Oct 31,2023 07:05

భగవత్‌, మోడీలు చేస్తున్న ప్రసంగాలు చూస్తుంటే, హిందూత్వ నిరంకుశ రాజ్యస్థాపన దిశగా వారి యత్నాలు ఉన్నాయనేది స్పష్టం. అన్ని 'పరాయి' శక్తులను ఏరిపారేసేందుకు విద్యా వ్యవస్థను, బహుళ సంస్కృతుల వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంటారు. ఈ వినాశకరమైన, ప్రమాదకరమైన లక్ష్యాన్ని సాధించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, మోడీ ప్రభుత్వం పూర్తిగా పెనవేసుకుని తన విశృంఖుల రూపాన్ని ప్రదర్శిస్తున్నాయి.

ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ పదాన్ని అరువుకు తెచ్చుకోవడంలో ఉద్దేశం తెలిసిందే. ఆర్‌ఎస్‌ఎస్‌ ఫాసిస్టు సిద్ధాంతాన్ని, భారతీయ సమాజాన్ని, సంస్కృతిని ఏకరూపతగా మార్చేందుకు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ పద్ధతుల్ని విమర్శించే వామపక్ష, ప్రజాతంత్ర శక్తులన్నిటిపై 'కల్చరల్‌ మార్క్సిజం' అనే ముద్ర వేస్తోంది.

