
గుజరాత్ మారణ హోమం తర్వాత కాలంలో అదానీ ఇనుమడించిన ఉత్సాహంతో పెట్టుబడులు పెట్టడం మొదలెట్టాడు. అందరూ మోడీని దాదాపు ఒక అంటరాని వ్యక్తిగా బహిష్కరించిన ఆ కాలంలో మోడీని ఒక గొప్ప వ్యక్తిగా మళ్ళీ నిలబెట్టడానికి తోడ్పడ్డాడు. అప్పటినుంచీ వారిద్దరి మధ్య ఒక భాగస్వామ్యం ఏర్పడింది. నాటినుంచీ అది ఇద్దరికీ పరస్పరం తోడ్పడేదిగా, ఒకరినొకరు బలపరుచుకునేదిగా కొనసాగుతోంది.
మోడీ త్వరలో ప్రధాని కానున్నాడన్న వాతావరణం ఏర్పడ్డాక అదానీ సంస్థల అభివృద్ధి తీరు పూర్తిగా వేరే స్థాయికి చేరుకుంది. మోడీని బిజెపి అధికారికంగా తన ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత 12 నెలల కాలంలో అదానీ సంస్థల షేర్ల మార్కెట్ విలువ 65 శాతం పెరిగింది. 2001 నాటికి రూ.3,741 కోట్లుగా ఉన్న అదానీ గ్రూపు సంస్థల టర్నోవర్ 2013-14 నాటికి రూ.75, 659 కోట్లకు పెరిగింది ( 24 రెట్లు)
అదానీ గ్రూపు కంపెనీల షేర్ల విలువ స్టాక్ మార్కెట్‌లో ఒక్కసారి కుప్పకూలిపోవడంతో చుక్కలు కనిపించాయి. హిండెన్‌బర్గ్ రిసెర్చి సంస్థ తన 129 పేజీల నివేదికను బైట పెట్టినప్పటినుంచీ ఇదే పరిస్థితి. అదానీ గ్రూపు సంస్థల రుణాలు ఏ మోతాదులో ఉన్నదీ, పన్నుల ఎగవేతకు ఏ విధంగా విదేశీ అడ్డదారులను తొక్కినదీ ఆ నివేదిక వెల్లడి చేసింది. భారతీయ వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ ''ప్రపంచ కార్పొరేట్ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణానికి'' పాల్పడినట్టు హిండెన్‌బర్గ్ నివేదిక ప్రకటించింది. అందరికీ అందుబాటులో ఉండే సమాచారాన్ని జల్లెడ పట్టి సేకరించిన వివరాలతోబాటు బైటకు పొక్కిన కొన్ని ఇ-మెయిల్స్ ద్వారా దొరికిన సమాచారాన్ని కూడా చాలా శ్రద్ధగా అధ్యయనం చేసిన మీదట ఆ నివేదిక రూపొందింది.
స్టాక్ మార్కెట్‌లో నమోదైన ఏడు కంపెనీలను, వాటికి అనుబంధ సంస్థలుగా ఉన్న 578 కంపెనీలను అదానీ, అతని కుటుంబ సభ్యులు మాత్రమే నిర్వహిస్తున్నారని ఆ నివేదిక ఎత్తిచూపింది. హిండెన్‌బర్గ్ నివేదిక వెల్లడి కాకమునుపు ఈ కంపెనీలకు అన్నింటికీ కలిపి 20,000 కోట్ల డాలర్ల మార్కెట్ విలువ ఉండేది (రూ.16 లక్షల కోట్ల రూపాయలు). ఒకసారి ఈ నివేదిక వివరాలు అందరికీ వెల్లడి కావడంతో పల్టీలు కొట్టి ఆ విలువ సగానికి సగం ఆవిరైపోయింది. పన్నులను ఎగవేయాలనుకునేవారికి ఆశ్రయం కల్పించే విదేశాలలో తప్పుడు పద్ధతులను అనుసరించడం, స్టాక్ లావాదేవీలలో తిమ్మిని బమ్మి చేసే ఎత్తుగడలను పాటించడం వంటి పనులకు అదానీ గ్రూపు పాల్పడిందని ఆ నివేదిక ఆరోపించింది. అదానీ కంపెనీల డాక్యుమెంట్లను, అందుబాటులోకి వచ్చిన సమాచారాన్ని విశ్లేషించిన మీదట ఆ గ్రూపు కంపెనీలకు రుణభారం చాలా ఎక్కువగా ఉందని, స్టాక్ మార్కెట్‌లో నమోదైన ఏడు కంపెనీలకూ చాలా ఎక్కువ విలువ ఉన్నట్టు చూపించారని నిర్ధారించింది. డొల్ల కంపెనీలను అడ్డం పెట్టుకుని షేర్ల ధరలను ఏ విధంగా పెంచుకుంటూ పోయారో, అలా బూటకపు అధిక ధరల ప్రాతిపదికను ఉపయోగించి ఆ షేర్లను తాకట్టు పెట్టి ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలనుండి రుణాలను ఏవిధంగా పొందారో, ఆ లావాదేవీల ప్రాతిపదికన మార్కెట్‌లో షేర్ల విలువను ఏవిధంగా పెంచుకున్నారో ఆ నివేదిక చాలా వివరంగా తెలియజెప్పింది. మారిషస్, సైప్రస్, యుఎఇ వంటి దేశాలలో ఆ డొల్ల కంపెనీల స్థావరాలున్నట్టు వెల్లడించింది.
