Jun 19,2022 10:21

తల్లి మనకి జన్మనిస్తే.. తండ్రి ఆ జన్మకి మూల కారణం... మనమంటూ జీవం పోసుకున్నామంటే.. అది తల్లిదండ్రులిద్దరి చలవే.. అయితే మనలో చాలామంది తల్లి చాటు బిడ్డలమనేది సత్యం. కానీ తల్లితో సరిసమానమైన ప్రేమను.. తండ్రీ మనకు అందిస్తాడనడంలో అతిశయోక్తి లేదు.. ''తనలో ఉన్న భావోద్వేగాలను అంత సులువుగా బయటపెట్టుకోలేక.. బయటకి గంభీరంగా కనిపిస్తూ.. ఆ స్పందనని తన ముఖంలో కనబడనివ్వని వ్యక్తే తండ్రి'' అనే నానుడి మన సమాజంలో బాగా నాటుకుపోయింది. తల్లి ప్రేమ భావోద్వేగాలతో ముడిపడి ఉంటే.. తండ్రి ప్రేమ బాధ్యతతో ముడిపడి ఉంటుంది. ఉద్యోగం అంటూ ఉదయాన్నే లేచివెళ్లే 'నాన్న'.. ఇంటిపట్టున ఉండలేడు.. కంటి నిండా నిద్రపోలేడు.. ఇంటి బాధ్యతలను ఒంటి స్తంభంలా మోస్తూ, తన సంపాదనంతా కుటుంబానికే వెచ్చిస్తాడు. పిల్లల భవిష్యత్తుకు నిరంతరం తాపత్రయపడతాడు. అటువంటి నాన్నకూ అమ్మతో సమానమైన గుర్తింపు ఉండాలనే తలంపుతో 1910 జూన్‌లో మూడో ఆదివారం తొలిసారిగా ఫాదర్స్‌ డే వేడుకలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేక కథనం..

11

 

నాన్నంటే అడగకుండానే దొరికిన జీవితకాల బహుమతి. బతుకంతా నీడనిచ్చే పెద్ద చెట్టు. బిడ్డల భవిష్యత్తుకు వెలుగులు అద్దడం కోసం తాను కొవ్వొత్తిలా కరగిపోతాడు నాన్న. అమ్మఒడి ప్రేమలు పంచే గుడి అయితే... నాన్న భుజం ఈ ప్రపంచాన్ని కళ్లముందుకు తెచ్చే శిఖరం. పిల్లల జీవితానికి బంగారు బాటలు పరిచే కార్యసాధకుడు నాన్న. బాధలన్నీ తన గుండెల్లోనే దాచుకుని ముఖంపై నవ్వులు పులుముకుంటాడు. బిడ్డల మనసుల్లో నిరంతరం ధీమా నింపుతూ దీక్షగా ముందడుగేస్తాడు. అసలు నాన్నను అర్థం చేసుకునే అవకాశం ఎంత మంది పిల్లలకు వస్తుంది? కన్నబిడ్డలపై అపారమైన ప్రభావం చూపిస్తారు తల్లిదండ్రులు. కుటుంబం కోసం అనుక్షణం ఎంతో కష్టపడినా ఎప్పుడూ తెర వెనకాలే ఉండే వ్యక్తి నాన్న. ఆయన ప్రేమ ఎవరికీ అర్థం కాదు. తన కష్టాలకు, త్యాగాలకు ఏనాడూ ప్రతిఫలం ఆశించని నిస్వార్థ వ్యక్తిత్వం నాన్నది.

 

88


 

                                                               మార్పులకు అనుగుణంగా..

