పెరుగు అనగానే ఆమడ దూరం పారిపోయే పిల్లలకు.. ఎప్పుడూ ఒకే కూరలా.. అని నిరుత్సాహం వ్యక్తం చేసే పెద్దలకు.. పెరుగుతోనే వెరైటీ కూరలు చేసుకోవడం ఒకింత కొత్తదనమే. పాలు, పెరుగు అంటే చాలా మంది ఇష్టం చూపించరు. దానికీ కారణం లేకపోలేదు. వాటి కాంబినేషన్స్, ఫ్లేవర్స్ ఇష్టపడకపోవడమే. పెరుగన్నం తినకుండా భోజనం ముగించని వాళ్లూ పెరుగును కష్టంగానే తీసుకునేవాళ్లున్నారు. కానీ ఆహారంలో పెరుగు అవసరం ఎంతైనా ఉంది. అందుకే పెరుగుతో చేసే కూరలను కొన్నింటిని తెలుసుకుందాం.
బెండకాయతో..
కావలసినవి : బెండకాయలు - 1/2 కేజీ, నూనె - 2 స్పూన్లు, చిక్కని మజ్జిగ - 1/4 లీ., ఉల్లి తరుగు - పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - స్పూను, టమాటా గుజ్జు - 1/2 కప్పు, ఉప్పు, కారం - తగినంత, పసుపు - 1/4 స్పూను, వేయించిన జీలకర్ర పొడి - స్పూను, ధనియాల పొడి - స్పూను, గరం మసాలా 1/2 స్పూను, కరివేపాకు
తయారీ : శుభ్రం చేసుకున్న బెండ కాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని, ఒక పక్కన ఉంచుకోవాలి. బాండీలో నూనె వేడి చేసి, బెండకాయ ముక్కలను దోరగా వేయించి.. వేరే గిన్నెలో పక్కన ఉంచాలి. ఆవాలు, జీర, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు పెట్టి, ఉల్లిపాయ ముక్కల్ని వేసి, మూడు నిమిషాలు వేయించాలి. దానిలో అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చివాసన పోయే వరకూ వేయించాలి. తర్వాత కారం, ఉప్పు, పసుపు, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి నిమిషంపాటు వేయించాలి. టమాటా గుజ్జు వేసి, పచ్చివాసన పోయే వరకూ ఉడికించాలి. ఆ తరువాత మజ్జిగ పోసి, మరుగుతున్నప్పుడు వేయించిన బెండకాయ ముక్కలను వేసి, నూనె పైకి తేలేంత వరకూ ఉడికించాలి. చివరిలో కొత్తిమీర తరుగు చల్లి, దించేయాలి. అంతే పెరుగు బెండకాయ కూర రెడీ.
బెండకాయల స్థానంలో బజ్జీ మిరపకాయలతోనూ ఇదేవిధంగా కూర చేసుకోవచ్చు. అయితే దానిలో కారం ఇంతగా అవసరముండదు. తగినంత వేసుకోవాలి.
వంకాయతో..
కావలసినవి : వంకాయలు - 1/2 కేజీ, పెరుగు - 1/4 లీ, నూనె - 3 స్పూన్లు, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 3, టమాటాలు - 2, ఉప్పు, కారం - తగినంత, పసుపు - 1/2 స్పూను, శనగపిండి - స్పూను, గరం మసాలా - 1/2 స్పూను
తయారీ : ముందుగా పెరుగును తరకలు లేకుండా చిలికి పక్కన ఉంచుకోవాలి. బాండీలో నూనె వేడి చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం ఉప్పు వేసి దోరగా వేయించాలి. అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చివాసన పోయే వరకూ వేయించాలి. ఇప్పుడు టమాటా గుజ్జు, వంకాయలు గుత్తి వంకాయకు కట్ చేసినట్టు చేసి వేసి, తిప్పుతూ ఉడికించాలి. కూర ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి పెరుగు, నీటి జారుగా కలిపిన శనగపిండి వేయాలి. కూరంతా వంకాయలు చితికిపోకుండా తిప్పి స్టౌ ఆన్ చేయాలి. ఇప్పుడు కూరలో కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి గిన్నెను తిప్పుతూనే ఉడికించాలి. నూనె పైకి కనిపించేటప్పుడు మసాలా, చిన్నగ్లాసు నీటిని పోసి కూర అడుగంటకుండా మధ్యమధ్యలో తిప్పుతూ మూత పెట్టి, ఉడికించాలి. ఆఖరున కొత్తిమీర తరుగు చల్లి, సర్వింగ్ బౌల్‌లోకి మార్చుకోవడమే.
అరటికాయతో..
కావలసినవి : అరటికాయలు- 3, పెరుగు - 1/4 లీ., ఉల్లిపాయ-1, పచ్చిమిర్చి - 3 (చీలికలు) నూనె - 3 స్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్ట్ - స్పూను, ఉప్పు, కారం - తగినంత, పసుపు - 1/4 స్పూను, ధనియాల పొడి - స్పూను, గరం మసాలా - 1/2 స్పూను, కరివేపాకు - రెండు రెబ్బలు
తయారీ : పెరుగును తరకలు లేకుండా చిలికి, ఉప్పు, కారం, ధనియాల పొడి కలిపి, పక్కన ఉంచుకోవాలి. బాండీలో నూనె వేడి చేసి, మీడియంగా ఉడికించిన అరటికాయ ముక్కలను బంగారువర్ణం వచ్చేవరకూ వేయించి, వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అదే బాండీలో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి, దోరగా వేయించాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చివాసన పోయే వరకూ వేయించాలి. స్టౌ ఆఫ్ చేసి, బాండీలో చిలికి ఉంచుకున్న పెరుగును కలపాలి. ఉల్లిపాయలతో పెరుగు బాగా కలసిన తర్వాత స్టౌ ఆన్ చేసి, నూనె పైకి తేలేంతవరకూ తిప్పుతూ ఉడికించాలి. వేయించి పక్కన ఉంచుకున్న అరటి ముక్కలను వేసి, బాగా కలపాలి. గరం మసాలా, చిన్నగ్లాసు నీళ్ళు పోసి, అడుగంటకుండా తిప్పుతూ ఐదు నిమిషాలు ఉడికించాలి. నూనె పైకి తేలేటప్పుడు స్టౌ ఆఫ్ చేసి, కొత్తిమీర తరుగు చల్లాలి. అంతే పెరుగుతో అరటికాయ కూర సిద్ధం.