Jul 21,2022 06:26

రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక మూలాలపై దాడిని కేంద్ర బిజెపి సర్కార్‌ తీవ్రతరం చేసింది. సంక్షోభ కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన బడ్జెట్‌ యేతర అప్పులను బడ్జెట్‌ ఖాతాల్లో కలుపుతామని ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రాలు ప్రతి ఏడాది చేసే అప్పుల పరిమాణంపై కోత పడుతుంది. రెండోవైపు ఒక పథకం ప్రకారం రాష్ట్రాలపై విషపు దాడి మొదలెట్టారు. ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, పరపతి ఆందోళనకరంగా ఉందని కేంద్ర బిజెపి నాయకురాలు పురందేశ్వరి తెగ వాపోయారు. రెండు రోజుల క్రితం పార్లమెంట్లో కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రాలు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నాయని, శ్రీలంకను గుణపాఠంగా తీసుకోవాలని ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీల మీద విరుచుకుపడింది. కేంద్ర ప్రభుత్వం కుట్రతో ఈ ప్రచారానికి పాల్పడుతూ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని దెబ్బ తీస్తూ లొంగదీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇది ప్రజలపై కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న దాడి.
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఏ రాష్ట్రం ఎంత పరిమాణంలో అప్పు తీసుకోవాలనేది నిర్ణయిస్తుంది. ఈ ఏడాది దేశంలోని అన్ని రాష్ట్రాలు రూ. 8.57 లక్షల కోట్లు రుణ పరిమితిగా నిర్ణయించింది. ఈ అప్పు ఆ రాష్ట్రాల స్థూల జాతీయోత్పత్తిలో 3.5 శాతం మించి ఉండకూడదు. ఇది నిబంధన. ద్రవ్య బాధ్యత-బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బిఎం) నిబంధన ప్రకారం కేంద్రం ఈ పరిమితి విధిస్తుంది. దీనికి లోబడి ప్రతి రాష్ట్రం రుణాలు సేకరిస్తాయి. ఈ రుణాలను రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, చిన్న పొదుపు మొత్తాల నుండి, మార్కెట్‌లో బాండ్లను అమ్మడం తదితరాల ద్వారా సేకరిస్తాయి. ఈ అప్పులు బడ్జెట్‌ పత్రాల్లో చూపించబడతాయి. ప్రతి ఏడాది అప్పులపై అసలు, వడ్డీలకు ఎంత చెల్లిస్తున్నారో కూడా బడ్జెట్‌లో ముందుగానే పేర్కొంటారు.
ఈ అప్పుల ద్వారా సేకరించిన ఆదాయం కూడా రాష్ట్రాలు నిర్దేశించుకున్న ఖర్చుల నిర్వహణకు సరిపోనప్పుడు రాష్ట్రాలు తమ పరిధిలో తమ సంస్థలకు, శాఖలకు రుణాలు సేకరించుకోవాలని ఆదేశిస్తాయి. ఇవి తమ ఆస్తులను తనఖా పెట్టడం ద్వారా లేదా ఆదాయాన్ని చూపి బ్యాంకుల ద్వారా, బాండ్ల ద్వారా రుణాలు సేకరించుకుంటాయి. ఈ రుణాన్ని రాష్ట్ర బడ్జెట్‌ పత్రాల్లో చూపిస్తారు. ఈ రుణ వ్యయంపై చెల్లించాల్సిన అసలు, వడ్డీని కూడా బడ్జెట్‌లో పేర్కొనరు. వీటినే బడ్జెట్‌యేతర అప్పులు అంటారు. వీటికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. ఉదాహరణకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ డిస్కామ్‌ల బకాయిల చెల్లింపుల కోసం ఈ సంస్థ చేత అప్పు చేయించింది. ఏపిసివిల్‌ సప్లరు