Nov 16,2022 07:18

వివిధ రకాల మున్సిపల్‌ బాండ్ల రూపంలో నిధులు సమకూర్చుకోవాలని తెలిపింది. ఇప్పటికే ఈ సదుపాయం ఉన్నప్పటికీ దేశంలో అత్యధిక మున్సిపల్‌ సంస్థలు బాండ్ల ద్వారా అప్పులు సేకరించటంలేదని పేర్కొంది. ఇప్పుడు బాంబే స్టాక్‌ మార్కెట్‌ లేదా నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లలో మున్సిపల్‌ సంస్థలు నమోదై నిధులు సమకూర్చుకోవాలి. అలాగే క్రెడిట్‌ రేటింగ్‌ వ్యవస్థను అన్ని మున్సిపల్‌ సంస్థలలో అమలు చేయటం ద్వారా మున్సిపల్‌ సంస్థల ఆర్థిక క్రమశిక్షణ పని తీరును మెరుగు పరచవచ్చని... తద్వారా ప్రతి నగరం లేదా పట్టణం మెరుగైన క్రెడిట్‌ రేటింగ్‌ ర్యాంకులు పొంది ఎక్కువ అప్పులు సమీకరించుకోవచ్చని తెలిపింది.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక సారాంశం ఏమిటంటే పట్టణ మున్సిపల్‌ సంస్థలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు, నిధులపై ఆధారపడ కూడదని తేల్చి చెప్పింది. తమ పరిధిలో ఉన్న పన్ను, పన్నేతర సొంత ఆదాయాలను పెంచుకోవాలని, బాండ్ల రూపంలో అప్పులు సమీకరించుకోవటంతో పాటు, మౌలిక సదుపాయాలను ప్రైవేటీకరించుకోవడం ద్వారా ఆర్థిక భారాలను తగ్గించుకోవచ్చునని ప్రస్తుత మున్సిపల్‌ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా చెప్పింది.

దేశంలోని 27 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమైన 201 మున్సిపల్‌ కార్పొరేషన్ల ఆదాయ వ్యయాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధ్యయనం చేసి ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. దేశంలో ఉన్న పట్టణ, స్థానిక సంస్థలు ఆర్థిక వనరులను పెంచుకోవటానికి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను సూచించింది. వివిధ రకాల అప్పులు సమకూర్చుకోవటం ద్వారా పట్టణ, స్థానిక సంస్థలు ఆదాయ వనరుల కొరతను అధిగమించవచ్చన్నది అందులో ముఖ్యమైనది.
       మొదటగా దేశంలో పట్టణ స్థానిక సంస్థల ప్రస్తుత పరిస్థితిని ఆర్‌బిఐ సమీక్షించి నివేదికలో పేర్కొంది. దేశంలో పట్టణీకరణ వేగంగా పెరుతున్నదని, ప్రపంచంలో 2035 నాటికి అత్యంత వేగంగా పెరుగుతున్న అతి పెద్ద నగరాల్లో భారతదేశంలోని 17 నగరాలు ఉంటాయని తెలిపింది. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను పట్టణ స్థానిక సంస్థలు ప్రజలకు కల్పించలేకపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
       1992లో చేసిన 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం పట్టణ, స్థానిక సంస్థలకు దఖలు పడిన 18 రకాల అధికారాలు, విధులు, నిధులకు నేటికీ స్వయంప్రతిపత్తి కల్పించలేదు. అనేక అధికారాలు ఇప్పటికీ బదిలీ కాలేదని నివేదికలో చెప్పింది. రాష్ట్రాల స్థాయిలో రాష్ట్ర ఆర్థిక సంఘాలు క్రమం తప్పకుండా ఐదేళ్లకు ఒకసారి నియమించక పోవడం, కమిటీ ఇచ్చిన సిఫార్సులను సంవత్సరాల తరబడి ఆమోదించడం లేదని, ఆమోదించిన సిఫార్సులలో కూడా అనేక కోతలు పెడుతున్నారని తెలిపింది. ఇటీవల కాలంలో రాష్ట్రాల బడ్జెట్‌ల నుండి పట్టణ, స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపు బాగా తగ్గిపోయిందని కూడా నొక్కిచెప్పింది.
