
కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించగా బిజెపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో 224 నియోజక వర్గాలకుగాను కాంగ్రెస్ 135 చోట్ల జయకేతనం ఎగురవేసింది. బిజెపి అతికష్టం మీద 66 సీట్లు దక్కించుకోగలిగింది. హంగ్ వస్తుందన్న ఊహాగానాలను కన్నడ ఓటర్లు పటాపంచలు చేసి సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు ఓటేశారు. సంకీర్ణ ప్రభుత్వాల్లో కింగ్ మేకర్ అవుదామనుకున్న జెడిఎస్‌ను 19 సీట్లకు పరిమితం చేశారు. కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో 42.88 శాతం ఓట్లు రాగా బిజెపికి 36 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ గత ఎన్నికల కంటే ఐదు శాతం ఓట్లు, 55 సీట్లు పెంచుకుంది. కాంగ్రెస్ ఈ ఘన విజయానికి బిజెపి అవినీతి, అసమర్ధ పాలనే ప్రధాన కారణం. బెంగళూరు, కళావరి ప్రాంతాలు మినహా తతిమ్మా అన్ని రీజియన్లలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడాన్నిబట్టి బిజెపి పాలనపై ప్రజాగ్రహం ప్రస్ఫుటిస్తుంది. ఎస్‌టి రిజర్వుడ్ స్థానాల్లో ఒక్కటీ బిజెపి గెలవలేదు. ఎస్‌సి కోటా స్థానాల్లో మెజార్టీ కాంగ్రెస్ గెలుపొందింది. నెగ్గిన ముస్లిం అభ్యర్ధుల్లో అత్యధికులు కాంగ్రెస్ వారే. బిజెపి నుంచి ఒక్కరూ గెలవలేదు. దీన్నిబట్టి ఆయా వర్గాల ప్రజలు బిజెపిని ఏ విధంగా ఎండగట్టారో తెలుస్తుంది.
కర్ణాటకలో ఏనాడూ బిజెపి స్వంతంగా పూర్తి మెజార్టీతో గద్దెనెక్కలేదు. 2008లో జెడిఎస్‌ను కలుపుకుంది. 2018లో నాటి గవర్నర్‌ను పావుగా చేసుకొని కొన్నాళ్లయినా కుర్చీలో కూర్చుంది. తదుపరి కాంగ్రెస్, జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఏడాది తిరక్కముందే కాంగ్రెస్, జెడిఎస్‌ల నుంచి 16 మంది ఎంఎల్‌ఎలను సామ దాన భేద దండోపాయాలతో తన వైపు ఆకర్షింపజేసుకొని కాంగ్రెస్-జెడిఎస్ సర్కారును కూల్చేసింది. కాగా ఫిరాయించిన వారిలో ఎనిమిది మంది ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ఆరుగురే గెలిచారు. ఇద్దరు పోటీ చేయలేదు. ఫిరాయింపుదారులకు కన్నడ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పి ప్రజాస్వామ్య విలువలు కాపాడారు. కర్ణాటకలో బిజెపి వచ్చింది మొదలు మతపరమైన ఏదో ఒక వివాదం రేపి మెజార్టీ హిందూ ప్రజల ఓట్లను సమీకరించేందుకు ప్రయత్నించింది. హలాల్, హిజాబ్, అజాన్, టిప్పు సుల్తాన్, ముస్లిం రిజర్వేషన్ల రద్దు, గోవధ నిషేధం, జై హనుమాన్, బజరంగ్‌దళ్ స్వైరవిహారం... కొన్ని మాత్రమే. కోర్టు విచారణలో ఉన్న ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై సాక్షాత్తు సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందంటే బిజెపి ఎంతగా బరితెగించిందో అర్థమవుతుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఉమ్మడి పౌరస్మృతి వంటి వివాదాస్పద హామీలిచ్చింది. పాలనా వైఫల్యాలు, ధరల వంటి ప్రజల దైనందిన సమస్యల ముందు బిజెపి విభజన వాద కుట్రలు పని చేయలేదు. స్థానిక నందిని సహకార పాల డెయిరీని గుజరాత్‌కు చెందిన అమూల్‌లో విలీనం చేస్తామన్న బిజెపి కార్పొరేట్ జాతీయవాద ఎత్తుగడలను కర్ణాటక ప్రజలు ఓటు అనే ఆయుధంతో తిప్పికొట్టారు. డబుల్ ఇంజన్ ప్రచారాన్ని తిరస్కరించారు.
బిజెపిని ఓడించి కన్నడిగులు నిర్ణయాత్మక తీర్పు చెప్పారు. కేంద్ర అధికారాన్ని అడ్డంపెట్టుకొని అంగ, అర్థ బలాలతో, విద్వేష రాజకీయాలతో గెలవాలన్న బిజెపి ఎత్తులను ఓటర్లు తుత్తునియలు చేశారు. దక్షిణ భారతంలో అధికారాన్ని విస్తరించాలని కలలు కంటున్న బిజెపి ఈ ఎన్నికల్లో ఉన్న ఒక్క కర్ణాటక నుంచి ఔట్ అయింది. కర్ణాటక తీర్పు ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణల ప్రజల ఆకాంక్ష. బహుళత్వానికి ప్రతీక. ఈ ఏడాది చివరిలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరం ఎన్నికలున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతోపాటే ఆంధ్రప్రదేశ్ సహా మరో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయి. బిజెపిని ఓడించేందుకు ఎక్కడికక్కడ లౌకిక, ప్రజాస్వామిక శక్తుల ఐక్యతపై కర్ణాటక తీర్పు విశ్వాసం పెంచుతుంది. జనాకర్షకునిగా బిజెపి చెప్పుకునే మోడీ, అపర వ్యూహకర్త అమిత్‌షా ఇద్దరూ కాలికి బలపం కట్టుకొని తిరిగినా కర్ణాటకలో బిజెపిని గట్టెక్కించలేక చతికిలపడ్డారు. వారేమీ అజేయులు కాదు. గట్టి ప్రత్యామ్నాయం ఉన్న చోట బిజెపి 'అపర చాణక్యం' చెల్లదని కర్ణాటక నిరూపించింది.