Nov 01,2023 09:56

లెక్కల మాస్టారు ఎనిమిదో తరగతిలోకి ప్రవేశించారు. ముందు రోజు ఇచ్చిన లెక్కల గురించి వాకబు చేశారు. కొంతమంది చేశారు. కొంతమంది చేయలేదు. లెక్కలు చేయని విద్యార్థులను ఒక్కొక్కరిని ఎందుకు చేయలేదో అడిగి తెలుసుకుం టున్నారు. పిల్లలంతా రకరకాల కారణాలు చెప్పారు. మాస్టారుకు కోపం వచ్చింది. చెప్పిన కారణాలే చెప్పడంతో విసుగు వచ్చింది. ఓపిక నశించి మీ కాకి కథలు నా దగ్గర చెప్పొద్దు.' అని హెచ్చరించారు.
          ఓ విద్యార్థి లేచి 'సార్‌, కాకి కథలు అంటే ఏమిటి?' అని అడిగాడు.'కాకి కథలు' అనే నానుడి జనం వాడుక నుండి వచ్చిన పదం. సరైన జవాబు చెప్పకుండా లేనిపోని కారణాలు ఆపాదిస్తూ తప్పించుకోవడాన్ని అంటే పరోక్షంగా అబద్ధాలు చెప్పడం అని అర్థం' అని చెబుతూ పిల్లలకు మాస్టారు ఓ కథ కూడా చెప్పారు. ''పూర్వకాలంలో మొగల్‌ రాజు అక్బర్‌ ఉండేవాడు. ఆయన వద్ద బీర్బల్‌ అనే తెలివైన మంత్రి ఉండేవాడు. బీర్బల్‌ చాలా చాకచక్యంగా సమయస్ఫూర్తితో సమాధానాలు చెప్పేవాడు. తన శక్తియుక్తులతో రాజుని మెప్పించేవాడు. ఒకరోజు అక్బర్‌కు ఒక సందేహం కలిగింది. అదేమిటంటే రాజ్యంలో మొత్తం ఎన్ని కాకులు ఉంటాయో సరైన సమాధానం చెప్పమని అడిగాడు. బీర్బల్‌ వెంటనే ఏమాత్రం తడుముకోకుండా లక్షా 60 వేల కాకులు ఉంటాయని టక్కున చెప్పాడు. రాజుకు ఆశ్చర్యం వేసింది. కాకులను లెక్కపెట్టకుండా లెక్కను అంత కరెక్ట్‌గా ఎలా చెప్పావు అని బీర్బల్‌ని అడిగాడు. 'కావాలంటే మీరు లెక్క పెట్టుకోవచ్చు' అని బీర్బల్‌ సమాధానం చెప్పాడు. 'ఒకవేళ నీ లెక్కకు ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న నీవు ఓడిపోయినట్లే కదా!' అని అక్బర్‌ అన్నాడు. 'దానిదేముంది. ఒకవేళ ఎక్కువగా ఉంటే వేరే రాజ్యం కాకులు వచ్చి చేరవచ్చు. తక్కువగా ఉంటే మన రాజ్యం కాకులే వేరే రాజ్యంలో వున్న చుట్టాల ఇంటికి వెళ్ళిపోవచ్చు' అని సమర్థించుకుంటూ చమత్కారంగా చెప్పాడు బీర్బల్‌. ఆ సమాధానం విన్న అక్బర్‌కి నవ్వొచ్చింది. ఇలా సరైన కారణాలు లేకుండా వంకలు చెబుతున్నప్పుడు 'కాకి కథలు' చెప్పకు అంటారు' అని మాస్టారు కథ ముగించారు.
- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి,
94415 61655.