          దేశంలో మున్సిపల్‌ సంస్థ ఆదాయాలు స్తంభించిపోయాయని, దేశంలోని మొత్తం పట్టణ సంస్థల ఆదాయం దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఒక శాతం లోపుగానే ఉందని నివేదిక విమర్శించింది. ఇతర దేశాల మున్సిపల్‌ సంస్థల బడ్జెట్లతో చూసినప్పుడు సైతం మన దేశంలోని మున్సిపాలిటీల బడ్జెట్ల పరిమాణం నామమాత్రంగా కూడా లేదు. ప్రపంచంలోని అతి చిన్న దేశాలైన బ్రెజిల్‌లో 7.4 శాతం, దక్షిణాఫ్రికాలో 6 శాతం (జిడిపిలో స్థానిక మున్సిపల్‌ సంస్థల ఆదాయాలు) ఉన్నాయని తెలిపింది.
రెండోవైపు దేశంలో మున్సిపల్‌ సంస్థల పన్ను, పన్నేతర సొంత ఆదాయాలు కూడా పెద్దగా పెరగటం లేదని చెప్పింది. ఫలితంగా దేశంలో అన్ని మున్సిపల్‌ సంస్థలు రోజురోజుకి కేంద్ర, రాష్ట్ర గ్రాంట్ల మీదే ఆధారపడుతున్నాయని, వీటి నుండి వచ్చే నిధులు కూడా స్వల్పంగా ఉన్నాయని తెలిపింది.
        2017-20 మధ్యకాలంలో 201 మున్సిపల్‌ కార్పొరేషన్ల ఆదాయ వ్యయాలను ఆర్‌బిఐ పరిశీలన చేసింది. ఈ సంస్థల్లో పన్ను, పన్నేతర ఆదాయాలు ఆయా పట్టణాలు పెరుగుతున్న స్థాయిలో పెరగటంలేదు. ఫలితంగా నిధుల కొరతతో ఆ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించలేక పోతున్నాయని నిర్థారించింది. కనుక దేశంలో ఉన్న పట్టణ మున్సిపల్‌ సంస్థలు కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌ల మీద ఆధారపడకుండా తమ ఆదాయాలు పెంచుకొని మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని సూచించింది.
ఇందులో మొదటిది వివిధ రకాల మున్సిపల్‌ బాండ్ల రూపంలో నిధులు సమకూర్చుకోవాలని తెలిపింది. ఇప్పటికే ఈ సదుపాయం ఉన్నప్పటికీ దేశంలో అత్యధిక మున్సిపల్‌ సంస్థలు బాండ్ల ద్వారా అప్పులు సేకరించటంలేదని పేర్కొంది. ఇప్పుడు బాంబే స్టాక్‌ మార్కెట్‌ లేదా నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లలో మున్సిపల్‌ సంస్థలు నమోదై నిధులు సమకూర్చుకోవాలి. అలాగే క్రెడిట్‌ రేటింగ్‌ వ్యవస్థను అన్ని మున్సిపల్‌ సంస్థలలో అమలు చేయటం ద్వారా మున్సిపల్‌ సంస్థల ఆర్థిక క్రమశిక్షణ పని తీరును మెరుగు పరచవచ్చని తద్వారా ప్రతి నగరం లేదా పట్టణం మెరుగైన క్రెడిట్‌ రేటింగ్‌ ర్యాంకులు పొంది ఎక్కువ అప్పులు సమీకరించుకోవచ్చని తెలిపింది.
        పన్ను, పన్నేతర సొంత ఆదాయాలు బాగా పెంచుకోవాలని రెండో అంశంగా సూచించింది. ఆస్తిపన్ను మదింపుపై, పన్నేతర ఆదాయాలపై గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను అన్ని మున్సిపల్‌ సంస్థల్లో అమలు చేయాలని పేర్కొన్నది.
మొత్తంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక సారాంశం ఏమిటంటే పట్టణ మున్సిపల్‌ సంస్థలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు, నిధులపై ఆధారపడ కూడదని తేల్చి చెప్పింది. తమ పరిధిలో ఉన్న పన్ను, పన్నేతర సొంత ఆదాయాలను పెంచుకోవాలని, బాండ్ల రూపంలో అప్పులు సమీకరించుకోవటంతో పాటు, మౌలిక సదుపాయాలను ప్రైవేటీకరించుకోవడం ద్వారా ఆర్థిక భారాలను తగ్గించుకోవచ్చునని ప్రస్తుత మున్సిపల్‌ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా చెప్పింది.