నివేదికలో వెల్లడించిన చాలా అంశాలు అప్పటికే ఎవరైనా పొందగలిగే విధంగా అందుబాటులోనే ఉన్నాయి. వాటిని బట్టి అదానీ కంపెనీల లావాదేవీలపై ప్రభుత్వ నిఘా విభాగాలు, నియంత్రణ సంస్థలు నిజానికి విచారణ చేపట్టాలి. కాని ఆవిధంగా చేయడంలో ఆ ప్రభుత్వ సంస్థలు ఘోరంగా విఫలమయ్యాయి. దాంతో హిండెన్‌బర్గ్ నివేదిక మదుపుదారుల మీద, సాధారణ ప్రజానీకం మీద అధిక ప్రభావాన్ని కనపరచింది.
,ఈ ఉదంతంలో అదానీ గ్రూపు మొదట్లో స్పందించిన తీరు పేలవంగా ఉంది. ''దేశభక్తి'' రాజకీయాన్ని ముందుకు తేవడం, నివేదిక వాస్తవాలను పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించడం దీనిని సూచిస్తున్నది. 'అదానీ మీద దాడి అంటే ఇండియా మీద దాడి' అన్న తీరులో జరిగిన ప్రచారం ప్రజలను ఏవిధంగానూ సంతృప్తి పరచలేకపోయింది. షేర్ల ధరల పతనం కొనసాగింది. ఆ పతనాన్ని అరికట్టడానికి జోక్యం చేసుకునే క్రమంలో ప్రకటించిన అదనపు షేర్ల అమ్మకం (ఎఫ్‌పివో) తేలిపోయింది. అంచనాలకు మించి ఎక్కువగా ఆ షేర్లకు సానుకూల స్పందన వచ్చిందని మొదట్లో ప్రకటించుకున్నా, ఆ తర్వాత వాటి అమ్మకాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించవలసి వచ్చింది. నైతిక విలువలకు కట్టుబడి ఆవిధంగా చేస్తున్నట్టు ప్రకటించుకున్నా అది వాస్తవం కాదు. అదానీ స్వంత ధనంతో ఆ షేర్లను అధిక ధరకు కొనడం, సహచర కార్పొరేట్ సంస్థలు తోడుగా నిలవడంకోసం కొన్ని షేర్లను కొనడం తప్ప సాధారణ మదుపుదారులు ఎటువంటి ఆసక్తినీ కనపరచలేదు. దాంతో వాటి అమ్మకాన్ని రద్దు చేసుకున్నారు. డాలర్లలో అమ్మకానికి పెట్టిన షేర్లను కూడా వెనక్కి తీసుకున్నారు. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలించినప్పుడు అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలో ఒక ఉన్నతస్థాయి విచారణను వెంటనే చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం ఔతోంది.
