
కరోనా కష్టకాలంలో దేశంలో జరిగిన దోపిడిని ఆక్స్‌ఫామ్ తాజాగా ప్రకటించిన నివేదిక కళ్లకు కడుతోంది. ఆ సమయంలో దేశ ప్రజలను ఆదుకోవడానికి ఎంతో చేశామంటూ కేంద్ర ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారంలో వాస్తవం ఇసుమంత కూడా లేదని ఈ నివేదిక తేల్చివేసింది. ఆ సమయంలో కూడా కొద్దిమంది వద్ద సంపద పోగుపడటం ఏ మాత్రం తగ్గలేదు. ఆ కష్టకాలంలోనే కొత్తగా కొందరు శతకోటీశ్వరులు తయారయ్యారు. అదే సమయంలో పేదరికం మరింత తీవ్రంగా ముంచుకొచ్చింది. సామాన్యుల జీవనం దుర్భరం కాగా, మధ్య తరగతి లోని పలువురి జీవన ప్రమాణాలు పేదల స్థాయికి పడిపోయాయి. పేదల సంఖ్య పెరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఆర్థిక విధానాల కారణంగా దేశంలో అసమానతలు పెరగడం కొత్త కాదు. కానీ, ఏ మాత్రం ముందస్తు కసరత్తు లేకుండా అమలులోకి తీసుకువచ్చిన లాక్‌డౌన్ కారణంగా ఢిల్లీ నుండి గల్లీ వరకు దేశం మొత్తం స్తంభించి, ఉత్పత్తి కార్యక్రమాలు నిలిచిపోయిన తరువాత కూడా కొందరి సంపద పెరగడానికి, శత కోటీశ్వరుల జాబితా మరింత పెద్దది కావడానికి కారణం ఏమిటి? ఆ సమయంలోనే సామాన్యుల బతుకులు అల్లకల్లోలం కావడానికి కారణం ఏమిటి? ఇంకా వెంటాడుతున్న ఆ భయోత్పాతపు ప్రకంపనల నుండి మాములు ప్రజలకు విముక్తి ఎప్పుడు? జవాబు చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.
కరోనా వైరస్ పేదల ఆరోగ్యాన్నే కాదు. వారి కష్టార్జితాన్ని కూడా పీల్చి పిప్పి చేసింది. ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం కరోనా విరుచుకుపడిన తొలి ఏడాది 2020లో అట్టడుగున ఉన్న ప్రజానీకంలో 50 శాతం మంది సంపద ఆవిరైపోయింది. జాతీయ ఆదాయంలో 13 శాతానికి, దేశ సంపదలో 3 శాతానికి వారి వాటా పడిపోయింది. 2020-2022 మధ్యకాలంలో శతకోటీశ్వరుల సంఖ్య గతంతో పోలిస్తే పెరిగింది. 2020లో 102గా ఉన్న వీరి సంఖ్య 2022 సంవత్సరానికి 166కు చేరింది. కరోనా రక్కసి దేశంలో కొత్తగా 64 మంది శతకోటీశ్వరులను తయారు చేసిందన్న మాట! జనాభాలో 30 శాతం మంది వద్ద 90 శాతం సంపద పోగుపడింది. దీనికి అదనంగా పైనున్న పదిశాతం మంది వద్ద 72 శాతం, ఐదు శాతం మంది వద్ద 62 శాతం సంపద పోగుపడిందని, ఇది కరోనా ముందు సంవత్సరాలతో పోలిస్తే చాలా ఎక్కువని ఆక్స్‌ఫామ్ పేర్కొంది. దేశంలో అత్యధిక ప్రజానీకం పూట గడవడమే కష్టంగా రోజులు గడిపిన సమయంలో కొద్ది మంది సంపద ఎలా పెరిగింది? అలా చేరిన సంపద ఎవరి కష్టార్జితం? అదానీ, అంబానీ వంటి వేళ్ల మీద లెక్కపెట్టదగిన వారి దగ్గరకే ఎలా ఎగిరిపోయింది ?
కరోనా విజృంభణకు ముందు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్‌ను 30 నుండి 22 శాతానికి తగ్గించింది. ఫలితంగా 1.84 లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఖజానాకు తగ్గింది. దీనిని పూడ్చుకోవడానికి దేశ ప్రజలందరి మీద భారం పడేలా పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ, జిఎస్‌టిలను భారీగా పెంచింది. కరోనా విజృంభణ తరువాత కూడా సామాన్యులపై మోపిన భారాన్ని తగ్గించడానికి నిరాకరించిన కేంద్రం, అదే సమయంలో వైరస్‌ను సాకుగా చూపి కార్పొరేట్లకు భారీ ప్యాకేజిలను ప్రకటించింది. ఆ సమయంలో వ్యక్తమైన విమర్శలను కూడా మోడీ సర్కారు పట్టించుకోలేదు. పైగా తమ విధానమే సరైనదని, కార్పొరేట్లకు ఇచ్చిన ప్యాకేజితో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వాదించింది. ఆచరణలో కేంద్రం చేసిన వాదన అర్ధరహితమని తేలిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుండి భారీ మొత్తాన్ని అందుకున్న కార్పొరేట్ సంస్థలు ఆర్థిక సంక్షోభాన్ని సాకుగా చూపి ప్రస్తుతం ఉన్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా కుదిస్తున్నారు. రానున్న రోజుల్లో కొత్త రిక్రూట్‌మెంట్లు లేకపోగా, అనేక రంగాల్లో ఉన్న ఉద్యోగులను కూడా తొలగించే అవకాశం ఉందన్న సంకేతాలు వస్తున్నాయి. అదే జరిగితే పరిస్థితి మరింత ఘోరంగా మారుతుంది. కరోనా సమయంలో పెరిగిన అంతరాలను కళ్లకు కట్టిన ఆక్స్‌ఫామ్ నివేదిక సంపద పన్ను వేయాలని గట్టిగా ప్రతిపాదించింది. ఐదు సంవత్సరాల గరిష్ట కాల పరిమితితో ఒకటి, లేదా రెండు శాతం పన్ను విధిస్తే జరిగే అద్భుతాలను సోదాహరణంగా వివరించింది. ప్రజానీకం పెద్ద ఎత్తున కదిలి, ఒత్తిడి తెచ్చి, కేంద్రం మెడలు వంచితే కొంతమేరకైనా ఊరట లభించే అవకాశం ఉంది. ఆ దిశలో ప్రజలను చైతన్యపర్చడానికి అభ్యుదయ శక్తులు కదలాలి.