిరేకిస్తూ నిరసన గళాన్ని ఎత్తారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌. భారత ప్రభుత్వ నిబద్ధతను నిలదీస్తున్నారాయన. ఇదే జరిగితే దేశ భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుందని హెచ్చరిస్తున్నారు. భారతీయ ఆత్మ అయినటువంటి భిన్నత్వంలో ఏకత్వం నాశనమౌతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
         మెల్లగా ఆర్‌.ఎస్‌.ఎస్‌ ఎజెండా దేశ ఎజెండాగా మారడాన్ని ప్రజలందరూ గుర్తించాల్సిన సమయం వచ్చింది. దేశ పరిపూర్ణతకు భంగం వాటిల్లబోతుందని గమనించాలి. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 8లో చెప్పబడినట్లు 22 భారతీయ భాషలకు అధికారికంగా సమాన హోదా ఇవ్వబడింది. వీటిలో ఇంగ్లీష్‌ను, హిందీని ప్రధాన అధికారిక భాషలుగా 1968లో ప్రకటించారు. అటువంటిది వీటిలో ఒకటయిన హిందీని ముందుకు తెచ్చి రుద్దడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? ఒక దేశం ఒకే భాష, ఒకే మతం, ఒకే సంస్కృతి అనే నియంతృత్వ పోకడను తిప్పికొట్టాలి.
ఇప్పటికే జాతీయ విద్యా విధానం-2020 (ఎన్‌.ఇ.పి)లో సంస్కృతాన్ని మూడు ప్రధాన బోధనా స్రవంతులలో కలిపి రుద్దుతూ...సంస్కృతాన్ని పైన మొదటగా పెట్టడాన్ని మర్చిపోకూడదు. సంస్కృత విశ్వవిద్యాలయాలను నెలకొల్పడం కూడా ఇందులో భాగమే. ఇప్పుడు ప్రత్యక్షంగా హిందీని బలవంతంగా మూల భాషగా ప్రమోట్‌ చేసి తర్వాత తీరిగ్గా దీనికి సంస్కృతాన్ని జతపరుస్తారు. మెల్లగా మెదలు పెట్టి...ప్రజల నాడి పసిగట్టి...వారు వ్యతిరేకిస్తే ఏమరుపాటు కల్పించి, ముందడుగులు వేయడాన్ని మనం చూస్తున్నాం.
          వీరిప్పుడు మరొక అడుగు ముందుకేసి పైలట్‌ ప్రాజెక్ట్‌ పేరుతో ఈ అక్టోబర్‌ 16న మధ్యప్రదేశ్‌లో హిందీ లోకి తర్జుమా చేసిన ఎం.బి.బి.ఎస్‌ మొదటి సంవత్సరం పుస్తకాలను అమిత్‌ షా ఆవిష్కరించ బోతున్నారు. రాబోయే కాలంలో రెండవ, మూడవ, నాల్గవ సంవత్సర ఎం.బి.బి.ఎస్‌ పుస్తకాలూ, అలాగే ఐ.ఐ.టి తో పాటుగా ఇతర ఇంజినీరింగ్‌ పాఠ్యాంశాలు కూడా హిందీలోనే బయలుదేరడానికి అట్టే సమయం పట్టదు. ఇదే జరిగితే రాబోవు తరాల మెడికల్‌, ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ విద్యార్థులూ ఇతర కోర్సుల విద్యార్థుల భవిష్యత్‌ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
      దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో చదివేది బహుజన లేదా పేద విద్యార్థులే. వీరు ఆయా ప్రాంతాలలో స్థానిక భాషలలో చదువుకుంటారు. అటుపై వృత్తి కళాశాలల్లో చేరడానికి నీట్‌, లాసెట్‌, కేట్‌, గేట్‌ లాంటి కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్షలలో ర్యాంకులతో సీట్లు సంపాదించాలంటే వీరు హిందీ ప్రశ్నాపత్రాలకు హిందీలో జవాబులు రాయాలి. అక్కడ నుండి బలవంతాన హిందీలో చదువుకుని ఉన్నత విద్యలను, డిగ్రీలను పొందాలి. రాబోయే తరాలకు ఇంగ్లీష్‌ను దూరం చేయడమంటే విదేశీ చదువులకు తలుపులు మూసేయడమే. మరీ దుర్మార్గం ఏమంటే వీరే చిన్న తరగతులలో ఒకపక్క మాతృభాషలో బోధన అంటున్నారు. మరొకపక్క వీరే పైతరగతులకు వెళ్లి అక్కడ హిందీలోనే పాఠాలు నేర్చుకోమంటున్నారు. ఇది ఆచరణ సాధ్యమయ్యే పని కాదని పాలకులకు తెలుసు. ఇది దేశ ఐక్యతకే కాదు. దేశ భావితరాల భవిష్యత్తుకు కూడా సంబంధించిన సమస్య. కనుక హిందీ యేతర రాష్ట్రాలైన దక్షిణాది రాష్ట్రాలతో సహా ఒడిషా, బెంగాల్‌ రాష్ట్రాలే కాకుండా హిందీ మాతృభాష కాని అనేక ఉత్తరాది రాష్ట్రాలు కూడా ఈ హిందీ భాషా పైత్యాన్ని, కుట్రను తిప్పికొట్టాల్సిన సమయం వచ్చింది.

- డా|| మాటూరి శ్రీనివాస్‌,
సెల్‌ : 9849000037