
పోలవరం ప్రాజెక్టుపై సోమవారం శాసనసభలో ఆవిష్కృతమైన చర్చ ప్రాజెక్టుపై ఆశలు పెట్టుకున్న వారిని మరింత అయోమయానికి, భూములు, ఊళ్లు, ఇళ్లు కోల్పోయి నిర్వాసితులైన లక్షల మంది గిరిజన నిర్వాసితులను తీవ్ర వేదనకు గురి చేసింది. ప్రాజెక్టు పనులు మొదలయ్యాక, మరీ ముఖ్యంగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణం జరుగుతున్న తరుణంలో గోదావరికి కొద్దిపాటి వరదలొచ్చినా ముంపు గ్రామాలు మునుగుతున్నాయి. నిర్వాసితులు ఉన్నపళంగా కట్టుబట్టలతో ఇళ్లు, ఊళ్లు ఖాళీ చేయాల్సి వస్తోంది. మొన్న వచ్చిన వరదలు బీభత్సం సృష్టించాయి. నేటికీ కొండలపై, గుడారాల్లో ముంపు బాధితులు బతుకీడుస్తున్నారు. ఈ సమయాన అసెంబ్లీలో చర్చ అంటే ప్రభుత్వం నుంచి స్పష్టమైన భరోసా లభిస్తుందని వెయ్యి కళ్లతో ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వ తప్పిదాలను ఏకరువు పెట్టడానికే సమయాన్నంతా వెచ్చించింది. పోలవరం జాప్యానికి మీరు కారణం అంటే కాదు మీరు అన్న నిందారోపణలే తప్ప నిర్వాసితుల వెతలు పట్టించుకోలేదు. పైపెచ్చు కాంటూరు లెక్కలతో నిర్వాసితుల పరిహారం వాయిదా వేస్తున్నట్లు సభా వేదిక ద్వారా ముఖ్యమంత్రి ప్రకటించారు.
పోలవరం నిర్మాణాల్లో గత టిడిపి ప్రభుత్వ లోపాలను కనుక్కో గలిగిన వైసిపి ప్రభుత్వం, నిర్వాసితుల లెక్కల దగ్గరకొచ్చేసరికి ఆ ప్రభుత్వ గణాంకాలనే పొల్లు పోకుండా ఒప్పజెప్పడం విడ్డూరం. ప్రాజెక్టును ప్రతిపాదిత 45.72 మీటర్ల (కాంటూర్) ఎత్తులో నిర్మిస్తే లక్షా పది వేల మంది మునుగుతారు. 41.15 మీటర్ల వద్ద నీరు నిలిపితే 20 వేల మందే మునుగుతారన్నది గత ప్రభుత్వ లెక్క. ఇటీవలి వరదల్లో 38 మీటర్ల ఎత్తుకే 45.72 కాంటూరు లోని 373 గ్రామాలూ మునిగాయి. అంతేకాదు, ఆపైన వంద గ్రామాల చుట్టూ రా నీరు చేరింది. దీన్నిబట్టి కాంటూరు లెక్కలు కాకి లెక్కలనేగా? వాటిని పట్టుకొని ఈ ప్రభుత్వం వేలాడుతోంది. ప్రాజెక్టు కింద లక్ష మంది మునుగుతుంటే 41.15 కాంటూరు వద్ద 20 వేల మంది మునుగుతారు, ముందు వారికే పునరావాసం అంటే తతిమ్మా 90 వేల మంది గతేంటి? చెప్పిన కాంటూర్ వరకు ఇస్తామన్న ఆర్ అండ్ ఆర్ చెల్లింపులకు జిఓ ఇచ్చేశామన్నారు సిఎం. ఏడాదైనా రూ.6.5 లక్షల నుంచి పది లక్షలకు పెంచి చెల్లింపులు చేయనేలేదు. భూములు కోల్పోయిన వారికి ఎకరానికి రూ.10 లక్షలకు పెంచుతామని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడేమో తూచ్.. అలా అనలేదు, రూ.5 లక్షలేననడం మాట తప్పడం కాదా? పోలవరంలో 2013-భూసేకరణ చట్టం ఎందుకు అమలు కాదు? ఈ ప్రాజెక్టు నిర్వాసితులేమన్నా వేరే దేశంలో ఉన్నారా?
విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్నారు. అంటే కేంద్రమే ప్రాజెక్టుకయ్యే నిధులన్నింటినీ పెట్టుకోవాలి. ఏ ప్రాజెక్టూ గాలిలో కట్టరు. భూమి కావాల్సిందే. కనుక భూములు కోల్పోయే నిర్వాసితుల పునరావాసం ప్రాజెక్టు వ్యయంలో కలిసే ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం డొంక తిరుగుడుగా మాట్లాడుతోంది. నిర్వాసితుల వ్యవహారం తమది కాదంటోంది. కేంద్రాన్ని నిలదీసి ఒప్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్ని దాటవేస్తోంది. చేసిన పనులకు రావాల్సిన నిధులనూ గట్టిగా అడగలేకపోతోంది. 2013-14 అంచనాల ప్రకారం రూ.20 వేల కోట్లే ఇస్తామని కేంద్రం ఒకటికి పదిసార్లు వల్లెవేస్తున్నా మౌనమే. పోలవరం తాజా అంచనా రూ.55 వేల కోట్లు. అందులో రూ.33 వేల కోట్లు నిర్వాసితుల పునరావాసానికే. పోలవరం ప్రాజెక్టును ఆంధ్రసీమకు జీవనాడిగా అభివర్ణిస్తారు. అటువంటి జీవనాడికి ఊపిరులూదుతూ తమ సర్వస్వాన్ని ధారపోసిన నిర్వాసితులకు అందించే పునరావాసంపై కేంద్ర సర్కార్ దోబూచులాడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మాటలతో సరిపెడుతోంది. నిర్వాసితుల పట్ల మానవతతో ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కర్కశంగా వ్యవహరించడం దారుణం. జాతి అభివృద్ధి కోసం భూములను, ఊళ్లను, ఇళ్లను అర్పించిన త్యాగధనులను గౌరవించి ఇతోధికంగా ఆదుకోవాలి. చట్టప్రకారం అది వారి బాధ్యత. నిర్వాసితులు ఉద్యమాలతో పాలకుల మెడలు వంచాలి.