అందం అపురూపం డాలియా పూల సొంతం. ఉన్నవి కొద్దిరోజులే అయినా?! ఆహా అనిపించటం వీటి నైజం. విభిన్న రంగుల్లో చూడగానే కొట్టొచ్చినట్లు కనిపించే పూలు డాలియాలు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా పెరుగుతాయి ఈ మొక్కలు. మనకి శీతాకాలంలో చక్కగా విచ్చుకోవడంతో వీటిని చలికాలపు పులి రాజాలు అని కూడా పిలుస్తారు. ఇవి దుంప జాతి మొక్కలు. వీటి గురించి తెలుసుకుందాం..!
దుంప నుంచి సన్నటి పొడవాటి తూట వచ్చి, దాని చివరి భాగంలో మొగ్గగా తొడుక్కుని, తర్వాత పువ్వుగా విచ్చుకుంటుంది. పువ్వు నిండుగా రేఖలతో పొద్దు తిరుగుడు పువ్వు మాదిరిగా ఉంటుంది. పువ్వు మొక్క నుంచి తుంచకుండా ఉంటే పదిహేను రోజుల వరకూ నిగారింపుగా ఉంటుంది. పువ్వు నుంచి వాసనలేమీ రాకపోవటంతో కీటకాలు కూడా పెద్దగా వీటి దరిచేరవు. ఆస్టరేసియా కుటుంబానికి చెందిన ఈ మొక్క దుంపలు కొంతకాలం ఐరోపాలో తినేందుకు సాగు చేశారు. ఇది మెక్సికో జాతీయ పువ్వుగా ఉంది. ఈ మొక్కలు ఎక్కడ ఉంటే అక్కడ అందరినీ ఇట్టే ఆకర్షిస్తాయి. ఉండేవి కొద్దిరోజులే అయినా తెగ హడావిడి చేసేస్తాయి. వీటిని కుండీల్లో పెంచుకుని, ఇంటి ముంగిట అలంకరించుకుంటే ఇల్లంతా శోభే.
మొక్కలు ఉత్పత్తి..
సాధారణంగా దుంపల నుంచి డాలియా మొక్కలు పెరుగుతాయి. పెరుగుదల ఉన్న దుంపను చిన్న చిన్న కుండీల్లో నాటుకోవాలి. దుంపకి పైన రెండు మూడు అంగుళాలు మాత్రమే మట్టి ఉండాలి. ఎరువు, ఇసుక కలిసిన మట్టి, పొడి నేలల్లో డాలియా మొక్కలు బాగా పెరుగుతాయి. నాటిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు చల్లాలి.
నీళ్లు ఎక్కువ అయితే దుంప కుళ్లిపోయి, చనిపోయే ప్రమాదం ఉంది. వారం రోజులకి అంకురం తొడిగి, మొక్క బయలుదేరుతుంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో దుంపలు నాటడానికి అనువైన వాతావరణం. నవంబర్ నాటికి అడుగు నుంచి రెండడుగుల వరకూ సన్నగా కాండంలా పెరిగి, మొగ్గ తొడిగి, పువ్వులు పూస్తాయి.
చలికాలంలో ఈ పూలు మరింత నిగారింపుగా ఉంటాయి. వర్షం తాకిడికి గురైతే మాత్రం పువ్వు వాడిపోయి, మొక్క కూడా కుళ్లిపోతుంది. జనవరి మధ్య అంతరానికి పూల కాపు పూర్తయ్యి, మొక్క కూడా చనిపోతుంది.
విత్తన నిల్వ ఇలా..
మొక్క చనిపోయాక మట్టిలో దుంప కొన్నాళ్లు ఊరుతుంది. దుంపని తీసి, నీడలో ఆరబెట్టి జాగ్రత్తగా ప్యాక్ చేయాలి. దీన్ని అటకపై ఉంచితే మరుసటి సీజన్‌కి విత్తనంగా ఉపయోగపడు తుంది. ప్రతి కణుపు నుంచీ మొక్కలు బయలుదేరతాయి. అక్టోబర్ చివరి వారం నుంచి తయారుచేసిన నారు మొక్కలు నర్సరీల్లో అందుబాటులోకి వస్తాయి. ఉత్తరాది రాష్ట్రాల వాతావరణంలో ఈ చిన్న మొక్కలు బాగా అంకురిస్తాయి. నారుని మనం నేరుగా కుండీల్లో నాటుకుంటే చకచక నెలా పదిహేను రోజుల్లో పెరిగేసి, అందంగా పూలు విచ్చుకుని.. అపురూప హొయలు ఒలకబోస్తాయి.
ఇక శీతాకాలంలో పువ్వులతో వికసించే రెడీమేడ్ మొక్కలు నర్సరీల్లో అందుబాటులో ఉంటాయి. ఇవి రెండేళ్లపాటు చక్కగా ఇల్లంతా కనువిందు చేస్తాయి.
ఎన్నెన్నో రకాలు..
డాలియాలోని ఇప్పుడు వందల రకాల సరికొత్త మొక్కలు పుట్టుకొస్తున్నాయి. దేశవాళీ డాలియా మొక్క రెండడుగుల వరకూ పెరిగి, అరచేతి పరిమాణం ఉన్న పువ్వును కలిగి ఉంటుంది. పువ్వు అంతా ఒకే రంగులో ఉంటుంది. ఈ మొక్కకు సీజన్లో నాలుగైదు పువ్వులు మాత్రమే పూస్తాయి.
మరో అధునాతన రకం మల్టీకలర్ డాలియాలు. ఈ మొక్క ఒక సాధారణ డాలియా కంటే కాస్త పొట్టిగా, మరుగుజ్జుగా పెరుగుతుంది. పూసే ప్రతి పువ్వు విభిన్న రంగుల మేళవింపుతో భలే అందంగా ఉంటుంది. ఈ పూల మొక్క నుంచి రసాయన ద్రావణాలున్న వాజుల్లో అలంకరించుకోడానికి ఇటీవల ఈ పువ్వులు ఎక్కువ వాడుతున్నారు.
కాకపోతే ఈ శీతాకాలం సీజన్లోనే అందుబాటులో ఉంటాయి. డ్వార్ప్ డాలియాలు వీటిలో ఇంకోరకం. ఇది కూడా మొక్క చిన్నగానే ఉంటుంది. పువ్వులు కూడా చిన్నగా ఉంటాయి. కుండీ నిండుగా పదుల సంఖ్యలో పువ్వులు పూయడం ఈ సరికొత్త రకం ప్రత్యేకత. అధునాతన సాంకేతిక విధానంలో తయారుచేసిన ఈ మొక్కలు ఫ్లోరీ బెడ్. చామంతి పరిమాణంలో ఉండే పువ్వులు. ఈ మొక్కలు నిండుగా పూస్తాయి. వీటిలో చాలా రకాలు పువ్వులు పూసే మొక్కలు అందుబాటులోకి వస్తున్నాయి.
బాల్ డాలియా కూడా లేటెస్ట్ వెరైటీ మొక్కలే. పువ్వులు చక్కగా బంతుల్లాంటి ఆకారంలో ఉంటాయి. ఇవి చూడ్డానికి ముచ్చటగొలుపుతాయి.
- చిలుకూరు శ్రీనివాసరావు
8985945506