కార్పొరేషన్‌, సిఆర్‌డిఏ, ఏపిటిట్కో, ఏపిఆర్‌డిసి, ఏపిఐఐసి, ఏపిఎస్‌ఆర్‌టిసి, నీటి వనరుల శాఖ, రైతు సాధికార సంస్థ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ తదితర సంస్థల ద్వారా కూడా బడ్జెట్‌ యేతర రుణాలు సేకరించింది. ఇప్పుడు ఏపిబివరేజ్‌ సంస్థల ద్వారా ఈ తరహా రుణాలు సేకరించాలనే ప్రయత్నంలో జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వుంది. కరోనా సంక్షోభంలో రాష్ట్రాల ఆదాయాలు బాగా పడిపోయాయి. అయినా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు రాష్ట్రాలకు ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో చాలా రాష్ట్రాలు బడ్జెట్‌ యేతర రుణాలను 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో ఎక్కువగా తీసుకున్నాయి. ఫలితంగా ఆంధ్ర రాష్ట్రానికి రూ. 35768 కోట్లు, తెలంగాణకి రూ. లక్షా ముప్పై ఐదు వేల కోట్ల బడ్జెట్‌ యేతర అప్పు వుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ తరహా అప్పులున్నాయి. ఈ బడ్జెట్‌యేతర రుణాలు అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 7.9 లక్షల కోట్లు ఉందని, ఈ తరహా అప్పులు పెరిగిపోతున్నాయని, ద్రవ్యలోటు 3.5 శాతం నిబంధనను దాటిపోతుందని అంతిమంగా రాష్ట్రాల రెవిన్యూ వ్యయం పెరుగుదలకు తీవ్ర ప్రభావం పడుతున్నదని కేంద్రం విమర్శిస్తున్నది.
2020-21 నుండి తీసుకున్న బడ్జెట్‌ యేతర రుణాలను 2022-23 ఆర్థిక సంవత్సరం అప్పుల పరిమాణంలో కలుపుతామని కేంద్రం ప్రకటించింది. కరోనాలో రాష్ట్రాలను ప్రలోభపెట్టి పట్టణ సంస్కరణలు, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, విద్యుత్‌ సంస్కరణలు, ఒకే దేశం-ఒకే కార్డు పేర షరతులతో ఇచ్చిన రెండు శాతం అదనపు రుణాన్ని కూడా మొత్తం అప్పుల్లో కలిపేస్తామని చెప్పింది. దీనివల్ల రాష్ట్రాలు ప్రతి ఏడాది తీసుకునే రుణాల పరిమాణం బాగా తగ్గిపోయి రాష్ట్రాలు తీవ్ర ఆర్థిక చిక్కులు ఎదుర్కొంటాయి. అందువల్ల చాలా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో కొంత సడలింపు చేశారు. ఈ రుణాలను 2024-25 వరకు సర్దుబాటు చేస్తామని గతవారం ప్రకటించింది. ఇక భవిష్యత్తులో ఈ తరహా రుణాలు రాష్ట్రాలు తీసుకునే అవకాశం లేకుండా నిర్బంధం ప్రయోగించింది. రాష్ట్రాల బడ్జెట్‌ యేతర రుణాల నియంత్రణకు గత నెల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ధర్మశాలలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో ప్రధాని సమావేశం జరిపి హెచ్చరిక కూడా చేశారు.
కేంద్రం మాత్రం బడ్జెట్‌ యేతర అప్పులు ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ తరహా రుణాలు భారీగానే తీసుకుంటున్నది. ఆహార నిల్వల కోసం భారత ఆహార సంస్థ, ఎరువుల సబ్సిడీ, ప్రధాన మంత్రి ఉజ్వల గ్యాస్‌ పథకం, జాతీయ రహదారుల నిర్మాణం తదితర ఖర్చుల కోసం ఆరు లక్షల కోట్ల పైనే అప్పులు సేకరించింది. వీటి మూలంగా ఈ రంగాలకు అయ్యే ఖర్చును బడ్జెట్‌లో కేటాయింపులకు కోత పెట్టి ఈ రుణాలను వినియోగించుకుంటున్నది. ఈ రుణాలను కేంద్రం కూడా బడ్జెట్‌ పత్రాల్లో చూపించదు.
