నేను ఈ మధ్య అల్లం రాజయ్య గారు సంపాదకత్వం వహించినటువంటి దండకారణ్యం కథలు చదివాను. ఈ పుస్తకాన్ని విరసం వాళ్లు ప్రచురించారు. ఇందులో మూడు భాగాలుగా కథలు రావడం జరిగింది. ఈ కథలన్నీ అరుణ తారలో అచ్చైనటువంటివి. మొదటి కథల సంకలనం 2005 2012 -16 కథలతో, 2013 -2017 మొత్తం 8 కథలతో రెండవ సంకలనం, ఇప్పుడు 2016 -2019 మొత్తం 14 కథలతో మూడవ కథల సంకలనం తెచ్చారు.. ఈ కథలలో గత 50 ఏళ్లుగా మూడు తరాలుగా సాగుతున్న నూతన ప్రజాస్వామిక రాజ్యాధికార దిశగా సాగుతున్న విప్లవోద్యమాన్ని సాహిత్య పరంగా మరింత అర్థం చేసుకోవడానికి వీలుకలుగుతుంది. తమ సమస్తాన్ని దోచుకుంటున్న బ్రాహ్మణీయ భూస్వామ్యంతో, వలసదారులతో ఆదీవాసులు చేస్తున్న పోరాటాల నుండి విప్లవోద్యమం చాలా నేర్చుకుంది. భారతదేశ సమాజాన్ని గతి తార్కికంగా అధ్యయనం చేస్తూ ఆచరణ ద్వారా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుతుంది.
కథల విషయానికొస్తే ఇందులో మొత్తం 14 కథలు ఉన్నాయి. ప్రతి కథ అనుభవం నుంచి వ్యక్తమయినవే. 'సీతాబారు గెలుపు' అనే కథలో సన్నాఫ్ సీతాబాయి ప్రధానపాత్రగా నడుస్తుంది. సన్నావు ఆ ఊరిలో ప్రజలందరి సమస్యలు పరిష్కరించడం ముందుంటాడు. అంతేకాకుండా గ్రామంలో జరుగుతున్నటు వంటి దోపిడీని అరికట్టడం గురించి ప్రజల్ని చైతన్యవంతం చేస్తాడు. తానేదారు సన్నావును అరెస్టు చేసి తర్వాత ఏం చేశాడన్న.. విషాదం ఈ కథలో ఆద్యంతం దుఃఖపు ఛాయలు అలముకుంటాయి. 'తొలి సంధ్య' కథని వినోద అద్భుతంగా మలిచారు. తులారామ్ కుటుంబం అడవిలో నివసిస్తుండగా.. అక్కడ సహజ వనరులను దోచుకోవాలనే ఉద్దేశంతో ఆ గ్రామం నుండి వలస పెట్టుబడిదారులు గుండాయిజంతో దుర్మార్గంగా తరలించి వేస్తారు. చివరగా అడవులలో వారు పడే పాట్లు అతడి మరణం, తర్వాత వాళ్ల కుటుంబం ఎదుర్కొన్న కష్టాలన్నీ మన కళ్ల ముందుంచారు. 'తెగింపు' కథలో సుక్కో, ఆమె భర్త ఫుల్ సింగ్ ఇద్దరు కూడా ప్రజా సమస్యలపై పోరాడుతుంటారు. ఆ క్రమంలో పోలీసులు ఎత్తుగడలతో ఫుల్ సింగ్‌ను ఎన్‌కౌంటర్లో చంపేస్తారు. దాంతో సుక్కో కూడా తన కుమారుడిని అత్తమామలకు అప్పగించి, దళంలో చేరడంతో కథ ముగుస్తుంది.
'దిక్కారం' కథను ఆసిఫా రాశారు. మహిళలలో లౌకికంగా కనిపించే బలహీనతలను త్రోసిపుచ్చి, వాళ్లల్లోఉండే చైతన్య దిక్కారస్వరాన్ని ఈ కథలో వినిపించారు. ఊరి మీద పడ్డ పోలీసులు పసిబిడ్డల తల్లులను పట్టుకుపోతుంటే వారు ఏవిధంగా ప్రతిఘటించారనే విషయాల్ని సున్నితంగా ఆవిష్కరించారు.
'అమ్మ పాలు ఆయుధాలైన వేళ' కథలో ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్లను రక్షించడంలో ఆడవాళ్లు, వాళ్లు పడుతున్న పాట్లు వివరించారు.'శిక్ష' అనే కథను యామిని కొత్త అనుభవరీతిగా ఆవిష్కరించారు. 'పీలు', 'విప్లవ తరం' 'సహచరులు' అనే కథను తాయమ్మ కరుణ రచించారు. 'నూతన మానవుడు' కథ కూడా చాలా సృజనాత్మకంగా ఆవిష్కరింపబడింది. 'అమూల్యం' తదితర కథలు ఉన్నాయి. మొత్తం మీద దండకారణ్య కథలు నిజంగా 45 ఏళ్ల దోపిడి వ్యవస్థలో జరుగుతున్న విప్లవోద్యమ పోరాటాల్ని ఆవిష్కరించాయి.
నాగరాజు మద్దెల
63019 93211