మారుతున్న కాలానికి అనుగుణంగా నాన్న తన బిడ్డల భవిష్యత్తు కోసం తనను తాను ఎప్పటికప్పుడు మలుచుకుంటున్నాడు. ప్రపంచీకరణ నేపథ్యంలో తండ్రి పాత్ర మారిపోయింది. బాధ్యతల బరువు పెరిగింది. పోటీ ప్రపంచంలో సవాళ్ళను ఎదుర్కోవడంలో తర్ఫీదు ఇస్తూనే.. తానూ బాధ్యతల నిర్వహణలో రాటు తేలుతున్నాడు. ఆధునిక సమాజంలో మార్పులకు తగ్గట్టు, కుటుంబానికి తగ్గట్టు ఆ మాటకొస్తే పిల్లలకు నచ్చినట్టు మారిపోయాడు. చిన్న పిల్లలకు గురువుగా, వారికి వయసు పెరిగే కొద్దీ స్నేహితుడిగా, వారికి పెళ్ళయ్యాక మార్గదర్శిగా మారిపోయాడు. కుటుంబం కోసం తనను తాను మార్చుకున్నాడు. తన కలల రూపాలైన పిల్లల కోసం తల్లిలా మారిపోయాడు. ఉద్యోగం, కష్టాలు, అసౌకర్యాలు, అనర్థాలు ఎన్ని ఎదురైనా ఎదురుగా పిల్లలు కనిపిస్తే తాను చిన్నపిల్లాడిలా మారిపోవడం నేర్చుకున్నాడు. పిల్లలు ఒంటరితనంతో బాధపడుతున్నప్పుడు ఓ జవాబుగా మారిపోతున్నాడు. ఒకప్పటి గాంభీర్యాన్ని మమకారంగా మార్చి, కరిగిపోవడం నేర్చుకున్నాడు. పిల్లల మనసులో ఏముందో కనుక్కోవడానికి తన మనసు విప్పే విద్యను అవపోశన పట్టేశాడు. అందుకే అమ్మకు ధీటుగా నాన్న కూడా పిల్లలకు దగ్గరయ్యాడు. అందుకే ఇప్పటితరం పిల్లల్లో చాలా మంది నాన్నకు ప్రేమతో దగ్గరైపోతున్నారు.

 

                                                                    కన్న వాళ్ల కోసం..

గతంలో తల్లికి దగ్గరగా ఉండే పిల్లలు నేడు తండ్రికి దగ్గరవుతున్నారు. తండ్రి ఓ స్నేహితుడిగా, పిల్లల మానసిక పరిస్థితులను బట్టి సలహాలు, సూచనలు ఇస్తూ వారి ఎదుగుదలకు కృషి చేస్తూ ఉంటాడు. తాను కరుగుతూ తన బిడ్డల ఎదుగుదలకు, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు తండ్రి చేసే త్యాగం మాటల్లో చెప్పలేనిది, వెలకట్టలేనిది. జీవితపు రహదారిలో ఎన్ని గతుకులు వున్నా, అలుపెరగక తనని కన్నవాళ్ల కోసం, తను కన్నవాళ్ల కోసం ప్రతిక్షణం తపించే మహనీయుడు నాన్న. నాన్న దండనలో ఓ హెచ్చరిక ఉంటుంది. అది జీవితంలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకులని దాటేందుకు ఉపయోగపడుతుంది. నాన్న చూపిన బాటలో విజయం ఉండొచ్చు, ఉండక పోవచ్చు. కానీ అపజయం మాత్రం ఉండదు. గెలిచినప్పుడు పదిమందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి, ఓడినప్పుడు భుజంపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకి తీసుకుని, భరోసానిచ్చే వ్యక్తి నాన్న.

 

22


 

                                                         వారిని ఎలా చూసుకోవాలి ?