అంతేగాక కేంద్రం విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నది. ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధన దాటి ద్రవ్య లోటు పెంచుకుంటున్నది. బడ్జెట్‌కి సమకూరే నికర ఆదాయానికి బడ్జెట్‌లో ప్రతిపాదించే వ్యయానికి మధ్య ఉండే లోటును ద్రవ్యలోటు అంటారు. ఈ బడ్జెట్‌ ద్రవ్య లోటును అప్పుల ద్వారా ప్రభుత్వాలు భర్తీ చేసుకుంటాయి. కాని రాష్ట్రాలకు మాత్రం ఈ వెసులుబాటు ఇవ్వకుండా నేడు చేతులు కట్టేస్తున్నది.
రాష్ట్రాల స్థూల జాతీయోత్పత్తిలో మొత్తం అప్పుల శాతం కూడా కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం దాటిందని, ఇది రాష్ట్రాల అభివృద్ధిని దెబ్బతీస్తుందని కేంద్రం విమర్శిస్తున్నది. కేంద్రం మాత్రం ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తున్నది. దేశ స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుండి ఎప్పుడూ పెరగనంత అప్పులు బిజెపి పరిపాలనలో పెరిగింది. 2014 నుండి నేటివరకు దేశీయ అప్పు రెట్టింపయ్యింది. 2022 మార్చి నాటికి మన దేశానికి రూ.133 లక్షల కోట్లు అప్పు ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఇది దేశ స్థూల జాతీయోత్పత్తిలో 78 శాతానికి చేరింది.
కరోనా సంక్షోభంలో రాష్ట్రాల ఆదాయాలు హరించుకుపోయాయి. దేశ ఆర్థిక పరిస్థితి ఇప్పటిలో పూర్తిగా కోలుకునే పరిస్థితి లేదు. కేంద్రం వివిధ రూపాల్లో రాష్ట్రాలకు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను చూపాలి. కేంద్రం నుండి భారీగా నిధులు సమకూర్చే చర్యలు చేపట్టాలి. ఎందుకంటే రాష్ట్రాలకు చాలా పరిమితమైన ఆర్థిక వనరులు మాత్రమే వుంటాయి. మద్యం అమ్మకాలపై వచ్చే పన్ను, స్టాంప్‌ డ్యూటీల రూపంలో రిజిస్ట్రేషన్‌ల మీద వచ్చే ఆదాయం, వస్తు సేవలపై పన్ను, పెట్రో ఉత్పత్తులపై వచ్చే పన్నుతో పాటు కేంద్ర పన్నుల నుండి వచ్చే వాటా మాత్రమే రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరులుగా వుంటాయి. జి.ఎస్‌.టి వచ్చిన దగ్గర నుండి సకాలంలో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన సొమ్మును కేంద్రం చెల్లించటంలేదు. 2022 మార్చి నుండి జిఎస్‌టి నష్టపరిహారాన్ని రాష్ట్రాలకు చెల్లించబోమని కేంద్రం చెప్పేసింది. ఇప్పుడు ''ఒకే దేశం-ఒకే రిజిస్ట్రేషన్‌'' విధానాన్ని ప్రవేశపెట్టి రాష్ట్ర పరిధిలోనే భూమి, భవన రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, ఇతర ఫీజులను జిఎస్‌టి వలే కేంద్రం గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. జాతీయాదాయం పెరిగిన రేటులో దేశ బడ్జెట్‌ ఆదాయం పెరగటం లేదు. కార్పొరేట్లకు లక్షల కోట్లు పన్ను రాయితీలు ఇవ్వడం వల్ల బడ్జెట్‌కు రావాల్సిన ఆదాయం తగ్గిపోతున్నది. ఈ విధానాల వల్ల రాష్ట్రాలు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నాయి.
