Nov 22,2022 07:28

టీవల బి.ఐ.ఎస్‌ (బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌) ''క్రిప్టో ట్రేడింగ్‌ అండ్‌ బిట్‌కాయిన్‌ ప్రైసెస్‌'' అన్న పేరుతో విడుదల చేసిన ఒక వర్కింగ్‌ పేపర్‌ బిట్‌ కాయిన్‌ బండారాన్ని బైట పెట్టే గణాంకాలను వెల్లడించింది. 'హిందూ' పత్రిక తరఫున ఒక అధ్యయన బృందం ఆ పత్రాన్ని విశ్లేషిస్తూ కొన్ని ఆసక్తికర వాస్తవాలను వెలికి తీసింది. ఆ వివరాలను పరిశీలిస్తే బిట్‌ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టినవారిలో 73 శాతం నష్టపోయారని తెలుస్తోంది.
       క్రిప్టో కరెన్సీ భవిష్యత్తులో ఆర్థిక లావాదేవీలలో నగదు స్థానాన్ని ఆక్రమిస్తుందని, ఆన్‌లైన్‌ మోసాలకు అదే పరిష్కారం అని, నల్ల ధనం సమస్య సైతం పరిష్కారం అయిపోతుందని, క్రిప్టో కరెన్సీని ఎవరూ దొంగిలించలేరని....ఇలా ఆకాశానికి ఎత్తేస్తూ చాలా ప్రచారం జరిగింది. స్టాక్‌ మార్కెట్‌ లో షేర్లను కొనుగోలు చేసినట్టే బిట్‌ కాయిన్‌ వంటి వివిధ రకాల క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేయవచ్చు. దానికి ప్రభుత్వం గాని, రిజర్వు బ్యాంకు గాని ఏ విధమైన పూచీ ఇవ్వదు. క్యాసినోలలో జూదం ఆడాలంటే అక్కడ ముందు నగదు చెల్లించి ప్లాస్టిక్‌ కాయిన్‌ లను కొనాలి. వాటితో జూదం ఆడతారు. గెలిచినవారు తాము గెలుచుకున్న ప్లాస్టిక్‌ కాయిన్లను మళ్ళీ క్యాసినో నిర్వాహకులకు ఇచ్చి వాటి విలువకు సమానమైన మొత్తంలో నగదు తీసుకుంటారు. ఇంచుమించుగా బిట్‌ కాయిన్‌ దీ అదే పరిస్థితి. మార్కెట్‌లో బిట్‌ కాయిన్‌ లను కొనుగోలు చేయవచ్చు, తిరిగి అమ్మవచ్చు. అమ్మిన రోజున ఆ బిట్‌ కాయిన్‌ విలువ ఎంత ఉందో ఆ మొత్తం మనకు దక్కుతుంది.
      ఈ బిట్‌ కాయిన్‌ లలో పెట్టుబడి లాభదాయకంగా ఉందన్న ప్రచారం చాలా జోరుగా కొన్నాళ్ళు సాగింది. వాటిని కొన్నవారి అనుభవాలేమిటన్నది ఇప్పుడు బైటపడింది. ప్రపంచంలో అమెరికా, టర్కీ దేశాల తర్వాత అత్యధికంగా క్రిప్టో కరెన్సీ వ్యాపారపు యాప్‌ లను డౌన్‌ లోడ్‌ చేసుకున్న మూడవ దేశం మనదే. మన దేశంలో ప్రతీ లక్ష మంది జనాభాలో 150 మంది వరకూ ఈ క్రిప్టో యాప్‌ లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వారిలో 73 శాతం మంది బిట్‌కాయిన్‌ ధర 20,000 డాలర్లుగా ఉన్నప్పుడు ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. సగటున నెలకు 100 డాలర్లను బిట్‌కాయిన్‌ వ్యాపారంలో వీరు పెట్టుబడి పెట్టారు. ఈ విధంగా చిన్న చిన్న మొత్తాలలో బిట్‌ కాయిన్‌లో పెట్టుబడులు పెడుతున్న సమయంలోనే బిట్‌ కాయిన్లను అంతకు ముందే పెద్దమొత్తాలలో కొనుగోలు చేసినవారు వాటిని అమ్మకాలకు పెట్టారు. బిట్‌కాయిన్‌ ధర పెరుగుతున్న కాలంలో చిన్న మదుపుదారులు కొన్నారు. పెద్ద మదుపుదారులు అమ్ముకున్నారు. ఆ విధంగా పెద్ద మదుపుదారులు (వీరు సుమారు 23 నుండి 28 శాతం ఉన్నారు) లాభపడ్డారు. ఆ సమయంలో కొనుగోలు చేసిన చిన్న మదుపుదారులు నష్టపోయారు. ఇలా బిట్‌కాయిన్ల కొనుగోలులో నష్టపోయిన చిన్న మదుపుదారులలో 40 శాతం మంది 35 సంవత్సరాల లోపు యువజనులే అని ఆ అధ్యయనం వెల్లడించింది.

- ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