Nov 20,2022 08:43

ఫలాలలో మధురఫలం సీతాఫలం. రుచిలో మధురమే కాదు.. చెట్టు భాగాలన్నీ ఔషధమయం. పండు పోషకాలతో నిండి ఉంటుంది. ఆకులు, బెరడు, వేర్లను అనేక రకాల వ్యాధులను నివారించడానికి ఉపయోగిస్తారు. ఆయుర్వేద మందులు, క్రీములు, జెల్స్‌ తయారీలో వాడతారు. ఇవేకాక సీతాఫలంతో రకరకాల వంటలు చేస్తారు. అసలే మధురం.. దానితో వంటలు మరింత సుమధురం. మరి ఆ రుచులేంటో తెలుసుకుందాం..

  • కేకు..
cake

కావలసినవి : సీతాఫల గుజ్జు - కప్పు, మైదా - కప్పు, బేకింగ్‌ పౌడర్‌ - స్పూను, బేకింగ్‌ సోడా - చిటికెడు, ఉప్పు- చిటికెడు, గుడ్లు -2, వెన్న-1/2 కప్పు, చక్కెరపొడి - కప్పు, వెనీలా ఎసెన్స్‌- స్పూను, వెచ్చని పాలు - కప్పు
తయారీ : మందంగా ఉన్న వెడల్పు పాత్రలో అంగుళం మందంలో ఇసుకను సమంగా సర్ది, మూత పెట్టి అరగంట సేపు స్టౌపై వేడిచేయాలి. ఒక బౌల్‌లో మైదా, బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా, ఉప్పు కరిగించిన వెన్న, చక్కెర పొడి, నురగ వచ్చేవరకూ చిలికిన గుడ్ల సొన, సీతాఫలం గుజ్జు, వెనీలా ఎసెన్స్‌ అన్నింటినీ వేసి, వెచ్చని పాలతో ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన వెడల్పు గిన్నెలో పోసి, కింద రెండుసార్లు తట్టాలి. దీనిని ముందుగా వేడి చేసిన ఇసుక పాత్రలో ఉంచాలి. దీనిపై ఆవిరి బయటికి పోకుండా మూతపెట్టి, అరగంట పాటు మీడియం ఫ్లేంమీద బేక్‌ చేసుకోవాలి. తరువాత పాత్ర మూత తీసి చాకును గుచ్చి, దానికి ఏమీ అంటుకోకపోతే కేక్‌ రెడీ అయినట్లే. అప్పుడు స్టౌ ఆఫ్‌ చేయాలి. కుక్కర్‌లో అయితే విజిల్‌ పెట్టకుండా ఇలాగే చేసుకోవచ్చు.

  • రబిడి..
rabidi

కావలసినవి : వెన్న తీయని పాలు - లీ., పంచదార - 4 స్పూన్లు, డ్రై ఫ్రూట్స్‌ ముక్కలు - 2 స్పూన్లు, యాలకుల పొడి - చిటికెడు.
తయారీ: మందపాటి గిన్నెలో పాలు కాయాలి. పొంగు వచ్చిన వెంటనే డ్రై ఫ్రూట్స్‌ ముక్కలు వేసి ఉడికించి, ఐదు నిమిషాల తర్వాత పంచదార వేయాలి. పాలు సగం అయ్యేవరకూ కలుపుతూ మరిగించాలి. దీనిలో సీతాఫల గుజ్జు, యాలకుల పొడి వేసి మరో రెండునిమిషాలు కలుపుతూ ఉడికించాలి. బాగా దగ్గరగా వస్తే రబిడి రెడీ అయినట్లే. ఇక దీన్ని దించి, వేడిగా సర్వ్‌ చేసుకోవడమే. దీన్ని చల్లగా కావాలంటే కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి తినొచ్చు.

  • హల్వా..
halwa

కావలసినవి : సీతాఫల గుజ్జు - 2 కప్పులు, రవ్వ - కప్పు, పంచదార - 1/2 కప్పు, నీరు -2 కప్పులు, డ్రై ఫ్రూట్స్‌ ముక్కలు - 2 స్పూన్లు, నెయ్యి - 4 స్పూన్లు, యాలకుల పొడి - చిటికెడు
తయారీ : ముందుగా బాండీలో రెండు స్పూన్లు నెయ్యి వేసి, వేడి చేయాలి. దీనిలో డ్రై ఫ్రూట్స్‌ ముక్కలు వేయించి, వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అదే బాండీలో రవ్వ మంచివాసన వచ్చే వరకూ వేయించి, ఉండలు లేకుండా నీటిని కలపాలి. ఉడికి ముద్దగా వచ్చినప్పుడు పంచదార, సీతాఫల గుజ్జు, యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలపాలి. చివరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్‌ ముక్కలు కలిపి, అవసరమైతే నెయ్యి వేసి, బాగా కలిపి, సర్వ్‌ చేసుకోవడమే.

  • పాయసం..
payasam

కావలసినవి: సీతాఫలం గుజ్జు - 1/2 కప్పు, పాలు - కప్పు, పచ్చికోవా - 50 గ్రా., పంచదార - 1/4 కప్పు, జీడిపప్పు - 2 స్పూన్లు, కిస్‌మిస్‌ - 2 స్పూన్లు, యాలకుల పొడి - స్పూను.
తయారీ : అడుగు మందంగా ఉన్న బాండీలో పాలు కాచి, పొంగు రాగానే జీడిపప్పు, కిస్‌మిస్‌ వేసి తిప్పుతూ దాదాపు సగం అయ్యేవరకూ మరిగించాలి. మరుగుతున్న పాలలో పచ్చికోవా కలిపి మీడియం ఫ్లేం మీద రెండు నిమిషాల పాటు మరిగించాలి. తరువాత పంచదార వేసి కరిగిన తరువాత సీతాఫలం గుజ్జు, యాలకుల పొడి వేసి, బాగా కలిసేలా తిప్పుతూ ఉడికించాలి. దగ్గర పడిన తరువాత దించేయాలి. సీతాఫలం పాయసం రెడీ. చల్లగా కావాలంటే ఫ్రిజ్‌లో పెట్టుకుని తీసుకోవచ్చు.