మన కోసం ఎన్నో కష్టనష్టాలు, వ్యయప్రయాసలను ఓర్చుకుంటారు. త్యాగాలు సపర్యలు, సేవలు చేసీ చేసీ.. వాళ్లు వయసులో ఉన్నప్పుడు మన కోసం కరిగిపోతారు. వారి శరీరం వంగిపోయినప్పుడు, ముడతలు పడేలా కష్టపడినప్పుడు, వారి వృద్ధాప్యంలో మనం వారికి ఏం చేస్తున్నాం? ఏం చేయాలి? అన్నది ముఖ్యం. ఇప్పటి కాలంలో మనం సాంకేతికంగా చాలా ముందున్నాం. ఇదంతా నాన్నకు తెలియదు. మనం నాన్నకు తెలియజెప్పాలి. చెప్పడానికి విసుగుచెందకూడదు. చిరాకు పడకూడదు. నాన్నకు అన్నీ బోధపడేలా చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే.. మన పిల్లలు మనల్ని కొత్త విషయాలు గురించి ప్రశ్నించినప్పుడు ఎలా ఓపికతో చెప్తామో.. అచ్చం అలాగే..! ఎందుకంటే వయసు పెరిగిన కొద్దీ నాన్న కూడా ఓ కొడుకే.. వాళ్ల నాన్న నుంచి ఎలాంటి ప్రేమనైతే కోరుకుంటాడో.. అదే ప్రేమను.. వాత్సల్యాన్ని కొడుకుల నుంచి కోరుకుంటారు.
     నాన్నంటే అనురాగం, అర్ధ జీవితం ధారపోసి.. పెంచిన పితృమూర్తి అని పిల్లలు గుర్తించాలి. తన రెక్కల కష్టం పిల్లలకు తెలియకుండా.. వారి ఆలనా, పాలనా చూసి పిల్లల బాగోగులే కోరుకునే వ్యక్తి నాన్న. అటువంటి నాన్నకు ఏమిచ్చినా తక్కువే. అలాంటి తండ్రికి ఏం చేసినా తక్కువే. నీ కడుపున పుట్టిన పిల్లలు నీకు ఎంత మధురమో.. నిన్ను కనిపెంచిన తండ్రి అంతే అపురూపం. అందుకే నాన్నను వెనకబడనీయకండి. నాన్నకు చేయూతనివ్వండి. నాన్నతో కలిసి నడవండి. మీ నాన్నకు నాన్న అవ్వండి.
 

                                                            తడబడే వయస్సులో..

ఆయన మనకోసం చేసిన త్యాగాలకు ప్రతిఫలంగా మనం ఏం ఇస్తున్నాం? ఆ వయసులో వారు కోరుకునేదేంటి? కాస్తంత ప్రశాంతత. వాళ్లు ప్రశాతంగా ఉండేలా చూడాలి. మన పిల్లలతో ఆడుకునే సమయాన్ని ఇవ్వాలి. ఆయన తన అనుభవాలను చెబుతుంటే శ్రద్ధగా విని, వారిని సంతోషపెట్టాలి. వారి మాటల్లోని అనుభవసారాన్ని గ్రహించి, మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. అప్పుడు వారి వృద్ధాప్యం కూడా బాగుంటుంది. వృద్ధాప్యం వారికి బాధాకరంగా అనిపించకూడదు. వారు ఉండే వాతావరణం కానీ ప్రదేశాన్ని కానీ ప్రశాంతంగా ఉంచాలి. తల్లిదండ్రులను బాగా చూసుకుంటే మన బాధ్యతను, కర్తవ్యాన్ని నెరవేర్చడమే. అమ్మానాన్న మనకు ఇంత గొప్ప శరీరాన్ని, మనస్సును, జ్ఞానాన్ని అందించారు. ప్రపంచంలోకి తెచ్చారు. ఇన్ని ఇచ్చిన తల్లిదండ్రులు అడుగులు తడబడే వయసులో ఉన్నప్పుడు వారికి మనం ఊతకర్ర అవ్వాలి.
 

                                                             ఎలా వచ్చిందంటే..

