Dec 14,2022 07:38

      సైబర్‌ నేరగాళ్ల మాయలో చిక్కుకుని విలవిల్లాడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇంటర్నెట్‌ ఆధారంగా జరుగుతున్న మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వాల వైఫల్యం ఇందుకు ప్రధాన కారణమవుతోంది. తెలిసి కొంచెం, తెలీక మరికొంచెం ఇటువంటి మోసాలకు గురవుతున్నారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) 2021 సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన నివేదిక ప్రకారం సైబర్‌ మాయకు సంబంధించిన కేసులలో 10,303 కేసులతో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా, 8,829 కేసులతో ఉత్తర ప్రదేశ్‌ ద్వితీయ స్థానంలో, 8,136 కేసులో కర్ణాటక తృతీయ స్థానంలో, 1875 కేసులతో ఆంధ్రప్రదేశ్‌ ఏడో స్థానంలో ఉన్నాయి. 2019, 2020లో సైతం వరుసగా 1886, 1899 సైబర్‌ నేరాలు రాష్ట్రంలో నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
           ఎక్కువగా సామాన్యులు చిక్కుకునేదాన్ని ఫిషింగ్‌ ఎటాక్‌ అంటారు. ఇందులో మనంత మనంగా సమాచారం ఇచ్చి, మోసపోయేలా చేస్తున్నారు. తను వాడుకున్న రూ.2 లక్షలు సంపాదించడం కోసం ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేసిన గుంటూరు జిల్లా ఫిరంగిపురం బాలిక కిడ్నీ ఇస్తే రూ.7 కోట్లు ఇస్తామంటూ సైబర్‌ మోసగాళ్లు ఇచ్చిన ప్రకటన చూసి రూ.16,40,900 మోసపోవడం ఇందుకు తాజా ఉదాహరణ. ఇవే కాదు మన సెల్‌ ఫోన్‌కు మీ బ్యాంక్‌ అకౌంట్‌, ఎటిఎం కార్డు బ్లాక్‌ చేశాం, వెంటనే ఈ క్రింది లింక్‌ ఓపెన్‌ చేసి, వివరాలివ్వండి అని పేర్కొంటారు. మన ఆధార్‌, బ్యాంక్‌ అకౌంట్‌, ఒటిపి... ఇలా వివరాలన్నీ అడిగి మన అకౌంట్‌లోని మొత్తాన్ని లూటీ చేస్తారు. మనకు ఆ బ్యాంకుకు సంబంధించి ఏమైనా అనుమానాలున్నా, వివరాలు కావల్సి వచ్చినా, నేరుగా వెళ్లి తెలుసుకోవడం, లేదా ఆ బ్యాంకు వారు ఇచ్చిన హెల్ప్‌ లైన్‌లోకో, యాప్‌లోకో వెళ్లాలి మినహా ఊరూపేరూలేని వాటిని క్లిక్‌ చేసి మోసపోరాదు. మీ నెంబర్‌కు లాటరీ వచ్చింది, మీకు రోజుకు రూ.7 వేలు జీతం ఇస్తాం, మీ అకౌంట్‌లో డబ్బులు వేస్తాం తరహా లింక్‌లు పంపి, అవి క్లిక్‌ చేస్తే మన సమాచారం మొత్తం సేకరించి మోసగించే కరోడా నేరగాళ్లు పెరిగిపోతున్నారు. కొన్నిసార్లు వినియోగదారుల ప్రమేయం లేకుండా కూడా అకౌంట్‌ను ఖాళీ చేస్తున్నారు. ఢిల్లీలో కొద్ది రోజుల క్రితం సెక్యూరిటీ సర్వీసెస్‌ ఫర్మ్‌ డైరెక్టర్‌కు వరుసగా బ్లాంక్‌ కాల్స్‌ వచ్చాయి. ఆయన ఫోన్‌ లిఫ్ట్‌ చేసినా ఏమీ వినిపించలేదు. కానీ, ఆయన బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.50 లక్షలు మాయమైంది. మన సిస్టమ్స్‌కి సాఫ్ట్‌వేర్లు, మొబైల్స్‌కి యాప్స్‌ పంపి, అవి క్లిక్‌ చేసిన తరువాత మొత్తం సమాచారాన్నంతా తస్కరించి, మోసగించడాన్ని కీ లాగింగ్‌ అంటున్నారు. వైరస్‌లు పంపడం ద్వారా, సినిమా వెబ్‌సైట్లపై క్లిక్‌ చేయగానే వచ్చే యాడ్స్‌ ద్వారా మరికొన్ని మోసాలు జరుగుతున్నాయి. ఇవిగాక లోన్‌ యాప్‌ల ద్వారా సాగిస్తున్న దోపిడీ, వేధింపులూ మరో రకం. వాటిపైనా సర్కారు అదుపు లేకపోవడం శోచనీయం. ఒఎల్‌క్స్‌లో అమ్ముతామంటూ, కొరియర్‌ వచ్చిందంటూ... ఇలా సవాలక్ష తరహాల్లో కేటుగాళ్లు రాటుదేలిపోయారు. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏమూలకూ సరిపోవడం లేదు. 2021లో దేశంలో మొత్తం 52,974 కేసులు నమోదైతే, అందులో 32,230 కేసులు సైబర్‌ మోసాలకు సంబంధించినవే. వీటిలో పరిష్కారమై, బాధితులకు న్యాయం జరుగుతున్నది తక్కువే. 2021 సంవత్సరానికి సంబంధించిన నేరాల్లో 37.12 శాతం కేసులు పెండింగ్‌లో ఉండిపోయాయి. పూర్తిస్థాయి ఆధారాలు లభ్యం కాకపోవడం, మోసగించిన వెంటనే రంగులు మార్చే ఊసరవెల్లుల జాడ కనుక్కోవడంలో సైబర్‌ నిఘా వైఫల్యం ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ప్రజల్లో ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తత, అవగాహన పెరగాలి. డబ్బులు ఊరికే రావు... అన్న నిజాన్ని గుర్తించి, సైబర్‌ మోసగాళ్ల వలలో పడకుండా స్వీయ జాగరూకతను పాటించాలి. అప్పుడే సర్వం కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి నుంచి కొంత బయటపడే అవకాశముంటుంది. ప్రజలకు ఈ తరహా నేరాలపై అవగాహన కల్పించేందుకు సర్కారు చర్యలు తీసుకోవాలి. సైబర్‌ మోసాలను అరికట్టేందుకు, ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న స్వదేశీ, విదేశీ ముఠాల ఆటకట్టించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలి.