
కొన్ని చిత్రాలపై జరిగే నెగిటివ్ పబ్లిసిటీ.. దాని మీద మరింత మంది ఫోకస్ పెట్టడానికి కారణం అవుతుంది. ఒక్కోసారి అలాంటి పబ్లిసిటీ సినిమాకు మేలే చేస్తుంది! అలియాభట్ తాజా చిత్రం 'డార్లింగ్స్' విషయంలో అదే జరిగింది. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ద్వారా అలియాభట్ పురుషుల మీద జరిగే హింసను ప్రమోట్ చేస్తోందనేది నెటిజన్ల ఆరోపణ. నిజమే సినిమా లాంటి పవర్‌ఫుల్ మీడియం ద్వారా ఇటు మహిళలపైనా, అటు పురుషుల పైనా.. ఎవరి మీద జరిగే హింసనైనా.. సపోర్ట్ చేయకూడదు. అయితే.. అలా చూపించే హింసకు ఓ బలమైన కారణం ఉన్నప్పుడు, దాన్ని అంగీకరించాల్సిందే. 'డార్లింగ్స్' మూవీ చూసిన తర్వాత డెబ్యూ డైరెక్టర్ జస్మిత్ కె రీన్ ప్రతిభను, తొలిసారి ఈ చిత్రం కోసం ప్రొడ్యూసర్ అవతారం ఎత్తిన అలియాభట్‌ను అప్రిషియేట్ చేయకుండా ఉండలేం. మరి, డార్లింగ్స్ ఎవరు? వారి కథేంటి? చూద్దాం..!
కథలోకి వెళ్తే.. బద్రునిసా అలియాస్ బద్రు (అలియా భట్)కి తల్లే (షెఫాలీ షా) ప్రపంచం. ఈ క్రమంలో బద్రున్నిసా, హమ్జా అబ్దుల్‌షేక్ (విజరు వర్మ) ప్రేమించి, పెళ్లి చేసుకుంటారు. జీవితం పట్ల ఏమాత్రం నిబద్ధత లేని హమ్జా రైల్వే టీసీగా పనిచేస్తుంటాడు. పెళ్లైన మూడేళ్లకే అతను మద్యానికి బానిసవుతాడు. రాత్రి అయితే చాలు తాగి, భార్య బద్రును చావబాదుతాడు. పొద్దున్నే మత్తు దిగిపోయిన తర్వాత ఆమెను బతిమలాడుతాడు. అయితే ఓ పాత అపార్ట్‌మెంట్‌లో ఇటు తల్లి, అటు కూతురు ఎదురుబొదురు ఫ్లాట్స్‌లో నివసిస్తుంటారు. కళ్ల ముందే కూతురును అల్లుడు కొడుతుంటే షంషు చూడలేకపోతుంది. భర్తకు విడాకులిచ్చేసి, తన దగ్గరకు వచ్చేయమని కూతురును పోరుతుంది. కానీ భర్తంటే మనసులో ఎక్కడో తెలియని ప్రేమ ఉన్న బద్రు ఆ పని చేయలేకపోతుంది. అయితే ఎంతో సహనంతో ఉన్న బ్రదు మనసు సైతం ఓ దారుణమైన సంఘటనతో విరిగిపోతుంది. దాంతో భర్తకు తానేమిటో చూపించాలనుకుంటుంది. అసలు, బద్రు- హమ్‌జా కాపురంలో కలతలు ఎవరి వల్ల వచ్చాయి? తల్లి సాయంతో బద్రు ఏం చేసింది? ఫ్యామిలీ ఫ్రెండ్ జుల్ఫీ (రోషన్ మాథ్యూ) వీళ్లకు ఏవిధంగా సహాయపడ్డాడు? భార్యలోని ఆవేశాన్ని గ్రహించి అయినా హమ్జా మారాడా? లేదా? అనేది మిగతా కథ.