అమెరికాలోని వాషింగ్టన్‌లోని స్పోక్యాన్‌ అనే గ్రామంలో దీనికి అంకురార్పణ జరిగింది. విలియం స్మార్ట్‌ అనే ఆయన స్పోక్యాన్‌లో నివసించేవాడు. అమెరికాలో సైన్యంలో పనిచేసేవాడు. అతని భార్య హెన్నీ జాక్సన్‌ స్మార్ట్‌కి అప్పటికే ఐదుగురు పిల్లలు. ఆరో కాన్పు కష్టమైంది. ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆమె పేరే సోనారా. కానీ జన్మించిన ఆరు నెలలకే జాక్సన్‌ స్మార్ట్‌ కన్నుమూసింది. విలియం స్మార్ట్‌ మరో వివాహం చేసుకోలేదు. బిడ్డలకి అన్నీ తానయ్యాడు. తన వ్యవసాయ క్షేత్రంలో పని చేసుకుంటూ ఆరుగురు పిల్లలనీ కంటికి రెప్పలా పెంచాడు. సోనార్‌కి 27 ఏళ్ల వయసు వచ్చాక తన తండ్రి జన్మించిన జూన్‌లో తండ్రులందరి జన్మదినంగా జరపాలని ఆలోచన వచ్చింది. అది గ్రామస్తులకీ నచ్చడంతో అప్పట్నుంచి వారు ఆ గ్రామంలో వేడుకలు జరుపుకోవడం ప్రారంభించారు. 1910 జూన్‌ మాసం స్పోకాన్‌లో తొలి ఫాదర్స్‌డే ను ఆమె నిర్వహించింది. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుతూ రావడంతో 1924తో నాటి అధ్యక్షుడు లిండా జాన్సన్‌, 'ఏటా జూన్‌ మాసంలో వచ్చే మూడో ఆదివారం ఫాదర్స్‌డే ఉత్సవం జరుపుకోవాలి' అని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాల్లో తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. కాగా మార్చి 19న పోర్చుగల్‌లోని స్పెయిన్‌లో, ఆగస్టు 8న తైవాన్‌లో, డిసెంబర్‌ 5న థారులాండ్‌లో నిర్వహిస్తారు.
 

                                                                ఆలనా.. పాలనలో..

కాలం మారింది కాలంతో పాటు జీవనశైలి మారింది. పురుషులతోపాటు మహిళలూ ఉద్యోగాలు చేస్తూ, కుటుంబ బాధ్యతల్లోనే కాకుండా.. ఆర్థిక బాధ్యతలనూ పంచుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో పిల్లల ఆలనాపాలనా తల్లులే కాకుండా.. నాన్నలూ బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తండ్రి తోడు ప్రతి బిడ్డకు ఓ రక్షణ కవచం. మగ పిల్లలకంటే తండ్రితో ఆడపిల్లలకి అనుబంధం ఎక్కువ. బొమ్మలు ఎన్ని బహుమతిగా ఇచ్చినా నాన్న ఉంటే చాలు, తానే బొమ్మయి ఆడించే నాన్న ఉంటే.. ఇంకేం కావాలి పిల్లలకు. కోరినవన్నీ క్షణాల్లో తెచ్చిపెట్టే తండ్రే తమ లోకం అనే భావన ప్రతి బిడ్డకూ కలగకమానదు. అంతటి అపారమైన ప్రేమను పంచడం ఒక్క తండ్రికే సొంతం.

వేలు పట్టి నడిపిస్తూ లోకాన్ని చూపుతూ, తాను కరుగుతూ ఇంటికి వెలుగునిచ్చే మహోన్నత వ్యక్తి నాన్న. తప్పటడుగులు సరిదిద్ది, బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే నిస్వార్థపు మనిషి. బయటకు గంభీరంగా కనిపించినా.. మనసులో బోలెడంత ప్రేమను దాచుకుంటాడు. పిల్లల భవిత కోసం తన వ్యక్తిగత సంతోషాన్ని సైతం త్యజించే త్యాగమూర్తి నాన్న. అలాంటి నాన్నను ఏడాదిలో ఒక్కసారైనా గౌరవించడం మన బాధ్యత. 

