సికింద్రాబాద్: రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె తీవ్రంగా గాయపడిన ఘటన బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం మధ్యాహ్నం కొంపల్లి నుంచి బోయిన్‌పల్లి బస్ స్టాప్‌కు వైష్ణవి, ఆమె తండ్రి ద్విచక్రవాహనంపై బయల్దేరారు. వాహనం అదుపుతప్పడంతో తండ్రి, కుమార్తె కింద పడ్డారు. ఇదే సమయంలో సుచిత్ర వైపు నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వైష్ణవి, ఆమె తండ్రి పైనుంచి వెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైష్ణవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే డీసీఎం డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న బోయిన్‌పల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వైష్ణవి ఎమ్‌ఎన్‌ఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఆమెను కళాశాలకు పంపే క్రమంలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.










