- వహీదా రెహమాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత నిష్ణాతులైన నటీమణుల్లో వహీదా రెహ్మాన్ (87) ఒకరు. ఈ ఏడాది ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే జీవన సాఫల్య పురస్కారం పొందిన సందర్భంగా ఆమెను అభినందనలు ముంచెత్తుతున్నాయి. 1936 ఫిబ్రవరి 3వ తేదీన జన్మించిన వహీదా... తన సినీ నటనా ప్రస్థానం తెలుగులో మొదలై, బెంగాలీ, హిందీ చిత్రాల్లో ఉధృతంగా సాగింది. ఆమె తన అసమాన ప్రతిభతో రాణించారు. ప్రేక్షకుల అభిమానాన్ని, అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. 1955లో తెరకెక్కిన 'రోజులు మారాయి' తెలుగు చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఈ చిత్రంలోని 'ఏరువాక సాగారో రన్నో..' పాట ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. తర్వాత 1956లో సీఐడీ చిత్రంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తరువాత 'ప్యాసా', 'గైడ్' వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఐదు దశాబ్దాల కాలంలో అన్ని భాషల్లో కలిపి 90కు పైగా చిత్రాల్లో నటించారు. 1972లో ఉత్తమ నటిగా వహీదా జాతీయ అవార్డును అందుకున్నారు. 1972లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ పురస్కారాలు పొందారు.
వహీదా రెహ్మాన్ నటించిన ప్యాసా (1957), కాగజ్‌కే పూల్ (1959), చౌద్విన్‌కా చంద్ (1960), సాహిబ్ బీబీ ఔర్ గులామ్ (1962), గైడ్ (1965) విజయం సాధించాయి. రామ్‌ఔర్ శ్యామ్ (1967), ఖామోషి (1969), రేష్మా ఔర్ షేరా (1971) చిత్రాల్లో నటనకు పురస్కారాలు అందుకున్నారు. 1970 ప్రారంభం నుంచి ఆమె ప్రధానంగా సహాయక పాత్రల్లో నటించారు. కబీ కబీ (1976), చాందిని (1989), లమ్హే (1991), త్రిశూల్ (1978), నమ్కీన్ (1982), నమక్ హలాల్ (1982), మషాల్ (1984), రంగ్ దే బసంతి(2006), ఢిల్లీ 6 (2009)లో నటించారు. 1994లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. తర్వాత నుంచి సినిమాల్లో అప్పుడప్పుడు మాత్రమే కనిపించారు. పేదరికంపై పోరాడుతున్న రంగ్ దే సంస్థకు అంబాసిడర్‌గా ఉన్నారు. వహీదా తాజాగా కమల్ హాసన్ విశ్వరూపం 2 నటించారు. ప్రస్తుతం ఆమె ముంబైలో నివసిస్తున్నారు.
డాక్టర్ కావాలనుకొని ...
తమిళనాడులోని చెంగల్‌పేటలో దక్కనీ ముస్లిం కుటుంబంలో వహీదా జన్మించారు. ఆమె తండ్రి మహమ్మద్ అబ్దుర్ రెహ్మాన్, తల్లి ముంతాజ్ బేగం. నలుగురు కుమార్తెలలో వహీదా రెహ్మాన్ ఆఖరి అమ్మాయి. తండ్రి ఉద్యోగరీత్యా వారి కుటుంబం విశాఖపట్నం, విజయవాడలలో కొన్నాళ్లు పాటు నివసించింది. చిన్నతనంలో ఆమె, తన అక్కలతో కలిసి చెన్నైలో భరతనాట్యం శిక్షణ పొందింది. విశాఖపట్నంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్‌లో చదువుకుంది. ఆమె 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు 1951లో తండ్రి మరణించారు. డాక్టర్ కావాలనేది వహీదా కల, కుటుంబ పరిస్థితులు మారడంతో చెదిరిపోయింది. కుటుంబానికి తన వంతు సహాయం చేయడానికి సినిమా ఆఫర్లను అంగీకరించింది.