 

 

చెగువేరా

                                             1965 లో ''చే గువేరా'' తన పిల్లలకు రాసిన ఆఖరి ఉత్తరం

ప్రియమైన హిల్దితా, అలైదితా, కామిలో, సెలియా, ఎర్నెస్తో...
నేను మీతో లేను కాబట్టి కొన్ని సంగతులు చెప్పేందుకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ఏదో ఒకనాటికి ఇది మీకు అందినప్పుడు మీరు అవన్నీ తెలుసుకుంటారు.
ప్రపంచంలో ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా మనం గాఢంగా ప్రతిస్పందించటం చాలా అవసరం. ప్రతీ విప్లవకారుడికీ ఉండి తీరాల్సిన అద్భుతమైన లక్షణం అదే.
నా పిల్లలందరికీ వీడ్కోలు పలుకుతున్నాను. మిమ్మల్ని మళ్లీ చూస్తాననే నా ఆశ. మీకందరికీ గాఢమైన ముద్దులతో, ఆలింగనాలతో... - నాన్న

 

22

                                                                      టు ఇందిరా..

ఫ్రమ్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ (అలహాబాద్‌ నైని సెంట్రల్‌ జైల్‌ నుంచి)
సందర్భం: ఇందిర 13వ పుట్టిన రోజు

 

డియర్‌ ఇందిరా..
ఏది సరైంది.. ఏది కాదు, ఏం చేయాలి.. ఏం చేయకూడదు అనేవి ఉపన్యాసాలతో తెలుసుకోలేం. చర్చించడం ద్వారా తెలుసుకుంటాం. నీతో నేనెప్పుడూ చర్చించడాన్నే ఇష్టపడ్తాను. ఇప్పటికే మనం చాలా అంశాలను చర్చించుకున్నాం. కానీ ఈ ప్రపంచం చాలా విశాలమైంది. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్పిస్తూనే ఉంటుంది. అన్నీ తెలుసనే భావనను దరిచేరనీయకు. నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. జీవితంతో పాటు అది కొనసాగాలి. సూర్యుడితో స్నేహం చేద్దాం. అంటే ఎప్పుడూ మెలకువగా ఉందాం. డబ్బు ఎప్పుడూ మంచిది కాదు. అది వస్తువులను పొందడానికి మాత్రమే సహాయపడుతుంది. నువ్వెలా ఉండాలంటే ఈ దేశ సేవలో ఒక యోధురాలిలా !
- మీ నాన్న జవహర్‌లాల్‌ నెహ్రూ

 