అదానీ సంపద మూలాలు
ప్రైవేటు రంగంలో ఓడరేవుల నిర్వహణ రంగంలో అతి పెద్ద కంపెనీగా, విద్యుదుత్పత్తి రంగంలో అతి పెద్ద ప్రైవేటు సంస్థగా ఉన్న కార్పొరేట్ సంస్థకు గౌతమ్ అదానీ అధిపతి. ఇది గాక, బొగ్గు గనులు, ముడిచమురు, సహజ వాయువు, గ్యాస్ పంపిణీ, విద్యుత్తు రవాణా, పంపిణీ, భవన నిర్మాణాలు, మౌలికవసతుల ప్రాజెక్టులు, లాజిస్టిక్స్ (వివిధ రంగాలలో ప్రాజెక్టులు చేపట్టడానికి కావలసిన ఏర్పాట్లన్నీ సమకూర్చడం) అంతర్జాతీయ వాణిజ్యం, విద్య, రియల్ ఎస్టేట్, ఖాద్య తైలాలు, ఆహారధాన్యాలను నిలవ చేయడం, తాజాగా విమానాశ్రయాల నిర్వహణలో దాదాపు గుత్తాధిపత్యాన్ని కలిగివుండడం - ఇవన్నీ అదానీ గ్రూపు సామ్రాజ్యంలో భాగంగా ఉన్నాయి. 28 దేశాలతో 30 రకాల సరుకుల వాణిజ్యాన్ని ప్రస్తుతం ఈ సంస్థలు నిర్వహిస్తున్నాయి.
మోడీ కేంద్రంలో మొదటిసారి అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 2014 నాటికి అదానీ గ్రూపు స్వంత ఆస్తుల విలువ 710 కోట్ల డాలర్లు అని ఫోర్బ్స్ సంస్థ అంచనా వేసింది.
గౌతమ్ అదానీ తన కాలేజీ చదువును అర్ధాంతరంగా ముగించాడు. కొన్నాళ్ళు వజ్రాల వ్యాపారంలో ఆరితేరిన తర్వాత 1981లో అహమ్మదాబాద్‌కు మకాం మార్చాడు. తన బంధువు ఒకరు పివిసి వ్యాపారం ప్రారంభించి నిర్వహించడానికి తోడ్పాటు అందించాడు. 1988లో అదానీ స్పోర్ట్స్ పేర క్రీడా రంగంలో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. దాంతో గుజరాత్‌లో అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు. దాంతోబాటు వివాదాలనూ మూటగట్టుకున్నాడు. ఐతే ఆ వ్యాపారం సైజు చూస్తే ఆ వ్యక్తి భవిష్యత్తులో ప్రపంచంలోనే రెండడో అతిపెద్ద ధనవంతుడు కాగలడని ఎవరూ అనుకోరు.
గుజరాత్ లో చెలరేగిన మత మారణహోమం మోడీ రాజకీయ జీవితంలో అత్యంత క్లిష్టమైన ఘట్టం. మోడీని ముఖ్యమంత్రిగా తొలగించాలన్న డిమాండు ముందుకొచ్చింది. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సైతం ముఖ్యమంత్రిగా మోడీ ప్రవర్తించిన తీరును తప్పుబట్టారు. సిఐఐ మోడీ తీరును తీవ్రంగా ఆక్షేపించింది. సరిగ్గా ఆ సమయంలో అదానీ రంగంలోకి దిగాడు. గుజరాత్ పారిశ్రామికవేత్తల సంఘాన్ని నిలువునా చీల్చి పోటీ సంస్థగా 'రిసర్జెంట్ గ్రూప్ ఆఫ్ గుజరాత్' ను ఏర్పాటు చేశాడు. ఈ గ్రూపు ఆధ్వర్యంలో' వైబ్రెంట్ గుజరాత'్ శిఖరాగ్ర సదస్సును ఏర్పాటు చేయడంలో అదానీ ముఖ్య పాత్ర పోషించాడు. మోడీ చుట్టూ పారిశ్రామికవేత్తలతో కూడిన ఒక బలమైన అభిమానుల బృందాన్ని సమకూర్చడంలో కృతకృత్యుడయ్యాడు. 'గుజరాత్ నమూనా అభివృద్ధి' అనే ఒక కాల్పనిక భావనను ప్రచారంలో పెట్టగలిగాడు. అదే 2014 నాటికి మోడీ విజయం సాధించడానికి ప్రధాన ప్రాతిపదికగా ఉపయోగపడింది.