కేంద్రానికి విస్తృతంగా ఆదాయ వనరులున్నాయి. రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా కేంద్రం జమేసుకునే వనరులు చాలా వున్నాయి. వివిధ పన్నులమీద విధించే సర్‌ఛార్జీలు, సెస్‌లు, ప్రభుత్వరంగ సంస్థలు చెల్లించే డివిడెండ్లు, ఈ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, సంస్థల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాలు పూర్తిగా కేంద్రమే వినియోగించుకుంటుంది. రిజర్వుబ్యాంకు యొక్క మిగులు నిధులను ప్రతి ఏడాది లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వమే వినియోగించుకుంటుంది. వీటిల్లో ఒక్క రూపాయి కూడా రాష్ట్రాలకు ఇవ్వదు. పి.ఎం కేర్‌ వంటి స్కీముల ద్వారా కూడా వేల కోట్ల నిధులు సమకూర్చుకుంటూ లెక్కాపత్రం లేకుండా వాడుకుంటున్నది. అంతేగాక కేంద్రం దేశంలో చేసే అప్పులే గాక విదేశాల నుండి వివిధ రూపాల్లో అప్పులు సేకరించి వాడుకుంటున్నది. ఈ విదేశీ అప్పు నేడు జిడిపిలో 20 శాతానికి చేరింది. ఇప్పుడు విదేశీ బాండ్ల రూపంలో విదేశాల నుండి అప్పులు సేకరించాలని నిర్ణయించింది. ఇక దేశంలో వచ్చే పన్నులలో కూడా రాష్ట్రాలకు బదిలీ చేసే పన్నుల వాటాలో కూడా తీవ్రంగా అన్యాయం జరుగుతున్నది. 2022-23 బడ్జెట్‌ మొత్తం వివిధ పన్నులు, పన్నేతర ఆదాయాల వల్ల చేసే వ్యయంలో రాష్ట్రాలకు కేవలం నూటికి రూ.22 మాత్రమే బదిలీ చేస్తున్నది. మిగిలినదంతా కేంద్రమే వినియోగించుకుంటున్నది. ఈ పరిస్థితులలో రాష్ట్రాలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు నిరాకరిస్తోంది. రాష్ట్రాల అప్పులపై తీవ్ర షరతులు విధిస్తూ ఆర్థికంగా దిగ్బంధనం చేసి లొంగదీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంత కేంద్రీకృత పద్ధతిలో రాష్ట్రాలపై వ్యవహరించిన ప్రభుత్వం మరొకటి లేదు. ఒకపక్క ప్రలోభాలు పెడుతూ మరొకవైపు రాష్ట్రాలను భయపెడుతూ లొంగదీసుకుంటూ ఫెడరల్‌ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నది. ఫెడరలిజం అంటే కేవలం దేశంలో ఒక పరిపాలనా విధానం మాత్రమే కాదు. ఇందులో జాతీయ స్ఫూర్తి, చైతన్యం సమ్మిళితమై ఉంటుంది. భారతీయులమనే భావనతో పాటు ప్రతి పౌరుడు పలానా రాష్ట్రానికి చెందిన వాడినని సగర్వంగా చెప్పుకుంటాడు. ఈ రెండు భావాల మధ్య ఎప్పుడూ ఘర్షణ రాకూడదు. రెండింటి మధ్య సమ భావన ఉండాలి. కానీ నేడు కేంద్ర బిజెపి ఫెడరల్‌ వ్యవస్థపై దాడి చేస్తూ ప్రజల్లో ఉన్న జాతి చైతన్యాన్ని దెబ్బతీస్తున్నది.
కేంద్రం వ్యవహరిస్తున్న ఈ నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా దేశంలో చాలా రాష్ట్రాలు నిరసనలు, ఆందోళనలకు దిగుతున్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలోని వై.ఎస్‌.ఆర్‌.సి.పి ప్రభుత్వం బిజెపికి లొంగిపోతున్నది. నిత్యం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నది. ప్రధానిని వేడుకోవడం, అభ్యర్ధించటం తప్ప పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. పైపెచ్చు బిజెపి విధానాలను నిస్సిగ్గుగా బలపరుస్తున్నది. ఈ లొంగుబాటు రాష్ట్ర ఆర్థిక, రాజకీయ, ప్రజల ప్రయోజనాలకు తీవ్ర ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నది.

state

 

 

 

డా|| బి.గంగారావు (వ్యాసకర్త సెల్‌ : 9490098792)