ప్రముఖ వైద్యుడు, సామాజిక కార్యకర్త అయిన ఆమె మేనమామ డాక్టర్ ఫిరోస్ అలీ నిర్వహించిన బ్రహ్మపూర్‌లోని గంజమ్ కళా పరిషత్‌లో నర్తకిగా ఆమె మొదటి ప్రదర్శన ఇచ్చారు. తరువాత తమిళ చిత్రం 'అలీబాబావుమ్ 40 తిరుదర్గలమ్'తో డ్యాన్సర్‌గా అరంగేట్రం చేశారు. కానీ, తెలుగు సినిమా రోజులు మారాయి (1955) మొదట విడుదలైంది. రోజులు మారాయి, జయసింహ తెలుగు చిత్రాలతో ఆమె నృత్యకారిణిగా ఆకట్టుకుంది. అభిజన్ (1962)తో బెంగాలీ చలనచిత్ర నిర్మాణంలోకి ఆమె ప్రవేశించింది. దీని తరువాత, ఆమె బాత్ ఏక్ రాత్ కీ (1962)లో హత్య అనుమానిత పాత్రలో నటించింది. రాఖీ (1962)లో తోబుట్టువుల గొడవలో చిక్కుకున్న అమ్మాయి, ఏక్ దిల్ సౌ అఫ్సానే (1963)లో సంతానం లేని మహిళగా నటించింది. 1974లో కమల్‌జిత్ (శశిరేఖిని)ని వివాహం చేసుకొంది.

తొలి పాటతోనే నీరాజనం
వహీదా రెహమాన్ తొలిసారి వెండితెరపై ఒకే ఒక్క పాటతో అద్భుతంగా మెరిసి, తెలుగు ప్రజల్లో చిరస్థానాన్ని పొందారు. అది రోజులు మారాయి సినిమాలోని 'ఏరువాక సాగారో రన్నో చిన్నన్న' పాట. దీనికన్నా ముందు ఆమె ఎన్టీఆర్‌తో కలిసి జయసింహ సినిమాలో నటించారు. అదింకా విడుదల కాకముందే - తాపీ చాణుక్య దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'రోజులు మారాయి' సినిమాలో ఒక కీలకమైన సన్నివేశంలో వచ్చే పాటలో నర్తించారు. పాట అద్భుతమైన వేగంతో, అందరికీ అర్థమయ్యే సాహిత్యంతో సాగుతుంది. అది రైతు జీవితానికి సంబంధించిన పాట. తెలుగు నాట కమ్యూనిస్టు ఉద్యమం, రైతాంగ పోరాటాలూ ఉధృతంగా సాగుతున్న కాలం. చక్కని జానపద బాణీలో కొసరాజు రాఘవయ్య ఈ పాటను సమకూర్చారు. మాస్టర్ వేణు స్వరాలు సమకూర్చారు. ప్రధాన నటులు నాగేశ్వరరావు, షావుకారు జానకి, ఇతర రైతులూ నాగళ్లకు ఎడ్లను పూన్చి, ఏరువాకకు సిద్ధమైన సందర్భంలో ఈ పాట మొదలవుతుంది. డప్పుల దరువుల మధ్య చూడచక్కని అభినయం, కళ్లు తిప్పుకోనివ్వని హావభావాలతో వహీదా నర్తించింది. ఆ ఒక్క పాటతోనే ఎందరో అభిమానులను సంపాదించుకొంది. ప్రపంచానికి అన్నం పెట్టే రైతులను ఉత్తేజపరుస్తూ సాగే ఈ పాట సాగు ప్రక్రియనూ కళ్లకు కట్టిస్తుంది. రైతుల ప్రాధాన్యాన్ని వివరిస్తుంది. ఈ పాట ఇప్పటికీ టీవీల్లోనో, ఎఫ్‌ఎం రేడియోల్లోనో హుషారుగా వినిపిస్తూనే ఉంటుంది. అయితే, రోజులు మారాయి, మారాలి అన్న ఆకాంక్షే ఇంకా నిజం కాకుండా ఉంది.
ఈ అవార్డు వాళ్లకి అంకితం: వహీదా రెహమాన్
దాదా సాహెబ్ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని వహీదా రెహమాన్ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ఆమె మీడియాతో మాట్లాడుతూ... 'నా నటనకు మరొక గుర్తింపు దక్కినందుకు ఆనందంగా ఉంది. ఎవరైనా అంకితభావం, నిజాయితీతో పనిచేస్తే తప్పకుండా దానికి తగిన ఫలితం ఉంటుంది. ఈ అవార్డును నా తోటి నటీనటులకు అలాగే సినీ రంగంలోని అందరికీ అంకితం చేయాలనుకుంటున్నా. ఇదంతా వారి వల్లనే సాధ్యం. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దాని వెనుక ఎంతోమంది ఉన్నారు.' అని చెప్పారు. జీవితంలో ఏది సాధించాలన్నా ధైర్యం ముఖ్యమని, ఓటమికి భయపడి వెనుకడుగు వేయకూడదని అన్నారు.