33

                                                      26 ఏళ్లకే వేల కోట్ల వ్యాపారం.. ఆర్యా తవారే

చిన్నప్పటి నుంచి భవనాలు కట్టడం అంటే ఆమెకు పిచ్చి... విద్యార్థి దశలోనే ఖాళీ సమయంలో బిల్డర్‌ల దగ్గర పని చేశారు. ఆ రంగంలోని ఇబ్బందులను తానెలా తీర్చగలనా అని ఆలోచించేవారు. చదువు అవ్వగానే వినూత్న ఆలోచనతో వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. నాలుగేళ్లలోనే తన సంస్థను వేల కోట్ల రూపాయలకు చేర్చారు.. ఇదంతా లండన్‌లో స్థిరపడ్డ భారతీయ యువతి, 26 ఏళ్ల ఆర్యా తవారే విజయగాథ. ఏ గూటి పక్షి ఆ పలుకే పలుకుతుందన్నట్లు ఆర్యా తవారే బిల్డర్‌ అయిన తన తండ్రి కళ్యాణ్‌ తవారేను చూసి ప్రేరణ పొందారు. మహారాష్ట్ర్ట, బారామతి తాలూకాలోని కటేవాడికి చెందిన ఆర్య చిన్నప్పటి నుంచే ఆర్కిటెక్చర్‌, ప్లానింగ్‌పై ఆసక్తిని పెంచుకున్నారు. మహిళలు అరుదుగా ఉండే ఈ రంగంలో అడుగుపెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. ఇంటర్‌ వరకూ పుణెలో, తర్వాత లండన్‌ విశ్వవిద్యాలయం నుంచి అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ రియల్‌ ఎస్టేట్‌ ఫైనాన్స్‌లో డిగ్రీ చేశారు. బడి, కాలేజీ రోజుల్లో సెలవులొచ్చినప్పుడల్లా తండ్రి దగ్గర పనిచేసేవారు. ఆ సమయంలోనే చిన్న, మధ్యస్థాయి బిల్డర్స్‌ ఆర్థిక సమస్యలెదుర్కోవడం దగ్గర నుంచి చూశారు. ఈ సమస్యను పరిష్కరించాలని క్రౌడ్‌ ఫండింగ్‌ పద్ధతిని మొదలుపెట్టి, పెట్టుబడి సమస్య ఉన్న వారికి చేయూతనందించేవారు. తన ఉత్సాహం, చొరవ, ఆసక్తి, ఇతరులకు సాయం చేసే పద్ధతుల్నీ గుర్తించిన యూనివర్శిటీ ఇందుకోసం ఆమెకు ప్రత్యేకంగా చిన్న ఆఫీస్‌ సౌకర్యాన్నీ కల్పించింది. డిగ్రీలో ఉన్నప్పుడే తన వ్యాపార ఆలోచనలతో 'యూసీఎల్‌ బ్రైట్‌ ఐడియా' పురస్కారాన్ని అందుకున్నారు. డిగ్రీ పూర్తవ్వగానే ఆర్య 'ఫ్యూచర్‌బ్రిక్స్‌' స్టార్టప్‌ను స్థాపించారు. 30 ఏళ్లలోపే యూరోపియన్‌ ఫైనాన్షియల్‌ సెక్టార్‌లో ప్రజలను ప్రభావితం చేసిన అత్యంత శక్తివంతమైన యువ మహిళా వ్యాపారవేత్తగా ఫోర్బ్స్‌ గుర్తించింది.

 

44

                                        టు దీపిక పదుకుణే ఫ్రమ్‌ ప్రకాశ్‌ పడుకొణె .. మై డియర్‌ దీపిక...

జీవితంలో ప్రతిసారీ గెలవలేం. కావాల్సినవన్నీ మన దారికి రావు. మనం కోరుకున్నట్టుగా పరిస్థితులు ఉండవు. మారవు. కొన్ని గెలవాలంటే కొన్ని కోల్పోవాలి. జీవితంలో కొన్నిసార్లు తగ్గడమే నెగ్గడం. అది నేర్చుకో. అయితే పూర్తిగా వదిలేయకూడదు. నా కెరీర్‌ అంతా కూడా నేను చేసింది అదే. మొదటి ఆట నుంచి రిటైర్‌మెంట్‌ వరకూ ప్రయత్నాన్ని వీడలేదు. ఎంతటి క్లిష్ట సమయాల్లోనైనా సరే వల్లకాదు.. వదిలేయాలన్న ఆలోచనలకు తావివ్వలేదు. నా శక్తిపైనే దృష్టిపెట్టాను. నీ నుంచీ అదే కోరుకుంటున్నా బేటా ! గెలవడమంటే నిలబడడమే !
                                     - విత్‌ లాట్స్‌ ఆఫ్‌ లవ్‌, డాడీ

 

55


 