గుజరాత్ మారణ హోమం తర్వాత కాలంలో అదానీ ఇనుమడించిన ఉత్సాహంతో పెట్టుబడులు పెట్టడం మొదలెట్టాడు. అందరూ మోడీని దాదాపు ఒక అంటరాని వ్యక్తిగా బహిష్కరించిన ఆ కాలంలో మోడీని ఒక గొప్ప వ్యక్తిగా మళ్ళీ నిలబెట్టడానికి తోడ్పడ్డాడు. నానుంచీ వారిద్దరి మధ్య ఒక భాగస్వామ్యం ఏర్పడింది. అప్పటినుంచీ అది ఇద్దరికీ పరస్పరం తోడ్పడేదిగా, ఒకరినొకరు బలపరుచుకునేదిగా కొనసాగుతోంది.
2002 నుండి 2014 మధ్య కాలంలో (మోడీ ప్రధాని అయ్యే వరకూ) అదానీని మోడీ పూర్తి స్థాయిలో బలపరిచాడు. ముంద్రా పోర్టు చుట్టూ 7350 హెక్టార్ల భూమిని చదరపు మీటరుకు ఒక సెంటు చొప్పున రేటు నిర్ణయించి కేటాయించాడు. (18,375 ఎకరాలు, ఎకరా కి రూ.3200 చొప్పున) ఇది తక్కిన పారిశ్రామికవేత్తలకు కేటాయించిన రేటు కన్నా కూడా చాలా తక్కువ. అదే భూమిని అదానీ ఇతరులకి చదరపు మీటర్‌కు 11 డాలర్ల రేటుకు లీజుకు ఇచ్చాడు. ఇది అదానీ ప్రభుత్వానికి చెల్లించిన రేటు కన్నా వందరెట్లు ఎక్కువ. ఇది కాక...ఎస్‌ఇజడ్ కోసం అదానీ గ్రూపు సేకరించిన వేలాది ఎకరాల భూమికి స్టాంపు డ్యూటీ చెల్లింపు నుండి మినహాయించాడు. ఆ గ్రూపు అన్ని పర్యావరణ నిబంధనలనూ, గిరిజన రక్షణ చట్టాలనూ అడ్డగోలుగా ఉల్లంఘించింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో నడిచే గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ అదానీకి రూ.70 కోట్లకు పైగా అక్రమ మార్గంలో లబ్ధి చేకూర్చిందని అప్పుడు కాగ్ తప్పుబట్టింది కూడా.
ముంద్రా ఉత్తర భాగం ప్రాజెక్టులో, ఎస్‌ఇజడ్ లో అక్రమంగా చిట్టడవుల భూములను ఆక్రమించుకున్నందుకు, పర్యావరణాన్ని, స్థానిక జీవ వైవిధ్యాన్ని నాశనం చేసినందుకు అదానీపై యుపిఎ ప్రభుత్వం రూ.200 కోట్ల అపరాధరుసుం విధించింది. కాని దానిని మోడీ నాయకత్వంలోని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. అదానీ ప్రయోజనాలకోసం పర్యావరణ ప్రయోజనాలను బలి చేయడానికి మోడీ ఏ మాత్రమూ వెనుకాడలేదు.
ఇక మోడీ త్వరలో ప్రధాని కానున్నాడన్న వాతావరణం ఏర్పడ్డాక అదానీ సంస్థల అభివృద్ధి తీరు పూర్తిగా వేరే స్థాయికి చేరుకుంది. మోడీని బిజెపి అధికారికంగా తన ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత 12 నెలల కాలంలో అదానీ సంస్థల షేర్ల మార్కెట్ విలువ 65 శాతం పెరిగింది. 2001 నాటికి రూ.3,741 కోట్లుగా ఉన్న అదానీ గ్రూపు సంస్థల టర్నోవర్ 2013-14 నాటికి రూ.75, 659 కోట్లకు పెరిగింది ( 24 రెట్లు).
సి.ఎం గా ఉన్న మోడీ ప్రధాని కానున్నాడన్న అంచనాకే అదానీ ఆస్తులు ఇంత భారీ స్థాయిలో పెరగడం అదానీ-మోడీ కూటమికి, వారి భజన బృందానికి అవసరమైనంత ఉత్సాహాన్ని కలిగించాయని వేరే చెప్పనవసరం లేదు.
/ముగింపు తదుపరి సంచికలో/
(స్వేచ్ఛానువాదం)
నీలోత్పల్ బసు