    ఈ నివేదికలో పేర్కొన్న అంశాలు, సిఫార్సులు చాలా ప్రమాదకరమైనవి. పట్టణ మున్సిపల్‌ సంస్థలు కేంద్ర రాష్ట్ర గ్రాంట్ల మీద ఆధారపడకూడదనేది ప్రపంచ బ్యాంకు సిద్ధాంతం. గత రెండు దశాబ్దాలకు పైగా పట్టణ సంస్కరణలను దేశంలో అమలు చేస్తున్నారు. ఇప్పుడు వీటిని వేగవంతం చేయటానికి కేంద్ర బిజెపి సర్కార్‌ రకరకాల కమిటీలు, నివేదికల పేర పూనుకుంది.
         గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి అమరావతి బాండ్ల పేర రూ.2 వేల కోట్ల అప్పు సమీకరించింది. గతంలో విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌ నగర పాలక సంస్థలు కూడా ఈ తరహా బాండ్లు విడుదల చేసి అప్పులు పొందాయి. బాండ్ల ద్వారా మున్సిపల్‌ సంస్థలు నిధులు సేకరించడం అనే ప్రక్రియ రెండు దశాబ్దాల కిందటే ప్రారంభమైంది. గతంలో పెద్దపెద్ద మున్సిపల్‌ కార్పొరేషన్లు పెద్దపెద్ద ప్రాజెక్టులు చేపట్టినప్పుడు తమ భూములను ప్రభుత్వ బ్యాంకులలో తనఖా పెట్టి అప్పులు తీసుకునేవి. ఇప్పుడు మున్సిపల్‌ సంస్థలు స్టాక్‌ మార్కెట్లలో నమోదై ప్రయివేటు ఏజెన్సీల నుండి నిధులు సమకూర్చుకోవాలనేది ప్రపంచబ్యాంకు ఆదేశం. అలాగే వివిధ రకాల బాండ్లు విడుదల చేసి ప్రైవేటు సంస్థల నుండి అప్పులు సమకూర్చు కోవాలి. ఈ పద్ధతిలో నిధులు సమకూర్చుకునే మున్సిపల్‌ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కొన్ని రాయితీలు కూడా ప్రకటించింది. ఉదాహరణకు స్టాక్‌ మార్కెట్ల ద్వారా రూ.100 కోట్లు అప్పు సేకరించుకుంటే ఆ మున్సిపల్‌ సంస్థకు రూ.13 కోట్లు ఇన్‌సెంటివ్‌గా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది.
        అయితే స్టాక్‌ మార్కెట్ల ద్వారా, ప్రయివేటు ఏజెన్సీల ద్వారా అప్పులు పొందాలంటే ముందుగా క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థల ద్వారా మున్సిపల్‌ సంస్థల ఆర్థిక తీరుపై మదింపు జరగాలి. అప్పులు పొందే అర్హతలు ఈ సంస్థలకు ఉన్నాయా? లేదా? అనేది నిర్థారణ జరగాలి. ఆ తర్వాత క్రెడిట్‌ రేటింగ్‌ 'ఎఎఎ' నుండి 'డి' వరకు ఇస్తారు. ఇటీవల 364 స్మార్ట్‌ సిటీిలు, అమృత నగరాలు క్రెడిట్‌ రేటింగ్‌ పొందాయి. అయితే వీటిలో 144 సంస్థలు మాత్రమే అప్పుకు అర్హత పొందాయి. రేటింగ్‌ ఇచ్చే సంస్థలు బడా కార్పొరేట్‌ సంస్థలు. మన దేశంలో క్రిసిల్‌, కేర్‌, పిచ్‌, స్మేరా, ఎసిఆర్‌ఎ తదితర సంస్థలు ముఖ్యమైనవి. అమరావతికి కూడా క్రిసిల్‌ సంస్థ 'ఎ' ర్యాంక్‌ ఇచ్చింది. ప్రైవేటీకరణ విధానాలు అన్ని రంగాల్లో అమలు చేసే వాటికి, ప్రజల నుండి పౌరసేవలకు పెద్ద మొత్తంలో యూజర్‌ ఛార్జీలు వసూలు చేసే మున్సిపల్‌ సంస్థలకు మొదటి శ్రేణి ర్యాంకులు ఇస్తారు. ప్రైవేటీకరణ విధానాలు అమలు చేయని మున్సిపల్‌ సంస్థలకు క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు అప్పులకు అర్హత కలిగిన ర్యాంకులు ఇవ్వవు. ఇదంతా ఒక పెద్ద తంతు. బాండ్ల ద్వారా అప్పుల సేకరణ, క్రెడిట్‌ రేటింగ్‌ల ప్రధాన ఉద్దేశం...పౌరసేవలను ప్రైవేటీకరించటం, మౌలిక సదుపాయాల కల్పనలో పట్టణ స్థానిక సంస్థల పాత్ర తగ్గించుకోవడం లేదా వైదొలగి ప్రైవేట్‌ సంస్థలకు ధారాదత్తం చేయడం.