                                        ఫ్లైట్‌ టికెట్‌ కోసం ఏడాది శాలరీ ఖర్చు పెట్టారు : సుందర్‌ పిచాయ్

పైకి ఎదిగిన ప్రతి ఒక్కరి జీవితంలో... ఒకప్పుడు పడిన కష్టాల తాలూకు మధుర స్మృతులు ఉంటాయి. గూగుల్‌ సంస్థ సీఈఓ సుందర్‌ పిచారుకి కూడా అలాంటివి చాలా ఉన్నాయి. డియర్‌ క్లాస్‌ ఆఫ్‌ 2020 పేరుతో గూగుల్‌ సంస్థ యూట్యూబ్‌... ఓ వర్చువల్‌ గ్రాడ్యుయేషన్‌ సెరెమనీని ఆ మధ్య ఏర్పాటు చేసింది. స్టూడెంట్స్‌కి ఫేర్‌వెల్‌ ఇస్తూ... సుందర్‌ పిచారు... ప్రేరణ కలిగించే మాటలు చెప్పారు. ప్రతిదీ మార్చేందుకు మీరే ఆ మార్పు కావాలని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. 'ఓ సామాన్య వ్యక్తి నుంచి నన్ను ఈ స్థాయికి చేర్చిన అంశం అదృష్టం కాదు... టెక్నాలజీపై నాకున్న మక్కువ, ఓపెన్‌ మైండే.. నా జీవితంలోనూ ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి..అయితే ప్రతిసారీ వెనకడుగు వేయకుండా, ముందుకు వెళ్లా. మా కాలంలో పెద్దగా టెక్నాలజీ లేదు.. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో ఉన్నతవిద్య కోసమే మొదటిసారి విమానం ఎక్కా.. విమాన టికెట్‌ కోసం నా తండ్రి... ఏడాది పాటు సంపాదించిన శాలరీ అంతా ఖర్చుపెట్టారు. అంతేకాదు అప్పట్లో ఇంటికి కాల్‌ చెయ్యాలంటే... ఫోన్‌ కాల్‌కి నిమిషానికి రెండు డాలర్లు (రూ.90 అప్పట్లో) అయ్యేది. ఓ బ్యాక్‌ ప్యాక్‌ (వెనక తగిలించుకునే బ్యాగ్‌ లాంటిది) కొనుక్కోవాలంటే.. నా తండ్రి ఒక నెల జీతం ఖర్చు పెట్టాల్సి వచ్చేది' అని సుందర్‌ పిచారు తన అనుభవాల్ని పంచుకున్నారు. గూగుల్‌ టాప్‌ బాస్‌ అయిన సుందర్‌ పిచారు.. ఖరగ్‌పూర్‌లో బీటెక్‌ చేశారు. తర్వాత స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో మెటీరియల్‌ సైన్సెస్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో ఎంఎస్‌ డిగ్రీ చేశారు. నెక్ట్స్‌ వార్టన్‌ స్కూల్లో ఎంబిఎ చేశారు. 2004లో ఆయన గూగుల్‌లో చేరారు. ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌లో వైస్‌ ప్రెసిడెంట్‌గా చేరారు. తన టీమ్‌ని గూగుల్‌ క్రోమ్‌ తయారీ చేపట్టేలా చేశారు. ఇప్పుడు అదే వెబ్‌ బ్రౌజర్‌ ప్రపంచంలో ఎక్కువగా వాడుతున్నదిగా మారింది.

 

66

                                   ఆయన అసలైన మనిషి .. ఎలినోర మార్క్‌ ్స - ఎవెలింగ్‌

77

తండ్రిని గురించి ఎలినోర మార్క్స్‌ పంచుకున్న జ్ఞాపకాల్లోంచి కొన్ని..
''నాన్న గురించి నా తొలి జ్ఞాపకం నాకు మూడేళ్లప్పటిది. ''మూర్‌'' (ఇంట్లో వాడే పాతపేరు నోరుజారి వస్తుంది) నన్ను తన భుజం మీద కూర్చోబెట్టుకొని, గ్రాఫ్టన్‌ టెరస్‌లోని మా తోటచుట్టూ తిప్పుతూ, నా ముదురు గోధుమరంగు కురులలో తీగల పూలు తురుముతూ ఉండేవాడు.