           నాగ్‌పూర్‌లో ఏటా విజయదశమి ర్యాలీలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ చేసే ప్రసంగంలో సంఘ పరివార్‌కు సంబంధించి కొన్ని అధికారిక ప్రకటనలు వుంటాయి. గత కొన్నేళ్ళుగా సాగిన విజయదశమి ప్రసంగాల మాదిరిగానే ఈ ఏడాది అక్టోబరు 24న జరిగిన ర్యాలీలో కూడా మోహన్‌ భగవత్‌ ప్రసంగం ఇదే థీమ్‌తో సాగింది. మోడీ ప్రభుత్వంతో సంఫ్‌ు పూర్తిగా పెనవేసుకుపోయింది. ఆర్‌ఎస్‌ఎస్‌ మార్గదర్శకత్వంతో నడిచే ప్రభుత్వ ప్రాపంచిక దృక్కోణాన్ని వివరించింది. ఈసారి, మోహన్‌ భగవత్‌ ప్రసంగం రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధతను ప్రస్తావించింది. బిజెపికి, ప్రభుత్వానికి వెనుక దన్నుగా వుండాలంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. భారతదేశాన్ని మహత్తర శక్తిగా రూపొందించేందుకు మోడీ ప్రభుత్వం పట్టుదలతో కృషి చేస్తోందంటూ భగవత్‌ వ్యాఖ్యానించారు. అయితే భారత్‌ పురోగమించాలని కోరుకోని కొంతమంది వ్యక్తుల వల్ల కొత్త ముప్పు ఎదురవుతోందని భగవత్‌ వ్యాఖ్యానించారు. ''అందుకే వారు సమాజంలో వివక్ష సృష్టించడానికి, నిర్మాణాత్మక సమిష్టి కృషిని విచ్ఛిన్నం చేయడానికి యత్నిస్తుంటారు. వేర్పాటువాదాన్ని, ఘర్షణను సృష్టిస్తుంటారు.'' ఈ విధ్వంసకర శక్తులను ''సాంస్కృతిక మార్క్సిస్టులు లేదా వోక్‌ లేదా మేల్కొలుపు వ్యక్తులు''గా ఆయన వ్యాఖ్యానించారు. ఈ శక్తులు ఎలా పని చేస్తుంటాయో ఒక చీకటి దృశ్యాన్ని చిత్రించారు. ''వారి పద్ధతిలో మీడియాను, విద్యారంగాన్ని పూర్తిగా నియంత్రిస్తారు. విద్య, సంస్కృతి, రాజకీయాలు, సామాజిక వాతావరణాన్ని అయోమయానికి గురిచేయడం, గందరగోళ పరచడం, అవినీతి రంగాల్లోకి నెట్టడం వంటివి వుంటాయి.'' అని సెలవిచ్చారు.
ఈ వంకర, టింకరలతో కూడిన, నిగూఢమైన సూత్రీకరణలు దేనితో రూపొందాయి? 'సాంస్కృతిక మార్క్సిస్టులు' అని ఒక పదాన్ని భగవత్‌ ఉపయోగించడం ఆసక్తికరం. అంతర్జాతీయంగా మితవాదులు, నయా ఫాసిస్ట్‌ వర్గాలు ఈ పదాన్ని ఉపయోగిస్తూ వుంటాయి. వారు పేర్కొన్న ప్రకారం, 'సాంస్కృతిక మార్క్సిజం' అనేది పశ్చిమ దేశాల నైతిక విలువలను, నాగరికతను ధ్వంసం చేసి, రాజకీయ దిద్దుబాటు అనే ఉన్నత భావనను విధించే ఒక కుట్ర. ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ పదాన్ని అరువుకు తెచ్చుకోవడంలో ఉద్దేశం తెలిసిందే. ఆర్‌ఎస్‌ఎస్‌ ఫాసిస్టు సిద్ధాంతాన్ని, భారతీయ సమాజాన్ని, సంస్కృతిని ఏకరూపతగా మార్చేందుకు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ పద్ధతుల్ని విమర్శించే వామపక్ష, ప్రజాతంత్ర శక్తులన్నిటిపై 'కల్చరల్‌ మార్క్సిజం' అనే ముద్ర వేస్తోంది. వాస్తవానికి, 1920ల్లో మార్క్స్‌ నుండి వారు దూరంగా వెళ్లిపోయారని మోహన్‌ భగవత్‌ స్వయంగా అంగీకరించినపుడు, సాంస్కృతిక మార్క్పిజం అనే దానికి అర్ధముందా ?
          జాతి దురహంకారం వివిధ రకాల మైనార్టీల పట్ల వివక్షకు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై దాడికి 'వోక్‌', 'వోక్‌ కల్చర్‌' అన్న పదాలను కూడా మితవాద శక్తులు ఉపయోగిస్తుంటాయి. అయితే, ఇక్కడ కూడా, 'వోక్‌'ను ఆచరించేవారు మార్క్సిస్టులు కాదు, పశ్చిమ దేశాల్లో బూర్జువాలు-ఉదారవాదులే దీనిని ఆచరిస్తుంటారు. భారతీయ సంస్కృతి నుండి వేరు పడినందుకు భారత్‌లోని వామపక్ష శక్తులపై దాడి చేసేందుకు అల్ట్రా-కన్జర్వేటివ్‌ల హక్కును భగవత్‌ గుడ్డిగా అనుకరించారు. తద్వారా విద్యా వ్యవస్థకు మతం రంగు పులమడానికి, జెఎన్‌యు వంటి విశ్వవిద్యాలయాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలో జరుగుతున్న యత్నాలను సమర్ధించుకోవాలని చూస్తోంది. విద్యా రంగం మాదిరిగానే, మీడియాను కూడా నియంత్రించడానికి, అణచివేయడానికి వారు ప్రయత్నిస్తున్నారు. 'న్యూస్‌ క్లిక్‌'పై దాడి ఈ కోవకు చెందినదే.
        ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ వాస్తవ లక్ష్యం వామపక్షాలు. పూణేలో ఇటీవల ఒక పుస్తకావిష్కరణ సభలో ఆయన చేసిన ప్రసంగాన్ని చూసినట్లైతే, ఈ విషయం స్పష్టమవుతుంది. విద్యా వ్యవస్థలోకి, ఇతర వ్యవస్థల్లోకి చొచ్చుకుపోయిన వామపక్ష ఆవరణానికి వ్యతిరేకంగా పోరాటం సాగించాలని ఆ కార్యక్రమంలో ఆయన పిలుపునిచ్చారు.
        సామాజిక న్యాయం కోసం వివిధ సామాజిక అణచివేతలకు గురైన గ్రూపులు తమ హక్కుల కోసం గట్టిగా నినదించటం ఆర్‌ఎస్‌ఎస్‌ను ఎక్కువగా కలవర పరుస్తోరది. ఏ రాష్ట్రం లేదా ప్రాంతీయ ఆకాంక్షలనైనా విచ్ఛిన్నకరమైనవిగానే పరిగణిస్తోంది. మణిపూర్‌లో హింస, ఘర్షణలు విదేశీ, విధ్వంసకర శక్తుల కారణంగా చోటు చేసుకున్నాయి తప్ప...ఈశాన్య భారతంలో బిజెపి, సంఘ పరివార్‌ పెంచి పోషిస్తున్న సంకుచిత అస్తిత్వ రాజకీయాల వల్ల కాదని భగవత్‌ అనుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. భగవత్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాలనే అదే రోజు ఢిల్లీలో దసరా ర్యాలీలో ప్రధాని మోడీ కూడా వ్యక్తం చేశారు. కులతత్వం, ప్రాంతీయవాదం పేరుతో దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్న శక్తులను ఓడించడం గురించి ఆయన మాట్లాడారు. ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తయారు చేసేందుకు తాను ప్రయత్నిస్తున్న సమయంలో, కులతత్వం ద్వారా దేశాన్ని విభజించే సాధనంగా కులగణన డిమాండ్‌ను మోడీ చూస్తున్నారు. అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభించడమే జాతీయ పునరుజ్జీవనానికి చిహ్నంగా మోహన్‌ భగవత్‌, మోడీలు చూస్తున్నారు. విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా దీన్ని ఒక సాంస్కృతిక ఐక్యతా చిహ్నంగా వారు చూపుతున్నారు.
          భగవత్‌, మోడీలు చేస్తున్న ప్రసంగాలు చూస్తుంటే, హిందూత్వ నిరంకుశ రాజ్యస్థాపన దిశగా వారి యత్నాలు ఉన్నాయనేది స్పష్టం. అన్ని 'పరాయి' శక్తులను ఏరిపారేసేందుకు విద్యా వ్యవస్థను, బహుళ సంస్కృతుల వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంటారు. ఈ వినాశకరమైన, ప్రమాదకరమైన లక్ష్యాన్ని సాధించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, మోడీ ప్రభుత్వం పూర్తిగా పెనవేసుకుని తన విశృంఖుల రూపాన్ని ప్రదర్శిస్తున్నాయి.
('పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం)