'అమ్మా.. నీకెందుకు ఎప్పుడూ ఆకాశం, చందమామ, నక్షత్రాలు అంటే ఎంతో ఇష్టం. నువ్ స్టార్ట్ చేసిన పిల్లల స్కూల్స్‌లో కూడా ఒక టెంపరరీ స్కైని క్రియేట్ చేశావు. అది అందరినీ భలే అట్రాక్ట్ చేస్తుంది. పిల్లల నవ్వుల్ని చూసి నీలో నువ్వే మురిసిపోతుంటావ్.. అందరు పిల్లలంటే కూడా నీకిష్టమా? వాళ్ళ నవ్వులు మామూలుగానే గదా ఉన్నాయి. మరి నీకు ఎందుకు స్పెషల్‌గా కనిపిస్తున్నాయి? నువ్వేం చేసినా ఈ ఎలిమెంట్స్ ఎక్కువగా కనిపిస్తాయి ఎందుకు..? దాని వెనక ఉన్న రీజన్ ఏమిటి?' అంటూ ఒక రోజు తన ఐదేళ్ల కూతురు మేడ మీద తెల్లని నక్షత్రాలున్న నల్ల చీర కట్టుకుని పడుకున్న తల్లి పక్కన చేరి, ఆకాశం గుండెల్లోకి వేలు పెట్టి మరీ ఆ నక్షత్రాలను చూపిస్తూ అడిగింది. 'అవునూ.. అసలు ఆ నక్షత్రాలు ఎలా ఆకాశంలోకి వచ్చాయి?' అంటూ మనసులో ఉన్న డౌట్స్‌ని అడిగేసింది.
అప్పుడా తల్లి ఇలా అంది.. 'నువ్వు పసిదానిగా ఉన్నప్పుడు మన ఊళ్ళో కరువొచ్చింది. పనుల్లేవు.. ఎటు చూసినా ఆకలి.. అప్పుడే నువ్వు పుట్టావు. కానీ అప్పటికి నీకు తాపేందుకు నా దగ్గర పాలు కూడా లేవు. మీ నాన్న మన బాధ్యత మోయలేక మనల్ని వదిలి ఎటో వెళ్ళిపోయాడు. అలాంటి టైములో ఒక రోజు పాల కోసం గుక్కపెట్టి ఏడ్చే నిన్ను ఊరుకోబెట్టడానికి ఆకాశంలోని చందమామను చూపిస్తూ ఒక పాట పాడాను. అప్పుడు నువ్వు పాల విషయం మర్చిపోయి, చందమామను చూస్తూ అలా చక్కగా నవ్వుతూ పడుకుండిపోయావ్. ఆ పరిస్థితిలో ఉన్న నిన్ను చూసి తీవ్రమైన బాధను అనుభవించాను. అంత బాధలో నేనున్నప్పుడు దూరంగా ఉన్న ఆ చందమామ నీ ఆకలిని మరిపించి, నవ్వించాడు. అందుకే అప్పుడు నీ నవ్వుల్ని చందమామ చుట్టూ నీ గుర్తుగా చల్లాను. అలా అప్పుడు చల్లిన ఆ నీ నవ్వులే నక్షత్రాలుగా ఇప్పుడు ఆకాశంలో మెరుస్తున్నాయి. చాలా రోజుల తర్వాత ఆ రోజు నేను కూడా నీతో కలిసి నవ్వాను. అప్పుడే నేను కూడా మళ్ళీ కొత్తగా పుట్టినట్టు అనిపించింది.
ఆ తర్వాత నిన్ను ఎత్తుకుని సిటీకి వచ్చాను. పనికోసం పడరాని పాట్లు పడ్డాను. తిండి కోసం అనేక తిప్పలు పడ్డాను. ఎలాగో పని వెతికి పట్టుకుని, నీ ఆకలి తీర్చాను. అలా నిన్ను నా వీపుకు కట్టుకుని ఇదిగో ఈ మురికివాడల పిల్లల్ని ఒక దగ్గరకు చేర్చడం మొదలుపెట్టాను. వాళ్లకి కూడా ఆకాశం గురించి అంతులేని కథలు చెబుతూ ఉండేదాన్ని.
ఆ చిన్నపిల్లలందరి కోసం ఒక చెట్టు నీడన ఒక క్రియేటివ్ స్కూల్‌ని స్టార్ట్ చేశాను. అది కాస్త తర్వాత గదిలోకి మారింది. ఇప్పుడు కొన్ని బ్రాంచెస్ స్థాయికి చేరుకుంది. అప్పటి నీ నవ్వులు ఇప్పుడు ఎంతో మందికి నీడనిస్తున్నాయి. ఆ ఆకాశం కూడా ఎప్పుడూ నీలాగే చల్లగా నన్ను సేదదీరుస్తూ ఉంది. అందుకే నాకు ఆకాశం అన్నా, నక్షత్రాలన్నా ఇష్టం.. పిల్లలందరి నవ్వుల్లో చిన్నప్పటి నిన్ను చూసుకుంటూ ఉంటాను.. నాకు సంబంధించిన అన్నిచోట్ల అవి కనబడుతుంటే ఏదో తెలియని శక్తి వస్తుంది నాకు.' అనేసరికి.. ఆ చిన్నారి కళ్ళల్లో నిజంగా నక్షత్రాలు మెరిశాయి. ఆ చిన్నారి మోము నవ్వుతో విప్పారింది.
- అమూల్య చందు,
90598 24800