నామట్టుకు నాకు.. బహుశా నాకు సమవయస్కులైన అక్కచెలెళ్లు లేనందునవల్లనేమో - మూర్‌ను స్వారీ గుర్రంగా ఉపయోగించడం ఇష్టం. ఆయన భుజం మీద కూర్చొని, అప్పటికి నల్లగా, సూచన మాత్రమైన తెలుపుతో ఉన్న ఆయన పెద్ద జూలును గట్టిగా పట్టుకొని, అద్భుతమైన స్వారీలు చేశాను. మా చిన్న తోటచుట్టూ, గ్రాఫ్టన్‌ టెరస్‌లోని మా ఇంటిచుట్టూ ఉన్న పొలాల్లోనూ - ఆ పొలాల్లో ఇప్పుడు ఇళ్లున్నాయి.

''మూర్‌'' అనే పేరును గురించి ఒక్కమాట. ఇంటివద్ద మాకు అందరికీ మారు పేర్లు వున్నాయి. (పేర్లు పెట్టడంలో మార్క్సుకు గల నేర్పు ''పెట్టుబడి'' పాఠకులకు తెలుస్తుంది.) మార్క్సును మేమే కాదు, మరీ సన్నిహితమైన మిత్రులందరూ క్రమంగా దాదాపు అధికారికంగా పిలిచే పేరు ''మూర్‌''. కానీ, ఆయన మా ''చాలీ'' కూడా.
మూర్‌ శ్రేష్టమైన గుర్రమే కానీ, ఆయనకు అంతకు మించిన యోగ్యత మరొకటి వుండింది. ఆయన అద్వితీయమైన, అప్రతిమానమైన కథకుడు.
నా మట్టుకు నాకు, మూర్‌ చెప్పిన అనేక అద్భుత కథలలోకెల్లా అత్యంత అద్భుతమైనదీ, అత్యంత ఆహ్లాదకరమైనదీ ''హాన్స్‌రోక్లె.'' అది నెలలు నెలలు నడిచింది. అది మొత్తం ఒక కథాపరంపర.
మూర్‌ నాకు, అంతకు ముందు మా అక్కలకులాగే, ఆయన హోమర్‌ అంతా, ''నిబెలుంగ్‌ల పాట,'' ''గుడ్రున్‌,'' ''డాన్‌ క్విక్సట్‌,'' ''అరేబియన్‌ రాత్రులు,'' వగైరాలు సంపూర్ణంగా చదివి. వినిపించాడు. షేక్‌స్పియర్‌ అంటే, ఆయన మా ఇంటికి బైబిల్‌, మా చేతులలోనో, నోళ్లలోనో లేకుండా ఎప్పుడూ వుండడు. నాకు ఆరేళ్లు వచ్చేటప్పుటికి షేక్‌స్పియర్‌లో రంగాలకు రంగాలు నోటికి వచ్చేవి.
నా ఆరో పుట్టినరోజు నాడు మూర్‌ నాకు నా మొదటి నవల బహుమతి ఇచ్చాడు - అమర కృతి ''పీటర్‌ సింపుల్‌''. దాని తరువాత మరియేట్‌ రచనలూ, కూపర్‌ రచనలూ మొత్తం వచ్చినాయి. నేను వాటిని చదివేటప్పుడు మా నాన్న ప్రతి కథనూ నిజంగా చదివి, తన చిన్న అమ్మాయితో వాటిని గంభీరంగా చర్చించేవాడు.
ఆ విధంగా బాల్యదశలోనూ, కౌమారదశలోనూ నాకు మూర్‌ ఆదర్శమిత్రుడుగా వున్నాడు.
ఇంటివద్ద మేమందరమూ మంచి కామ్రేడ్లము. ఆయన ఎప్పుడూ అత్యంత దయాపరుడూ, సౌమ్యుడూ, సామరస్యత కోరేవాడు. అలా రాచపుండ్లతో నిరంతరం బాధపడుతూన్న బాధామయ కాలంలోనూ చివరిదాకా. ఆయన ''అన్నింటా అతను అసలైన మనిషి. అలాంటివాణ్ని మళ్లీ చూడబోను.''
(మార్క్స్‌-ఎంగెల్స్‌ ఆత్మీయుల స్మృతులు నుండి)

ఉదయ్ శంకర్‌ ఆకుల - 7989726815