
కోతలూ, భారాలు సామాన్య వినియోగదారులకూ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకూ.... లాభాలు, ఆస్తులు కార్పొరేట్ విద్యుత్ ఉత్పత్తిదారులకూ... అన్నట్టుగా రాష్ట్రంలో విద్యుత్‌రంగం పరిస్థితి తయారైంది. రుణాలు కావాలంటే విద్యుత్‌రంగ సంస్కరణలు అమలు చేయాలంటూ అప్పట్లో ప్రపంచబ్యాంకు చెబితే టిడిపి ప్రభుత్వం అమలు చేసినట్టే ఇప్పుడు కేంద్రం చెబుతున్న షరతులన్నీ వైసిపి సర్కారు తు.చ. తప్పక అమలు చేస్తోంది. ప్రభుత్వాలు మారినా విద్యుత్ సంస్కరణలు, ప్రజలపై వాటి దుష్ప్రభావాలు మాత్రం మరింత పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్ మిగులులో ఉన్న రాష్ట్రం ఇప్పుడు రోజువారీ డిమాండ్‌కు తగినట్టు సరఫరా చేయలేని దుస్థితి ఎందుకొచ్చింది? ప్రైవేటు మార్కెట్‌పై ఆధారపడాల్సిన అగత్యం ఎందుకేర్పడింది? పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటిస్తామని, విద్యుత్ కోతలు విధిస్తామని.. తూచ్.. అధిక ధరకు కొనైనా సరఫరా చేస్తామని ఒకేరోజు రెండు ప్రకటనలు ఎందుకొచ్చాయి? ఇటువంటి పరిస్థితి ఏర్పడడానికి బాధ్యులెవరు? ఇవీ నేడు సామాన్యులు వేస్తున్న ప్రశ్నలు. వీటికి సమాధానాలు వెతికితే రాష్ట్ర ప్రభుత్వరంగ జెన్‌కో ఉత్పత్తిని తగ్గించడం, ప్రైవేటు సోలార్, విండ్ పవర్‌పై ఆధారపడడం ఒక ముఖ్య కారణమని తేలుతోంది. నెల్లూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ ప్లాంట్ మూడవ యూనిట్‌ను వినియోగం లోకి తేవడంలేదు. అసలు ఆ ప్లాంటు మొత్తాన్నే అదానీకి అప్పగించడానికి యత్నించగా ఉద్యోగులు, కార్మికులు, ప్రజాందోళనల నేపథ్యంలో సర్కారు వెనక్కు తగ్గింది. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలే కరువయ్యాయి. ఆర్‌టిపిపిలో కనీసం 81 వేల టన్నుల బొగ్గు అవసరం కాగా, 31,500 టన్నుల బొగ్గే అందుబాట్లో ఉంది. సరైన ప్రణాళికా లేమి, బొగ్గు కేటాయింపులపై కేంద్రాన్ని ఒత్తిడి చేయడంలో మీనమేషాలు లెక్కించడం మరో కారణంగా కనిపిస్తోంది. నాడు, నేడు విద్యుత్ సంస్కరణల అమలువల్ల ప్రైవేటు విద్యుత్ సరఫరా సంస్థలు భారీగా లబ్ధి పొందుతుండగా, ప్రజలు, చిన్న పరిశ్రమలు విపరీతమైన భారాల బారినపడుతున్నారు.
విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని హామీలు గుప్పించిన వైసిపి... ట్రూ అప్, ఇంధన సర్దుబాటు ఛార్జీలు, విద్యుత్ సుంకం పేరుతో.... ఎడాపెడా ఛార్జీల మోత మోగిస్తోంది. నేరుగా ఛార్జీలు పెంచకుండా వివిధ రూపాల్లో ఛార్జీలు పెంచడం వల్ల వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత నాలుగేళ్లలోనే యూనిట్‌పై వివిధ పేర్లతో రూ.2.89 పెరిగింది. రాష్ట్రంలో ఒక మోస్తరు పరిశ్రమపై ప్రతి నెలా రూ.4.18 లక్షల భారం పడింది. వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు యూనిట్ 6 పైసలుగా ఉన్న విద్యుత్ సుంకం 2022 మే నుంచి యూనిట్‌కు ఏకంగా రూపాయికి పెరిగింది. 2022 ఆగస్టు నుంచి ట్రూ అప్ పేరుతో యూనిట్‌కు 22 పైసలు, 2021-22లో వినియోగించిన విద్యుత్‌కు ఇంధన సర్దుబాటు ఛార్జీ (ఎఫ్‌పిపిసిఎ)ల కింద 2023 ఏప్రిల్ నుంచి యూనిట్‌కు 63 పైసల అదనపు భారం వేసింది. 2023-24లో ఎఫ్‌పిపిసిఎం కింద యూనిట్‌కు రూ.1.10 చొప్పున వసూలు చేయడానికి అనుమతించాలని డిస్కమ్‌లు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఇఆర్‌సి)కి ప్రతిపాదించాయి. ఆ మొత్తంలో 40 పైసలు ఇప్పటికే వసూలు చేస్తున్నాయి. మిగిలిన 70 పైసలు ఏడాది చివరిలో ట్రూ అప్ కింద వసూలు చేసే అవకాశముంది. ట్రూఅప్, ఎఫ్‌పిపిసిఎల పేరుతో ప్రభుత్వం వేసిన భారాలతో ఉత్పత్తి వ్యయంపై సుమారు 26 శాతం ప్రభావం పడిందని పారిశ్రామిక రంగ విశ్లేషకులంటున్నారు. ప్రభుత్వ అదనపు భారాలతో ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలు చాలావరకూ మూతపడ్డాయి. గతంలో కోళ్ల ఫారాలకు యూనిట్‌కు రూ.3.85 చొప్పున ఛార్జీలు వసూలు చేస్తే ప్రస్తుతం రూ.6.70 చొప్పున వసూలు చేస్తున్నారు. దీంతో.. ఈ రంగం కూడా సంక్షోభంలో పడుతోంది.
ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రభుత్వం, డిస్కాములు సమర్ధవంతమైన చర్యలు చేపట్టాలి. జెన్‌కో ఉత్పత్తిని పెంచడం, అవసరమైనంత బొగ్గును అందించడం ప్రధానం. ఇప్పటికైనా సర్కారు ప్రైవేటు చూపులు మాని ప్రభుత్వరంగాన్ని బలోపేతం చేయాలి.