ముంబయిలోని ఓ మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో సాగే కథ ఇది. వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. కట్టుకున్న వాడు రోజూ తాగొచ్చి కొట్టడం, ప్రతి చిన్న విషయానికీ అనుమానించడం, ఈ చెర నుంచి భార్య విముక్తి కోరుకోవాలనుకోవడం.. ఇలాంటి వార్తలు మనకి నిత్యం చూస్తూనే ఉంటాం. ఈ అంశాన్నే ఇతివృత్తంగా తీసుకుని తనదైన శైలిలో తెరపైకి తీసుకొచ్చారు దర్శకురాలు జస్మీత్. ప్రచార చిత్రాల్లో కనిపించిన ఇలాంటి సన్నివేశాలను చూసే 'గృహ హింసను ప్రోత్సహించే ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలి' అంటూ ట్విటర్‌లో ఇటీవల పెద్ద ఎత్తున చర్చ సాగింది. అది పక్కన పెడితే, కేవలం నాలుగు ప్రధాన పాత్రలతో సుమారు రెండున్నర గంటల సినిమాని రూపొందించటం అంత తేలిక కాదు. ఈ విషయంలో డైరెక్టర్ విజయాన్ని అందుకున్నారు.

నాయకానాయికల మధ్య రోజూ రాత్రి ఘర్షణ చోటు చేసుకోవడం, ఉదయాన్నే సారీ చెప్పుకోవడం.. ఇలాంటి సన్నివేశాలతోనే ప్రథమార్ధాన్ని నడిపించారు. చిక్కుముళ్ల నుంచి బయట పడటానికి అలియా తన తల్లి షెఫాలీతో కలిసి పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరగడం.. కప్ప, తేలు కథ చెప్పడం.. మంచి కామెడీ పండించాయి. పురుషాహంకార ధోరణికి భార్య చరమగీతం పాడాలనుకునే సన్నివేశాలు తాప్సీ నటించిన 'థప్పడ్'ను గుర్తుచేస్తాయి. ద్వితీయార్ధంలో.. కథానాయకుడు మంచి వ్యక్తిగా మారిపోయాడు అని ప్రేక్షకుడికి అనిపించేలోపు వచ్చే ట్విస్ట్ ఆసక్తి రేకెత్తిస్తుంది. భర్తను దూరం పెట్టేందుకు కథానాయిక వేసిన మాస్టర్‌ప్లాన్‌తో సాగే క్లైమాక్స్ ఎవరూ ఊహించని మలుపు తిరుగుతుంది. ఇదే సినిమాకి హైలైట్.
మధ్యతరగతి ముస్లిం మహిళ పాత్రలో అలియా చక్కగా ఒదిగిపోయింది. ఆమె తల్లిగా 'సత్య' ఫేమ్ షఫాలీ షా నటించింది. భర్తను కోల్పోయిన మహిళగా, కూతురు పట్ల విపరీతమైన ప్రేమ ఉండే తల్లిగా చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది. విజరువర్మ 'హమ్జా' పాత్రకు ప్రాణం పోశాడు. తల్లీకూతుళ్లకు అండగా నిలిచే జుల్ఫీ పాత్రను రోషన్ మాథ్యు సునాయాసంగా చేశాడు. ఇతర ప్రధాన పాత్రలను 'కహానీ ఘర్ ఘర్ కీ' ఫేమ్ కిరణ్ కర్మార్కర్, విజరు మౌర్య, రాజేశ్ శర్మ, సంతోష్ జువేకర్ తదితరులు పోషించారు. ప్రశాంత్ పిళ్లై నేపథ్య సంగీతం బాగుంది. ఇందులో మూడు నేపథ్య గీతాలు ఉన్నాయి కానీ అవి లేకపోయినా బాగానే ఉండేది. అనీల్ మెహతా కెమెరా పనితనం అద్భుతం. నితిన్ తన కత్తెరకు పనిచెప్తే బాగుండేది. విజరు మౌర్య, పర్వేజ్ షేక్, జస్మిత్ కెరీన్ రాసిన సంభాషణలూ బాగున్నాయి.
చిత్రం: డార్లింగ్స్
తారాగణం: అలియా భట్, షెఫాలీ షా, విజరు వర్మ, రోషన్ మ్యాథ్యూ తదితరులు
ఛాయాగ్రహణం: అనిల్ మెహతా
సంగీతం: ప్రశాంత్ పిళ్లై (నేపథ్య సంగీతం), విశాల్ భరద్వాజ్, మెల్లో డీ (పాటలు)
కూర్పు: నితిన్ బైద్
నిర్మాణ సంస్థలు: రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్
దర్శకత్వం: జస్మీత్ కె. రీన్
విడుదల: నెట్‌ఫ్లిక్స్