          మరోవైపు ప్రపంచ బ్యాంకు, ఏడిబి, డిఎఫ్‌ఐఎ, యు.ఎస్‌.ఎయిడ్‌ వంటి సంస్థలన్ని నేడు మన దేశ పట్టణ, స్థానిక సంస్థలలో ప్రత్యక్ష జోక్యం చేసుకుంటున్నాయి. నిధుల సహకారం పేర పౌరసేవలను ప్రైవేటీకరించాలని షరతులు విధిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా పట్టణ స్థానిక సంస్థలను అప్పుల్లోకి దించటానికి ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయాలని చాలా కాలం నుండి ఒత్తిడి చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పట్టణ మౌలిక సదుపాయాలకు సమీకృత పెట్టుబడి, సిటీ ఛాలెంజ్‌ ఫండ్‌ వంటి సంస్థలను ఏర్పాటు చేసింది. మన రాష్ట్రంలో కూడా జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఎ.పి అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థను ఏర్పాటు చేసింది. తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలు పట్టణ స్థానిక సంస్థల అప్పుల కోసం అనేక సంస్థలను ఏర్పటు చేశాయి. కేంద్ర ఆర్థిక సంఘం నిధుల ద్వారా పట్టణ స్థానిక సంస్థలలో అనేక రకాల సంస్కరణలు అమలు జరుగుతున్నాయి. అంతేకాక కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన జవహర్‌లాల్‌ నెహ్రూ అర్బన్‌ రెన్యువల్‌ మిషన్‌, స్మార్ట్‌ సిటీ, అమృత పథకాల ద్వారా కూడా ప్రైవేటీకరణ విధానాలను పట్టణాలలో అమలు చేస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ పేర పారిశుధ్య నిర్వహణలో ప్రైవేటీకరణ కోసం నగరాలకు ర్యాంకులను ప్రకటించే పద్ధతి తీసుకొచ్చారు. పట్టణ ప్రణాళికా వ్యవస్థను బడా వ్యాపార వాణిజ్య సంస్థల ప్రయోజనాలకు అనుగుణంగా మార్చేస్తున్నారు.
           కోవిడ్‌ను ఆసరా చేసుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే అప్పులకు...పట్టణ సంస్కరణలకు ముడిపెట్టింది. ఆంధ్ర రాష్ట్రం ఈ షరతుకు తలొగ్గి ఆస్తి పన్నును ఆస్తి విలువకు ముడిపెట్టి భారీగా ఆస్తిపన్ను పెంచింది. పారిశుధ్య రంగంలో యూజర్‌ ఛార్జీలు ప్రవేశపెట్టింది. రోడ్ల వెడల్పుల పేర ఇంప్యాక్ట్‌ ఫీజును అమలులోకి తెచ్చింది. ఇలా అనేక రాష్ట్రాలు కేంద్రానికి లొంగి ఈ సంస్కరణలను అమలు చేస్తున్నాయి.
       వాస్తవంగా పట్టణ రంగం రాష్ట్ర జాబితా లోనిది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర జాబితా లోని అనేక రంగాలను తన పరిధిలోకి బలవంతంగా గుంజుకుంటున్నది. దేశవ్యాప్తంగా పట్టణ రంగంలో ప్రైవేటీకరణ విధానాలను అమలు చేయటానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. ఏకపక్షంగా మున్సిపల్‌ సంస్థలకు సంబంధించిన అనేక చట్టాలను మార్చేసింది. మున్సిపల్‌ పరిధిలో ఉన్న కొన్ని పన్నులను కూడా జిఎస్‌టిలో కలిపి మున్సిపల్‌ సంస్థల ఆదాయానికి గండి కొట్టింది. దేశ పట్టణ వ్యవస్థపై కార్పొరేట్‌ శక్తుల దోపిడి పెంచటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అందులో భాగమే ఈ నివేదికలు.

(వ్యాసకర్త సెల్‌ : 9490098792)
డా|| బి.గంగారావు

డా|| బి.గంగారావు