Nov 12,2023 15:34

అనగనగా ఒక అడవికి పక్కన సీమాపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో కోటయ్య, కాంతమ్మ అనే దంపతులు ఉన్నారు. ఆ దంపతులకు ఒక కూతురు ఉంది. ఆ కూతురి పేరు రమ్య. రమ్యకు చిన్నప్పటినుంచి బడికి వెళ్లడం ఇష్టం ఉండదు. తనకు ఆటలు ఆడడం, పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. తన తండ్రి చదువుకోలేదు. అందుకని రమ్యను చాలా పెద్ద చదువులు చదివిద్దామని అనుకున్నాడు. కానీ రమ్య మాత్రం నాకు చదువు వద్దని పట్టు పట్టింది. కానీ తన తండ్రి మాత్రం ఆటలు ఆడడానికి, పాటలు పాడడానికి ఒప్పుకోవడం లేదు. కానీ రమ్య మాత్రం తన బాల్యం మొత్తం ఆటపాటలతో గడిపేసింది.
ఒకరోజు రమ్య రోడ్డు పక్కన నడుస్తూ పాటలు పాడుకుంటూ వెళుతుంది. అయితే ఇద్దరు పిల్లలు వచ్చి, అక్కా... నువ్వు పాటలు చాలా బాగా పాడుతున్నావు. మాకు పాటలు పాడడం నేర్పిస్తావా అని అడిగారు! కానీ మా నాన్న ఒప్పుకోడు అని అంది రమ్య.
''అక్కా, ప్లీజ్‌ నీకు ఎంత ఫీజు కావాలో అంత తీసుకో అక్క '' అని అడిగారు. రమ్య కాదనలేక సరే అంది.
తర్వాత రోజు ఆ పిల్లలు ఇద్దరూ రమ్య వాళ్ళ ఇంటికి వెళ్లారు. వాళ్లిద్దరినీ కూర్చోపెట్టి రమ్య కూడా కూర్చుంది. ఇక మొదలు పెడదామా! అని పాటలు నేర్పించడం మొదలు పెట్టింది. అంతలోనే కోటయ్య బయటకు వచ్చి ఏంటి ఇక్కడ గోల అని అరిచాడు.
నాన్న నేను వీళ్ళకు పాటలు పాడడం నేర్పిస్తున్నాను అంది రమ్య.
'ఏంటి నువ్వు వాళ్ళకి పాటలు నేర్పిస్తున్నావా! నువ్వు పాటలు నేర్పించడానికి వీలు లేదు' అని ఆ పిల్లల ఇద్దరినీ తరిమేశాడు.
'ఎందుకు నేర్పించకూడదు నాన్నా!' అని అడిగింది రమ్య.
'నీకు ఏమీ తెలియదు' అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు కోటయ్య.
నాన్న ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు నాకు అసలు ఆటలు, పాటలు అంటే ఎందుకు ఇష్టం! అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది రమ్య.
కొన్నాళ్లకు సీమాపురం అడవిలోనూ, ఊరిలోకి సినిమా తీసేవాళ్ళు వచ్చారు. సినిమా తీయడం మొదలుపెట్టారు. అటు నుంచి పాటలు పాడుతూ వెళ్తున్న రమ్యను చూశారు. సినిమా వాళ్లు అప్పుడు రమ్యను కలవడానికి దగ్గరకి వెళ్ళలేదు. తర్వాత రోజు ఆమెను కలిశారు.
'నువ్వు పాటలు బాగా పాడుతున్నావ్‌! సినిమాలలో పాడడానికి వస్తావా?' అని అడిగారు సినిమా వాళ్లు.
'మా నాన్న ఒప్పుకోడు నేను రాను' అని చెప్పింది రమ్య.
వాళ్ల ఇంటికి వెళ్లారు. కోటయ్య బయట కూర్చుని ఉన్నాడు. 'ఏమిటి ఎవరు వీళ్లు' అని అడిగాడు.
'నాన్న వీళ్ళు సినిమా వాళ్ళు'
'ఏంటి సినిమా వాళ్ళ ఎందుకు వచ్చారు? ఏమైనా చేసావా?' అడిగాడు నాన్న.
'నేను ఏమి చేయలేదు వాళ్లు నీతో మాట్లాడాలని వచ్చారు' అని చెప్పింది రమ్య.
'ఎందుకు వచ్చారండి.. మీరు నాతో ఏం మాట్లాడాలి' అని అడిగాడు కోటయ్య.
'మీ అమ్మాయి పాటలు చాలా బాగా పాడుతుంది. సినిమాలో పాడడానికి పంపించండి' అన్నారు.
'ఏమిటి నా కూతురిని సినిమాలోకా! కుదరదు. సినిమాలోకి దింపితే దీనికి మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు' అన్నాడు కోటయ్య.
'అలా ఏమీ జరగదు.' అంటూ కొంత సేపు మాట్లాడి, ఒప్పించారు.
ఆ తర్వాత రమ్య పట్నం వెళ్లింది. రమ్య పాటలు వింటూ, రమ్య పేరు పేపర్లోనూ, టీవీల్లోనూ వస్తుంటే కోటయ్య చాలా గర్వపడ్డాడు. ఊరిలో వారందరూ కోటయ్య దగ్గరకు వచ్చి రమ్యను పొగుడుతుంటే అతడి సంతోషానికి అవధులు లేవు. నా కూతురు గొప్ప గాయని అయింది అని పొంగిపోయాడు.
అందుకే పిల్లలు ఇష్టపడిన పని చేయనిస్తే వారు దానిలో నిష్ణాతులవుతారు.
Country-singer

పి. శ్రీవైష్ణవి
9వ తరగతి,
అరవింద హైస్కూల్‌,
కుంచనపల్లి.