Feb 17,2023 07:42

         ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు నాలుగు రోజుల్లో బలవన్మరణాలకు పాల్పడటం కలవరపరుస్తోంది. ఎన్నో అవరోధాలను అవలీలగా అధిగమించి అత్యున్నత స్థానాలను అధిరోహించాలనే స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు అహరహం జ్ఞాన సముపార్జనలో నిమగమైన భావిభారత ఇంజినీర్లు అర్ధాంతరంగా జీవితాలను ముగించడం విషాదం. ఐఐటిలలో సీటు సంపాదించడం కోసం తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పటి నుంచే సిద్ధం చేస్తారు. ఆ ఒత్తిడినంతటినీ అధిగమించి ఐఐటిలలో సీటు సంపాదించడం సాధారణ విషయం కాదు. ఇలాంటి ముగ్గురు విద్యార్థులు ఈ నెల 12, 13, 15 తేదీల్లో వరుసగా ప్రతిష్టాత్మక బాంబే, మద్రాస్‌ ఐఐటిలు, కాలికట్‌ ఎన్‌ఐటిలో ప్రాణాలు తీసుకున్నారు. ఉన్నత విద్యాసంస్థల్లో వ్యవస్థాగత అసమానతలు, వివక్ష, విద్యకు సంబంధించిన తీవ్రమైన ఒత్తిడి బలవన్మరణాలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
        ఈ నెల 12న బాంబే ఐఐటిలో ఆత్మహత్య చేసుకున్న దర్శన్‌ సోలంకి అహ్మదాబాద్‌కు చెందిన దళిత విద్యార్థి. గత ఏడాదంతా జెఇఇకి సిద్ధమై సాధించి తన కుటుంబానికి, బంధువులకు, తనలాంటి నేపథ్యమున్న ఎందరో విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. దర్శన్‌ మరణం తర్వాత పోస్టుమార్టం జరిగిన ప్రాంతానికి వచ్చిన ఓ బంధువు 'మా పిల్లలు ప్రాణాలు తీసుకోవడానికి ఇక్కడికి రావాలా?' అని ప్రశ్నించడం వారిలో తలెత్తిన కలవరాన్ని, ఆక్రోశాన్ని తేటతెల్లం చేస్తోంది. ప్రమాదవశాత్తూ హాస్టల్‌లోని ఏడో అంతస్తు నుంచి పడిపోయి మరణించినట్లు ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. కులం ఆధారంగా తీవ్ర వివక్షకు గురవడం, ర్యాగింగ్‌ వల్లే దర్శన్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడంటున్న తోటి విద్యార్థులు, అక్కడి అధ్యాపకుల వాంగ్మూలాన్ని తీసుకుని దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయించడం అత్యవసరం. దాన్ని హత్య కేసుగా నమోదు చేయాలని, ఐఐటి బాంబే డైరెక్టర్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్లు సహేతుకమైనవే. 2014లో ఇదే ఐఐటిలో అనికేత్‌ అంబోర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. నాడు దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన విమర్శలతో ఒక కమిటీ ఏర్పాటు చేయగా, 2015లో నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక సిఫార్సు ప్రకారం ఎస్‌సి, ఎస్‌టి స్టూడెంట్స్‌ సెల్‌ను ఏర్పాటు చేయడానికి మరో ఏడేళ్లు పట్టింది. ఈ సెల్‌ నిర్వహించిన సర్వేలో 15నుంచి 20 మంది విద్యార్థులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారని, ఈ విషయంపై సంస్థ నుంచి ఎటువంటి సహాయం అందడం లేదని ఓ సీనియర్‌ ప్రొఫెసర్‌ తెలిపారు. అంబేద్కర్‌ పెరియార్‌ పూలే స్టడీ సర్కిల్‌ (ఎపిపిఎస్‌సి), అంబేద్కర్‌ స్టడీ కలెక్టివ్‌ (ఎఎస్‌సి) వంటి వాటిని నిర్వీర్యం చేసేలా ప్రస్తుత పరిస్థితులున్నాయి. ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ పేరుతో దర్శన్‌ మరణానికి సంతాపం తెలుపుతూ ఇచ్చిన ఇ మెయిల్‌లో ఆయన పేరు లేకపోవడం గమనార్హం. దళిత, బహుజన విద్యార్థులు మరణిస్తే చదువులో ఒత్తిడిని ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకున్నారని ప్రకటించడం, ఇతరులు మరణిస్తే వారి మానసిక ఆరోగ్యం సక్రమంగా లేదంటూ ప్రకటిస్తున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేయడం కూడా ఈ వివక్షకు దర్పణం పడుతోంది. 2016లో హైదరాబాద్‌ యూనివర్శిటీలో పిహెచ్‌డి స్కాలర్‌ రోహిత్‌ వేముల, 2019లో ముంబైలోని టోపీవాలా నేషనల్‌ మెడికల్‌ కాలేజిలో పాయల్‌ తాద్రి కులవివక్షకు గురై ఆత్మహత్య చేసుకున్న తరువాత ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం ఆందోళనకరం. గత ఏడాది ఫిబ్రవరి, జూన్‌లో వివక్షపై రెండు సర్వేలను నిర్వహించినట్లు ఐఐటి బాంబే ప్రకటించింది. వివక్ష, విభజనలను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొనప్పటికీ ఆచరణ రూపు దాల్చలేదు.
        చదువులో పోటీ పేరిట, ర్యాంకింగ్‌ల రేసులో వెనుకబడ్డ విద్యార్థులపై అధ్యాపకుల విపరీతమైన ఒత్తిడి కూడా కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలకు కారణమవుతుంది. జాతీయస్థాయి ఉన్నత విద్యాసంస్థల్లోను, ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో సైతం సంస్థాగత అసమానతలు, వివక్ష కొనసాగుతున్నాయి. ఫలితంగా విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి గురికావడం, ఇంకొంతమంది నిరాశా నిస్పృహలకు లోనుకావడం జరుగుతోంది. అది బలవన్మరణాలకు సైతం దారితీస్తోంది. ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలి.