
రోడ్లు, కూడళ్లు, బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సంస్థలను రోడ్‌షోలు, బహిరంగ సభలు లేదా నిరసనల వంటివి కట్టడి చేయడానికి ప్రభుత్వం జనవరి 2న జారీ చేసిన జీవో నెంబర్ 1ని రద్దు చేస్తూ శుక్రవారంనాడు రాష్ట్ర హైకోర్టు తీర్పునివ్వడం హర్షణీయం. ఈ జీవో ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పడం రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేయడమే! ప్రభుత్వ విధానాలవల్ల నష్టపోయిన వర్గాలు, తరగతుల ప్రజానీకం నిరసనలు, ఉద్యమాలు సాగించడానికి ఈ తీర్పు దోహదపడుతుంది. 'విపక్షాలు కార్యక్రమాలను నిర్వహించకుండా జీవో 1ను జారీ చేశారని, దాన్ని కొట్టేయకపోతే భవిష్యత్‌లో ప్రతిపక్షాల నేతలు రోడ్లపై కార్యక్రమాలను నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందన్న' పిటిషనర్ల వాదనను ఆమోదించి హైకోర్టు ప్రజాస్వామ్యానికి, ప్రజాతంత్ర హక్కులకు పట్టం కట్టింది. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఉండగా జీవో నెం 1 జారీ చేయాల్సిన అవసరం ఏముందని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించడం సర్కారు చేసినది కుయత్నమని చెప్పడమే! ఈ జీవో వల్ల ర్యాలీలు, ధర్నాలు, రోడ్‌షోల నియంత్రణ చేసే అధికారం పోలీసుల నుంచి ప్రభుత్వానికి మారిపోతుందన్న పిటిషనర్ల తరఫు వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పోలీసులకు ఆదేశాలిచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేయడం ద్వారా ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికీ సంబంధించిన లక్ష్మణరేఖను కూడా గుర్తు చేసింది.
జీవో నెం 1 జారీ చేయడం మొదలు దానిని ఆగమేఘాల మీద అమలు చేయపూనుకోవడమేగాక ఆ క్రమంలో సుప్రీం కోర్టు గడప తొక్కడం వరకూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరి వివాదాస్పదంగా ఉంది. జీవో ను సవాల్ చేస్తూ టిడిపి, సిపిఐ, ఇంకొన్ని ప్రజాసంఘాల నాయకులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టి దాన్ని నిలిపివేస్తూ స్టే ఆదేశాలిచ్చింది. అప్పుడైనా ప్రభుత్వం సంయమనం పాటించకుండా మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ జరిపి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో రాష్ట్ర హైకోర్టు వ్యాజ్యాలపై సమగ్ర విచారణ పూర్తి చేసి జనవరి 24న రిజర్వులో పెట్టిన తీర్పును శుక్రవారంనాడు వెలువరించింది. తుదకు సర్కారుకు మొట్టికాయ పడింది. జీవో నెంబరు 1కి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తినా ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడకుండా మరింత పటిష్టంగా జీవోను అమలు చేయాలని చూడడం క్షంతవ్యం కాదు. ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనల పేరుతో అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు విపరీతంగా పెరిగిపోయాయి. పోలీసు స్టేషన్లలో ఆయా సంఘాలు, పార్టీల నాయకులనేగాక కుటుంబ సభ్యులను సైతం నిర్బంధించడం అమానుషం. రాజకీయ పార్టీలు, వివిధ ప్రజాసంఘాల భారీ కార్యక్రమాలే కాదు చీమ చిటుక్కుమన్నా జీవో నెంబరు 1ని ఓ ఆయుధంలా వినియోగించి నిరసన గొంతులను నొక్కేయడం దారుణం.
ఏది ఏమైనా కందుకూరు, గుంటూరుల్లో నిర్వహించిన సభల్లో తొక్కిసలాటలు, అమాయక ప్రజల ప్రాణాలు పోయిన నేపథ్యంలో ప్రజాహితం కోసమే జీవో నెం 1ని జారీ చేశామని చెప్పిన ప్రభుత్వ వాదనను హైకోర్టు తిరస్కరించింది. బ్యానర్లు, ఫ్లెక్సీలు వంటివి కూడా ఏర్పాటు చేయడానికి వీల్లేదనే షరతు కూడా జీవోలో ఉందని ఆక్షేపించింది. సభలు, సమావేశాలను నిర్వహించేందుకు పార్టీలకు అధికారం ఉంటుందని, వాటికి భద్రత కల్పించాల్సింది పోలీసులేనని కుండ బద్దలు కొట్టింది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పోకడలు విడనాడి పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడే చర్యలు చేపట్టాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కును నిరాకరించడం చెల్లదు. హైకోర్టు తాజా తీర్పుతో అది మరోసారి రుజువైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇపుడైనా విజ్ఞతతో వ్యవహరించాలి.