Jul 01,2023 06:50

  • నేడు కా|| కొరటాల సత్యనారాయణ వర్థంతి


ప్రజాశక్తి పదకొండు ఎడిషన్లతో ఆనాడు రాష్ట్రమంతటా విస్తరించిందంటే అందులో కొరటాల కృషి ఎంతో ఉంది. 'గొలుసు కట్టు వ్యాపార సంస్థల కబంధ హస్తాల నుంచి మీడియా విముక్తి కావాలని, లేకుంటే పత్రికా రంగం మనుగడే ప్రమాదంలో పడుతుందని' పత్రికా రంగ పితామహుడిగా పేరొందిన ఎం చలపతిరావు మాటలను ఆయన సదా గుర్తు చేస్తుండేవారు. ఈ చరాచర జగత్తులో మార్పు ఒక్కటే శాశ్వతమైనది. దానిని నువ్వు అవకాశంగా పరిగణిస్తావో, ముప్పుగా భావిస్తావో అది నీ ఆలోచనను బట్టి ఉంటుంది. కానీ, ఈ పోటీ ప్రపంచంలో నువ్వు నెగ్గుకు రావాలంటే ఆ వేగాన్ని, పోటీని తట్టుకునే శక్తిసామర్థ్యాలను సంతరించుకోవాలి అన్న నానుడిని ఆచరణలో చూపించిన కమ్యూనిస్టు యోధుడు కొరటాల.

         బాల్యంలో స్వాతంత్య్రోద్యమం, యవ్వనంలో కమ్యూనిస్టు ఉద్యమంలో క్రియా శీలంగా పాల్గొంటూ రాటుదేలిన యోధుడు కొరటాల సత్యనారాయణ. కొరటాల అని అందరూ ఆప్యాయంగా పిలుచుకునే ఆయన భౌతికంగా మనల్ని వీడి నేటికి పదిహేడు సంవత్సరాలైంది. స్వాతంత్య్ర సమర యోధుడు, రాష్ట్రంలో మలి తరం కమ్యూనిస్టు నేతల్లో ఒకరు అయిన కొరటాల తెలుగునాట ప్రత్యామ్నాయ మీడియా కేంద్రంగా ప్రజాశక్తి అభివృద్ధిలోనూ చురుకైన పాత్ర పోషించారు. నేడు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన అందించిన వారసత్వం ఉంది. 1923 సెప్టెంబరు 21న గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ప్యాపర్రు గ్రామంలో బుచ్చయ్య, శేషమ్మ దంపతులకు కొరటాల జన్మించారు. తురిమెళ్ల హైస్కూలులో చదువుతున్న కాలంలోనే ఆయనలో ఒక తిరుగుబాటుదారుడు మనకు అగుపిస్తాడు. ఎస్‌ఎస్‌ఎల్‌సి పరీక్షల్లో డిటెన్షన్‌ విధానానికి వ్యతిరేకంగా తురిమెళ్ల హైస్కూలులో 11 రోజుల సమ్మెకు నాయకత్వం వహించారు. 1942లో గుంటూరు ఎ.సి కాలేజీలో ఇంటర్మీడియెట్‌ కోర్సులో చేరారు. ఇంటర్‌ రెండవ సంవత్సరం మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మాకినేని బసవ పున్నయ్య, మోటూరు హనుమంతరావు, లావు బాలగంగాధర రావులతో పరిచయా లేర్పరచుకుని మార్క్సిజం, లెనినిజం విప్లవ పంథాలో పయనించారు. 1942 సెప్టెంబరులో కమ్యూనిస్టు పార్టీ సభ్యునిగా చేరారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుని స్థాయికి చేరుకున్నారు. 1945లో మేనకోడలు సుశీలను వివాహమాడారు. 1962 అసెంబ్లీ ఎన్నికలో వేమూరు నుంచి మొదటిసారి గెలిచారు. రెండోసారి 1978లో రేపల్లె నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 1952లో జరిగిన పార్లమెంటు ఎన్నికల నాటికి పిన్న వయస్కుడే అయినా ఉద్యమాల్లో రాటుదేలిన అనుభవంతో తెనాలి లోక్‌సభ స్థానానికి పోటీచేసి కేవలం 1,100 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1991-97 మధ్య సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా, 2002 నుంచి 2005 వరకు పొలిట్‌బ్యూరో సభ్యునిగా బాధ్యతలు నిర్వహించారు. చైనా, బల్గేరియాలలో పర్యటించారు. సీనియర్‌ నాయకుడిగా ఉన్నప్పటికీ ప్రజలతో అత్యంత సన్నిహిత సంబంధాలను కలిగి ఉండేవారు. వృద్ధాప్యంలో ఉన్నా కొత్తగా పార్టీలోకి వచ్చే యువ కార్యకర్తలు, నాయకులతో చక్కగా కలిసి పోయేవారు. 'ఏరా బాబూ' అనే ఆయన పిలుపులో ఆత్మీయత ఉట్టిపడేది. త్యాగ నిరతికి, మానవతా విలువలకు ఆయన ప్రతీక. అందుకే పార్టీ కార్యకర్తలు ఆయన వద్దకు వెళ్లి తమ సమస్యలను నివేదించేవారు. ఆయన కూడా వారిని చొరవతో అక్కున చేర్చుకునేవారు. ఆయన దగ్గర తరాల అంతరాలు ఎప్పుడూ కనిపించేవి కావు. ఆ విధంగా ఆయన రెండు తరాలకు వారథిగా నిలిచారు.
               సమస్యను అధ్యయనం చేసి, దానిపై ప్రజలను చైతన్య పరచి పోరాటాల్లోకి సమీకరించడం కొరటాలకు వెన్నతో పెట్టిన విద్య. 1946-48 మధ్య గుంటూరు జిల్లాలో బహుముఖ ఉద్యమాలను నిర్వహించారు. అందులో ముఖ్యమైనవి రొంపేరు బంజరు పోరాటం, లంక భూముల వేలం, బంజర్ల నుంచి పేదల తొలగింపు వ్యతిరేక పోరాటం వంటివి ఉన్నాయి. వ్యవసాయ కార్మికుల వేతనాల కోసం సమ్మెలు, రజకుల మేరల పెంపు, పాలేర్ల జీతాల కోసం పోరాటాలు నడిపారు. సమాజానికి శాపంగా మారిన కుల వివక్షపై పిడికిలి బిగించారు. శాసనసభ్యునిగా ఉండగా భూమిశిస్తు, భూ సంస్కరణలు, నీటి వనరుల పంపిణీ, చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. విద్యార్థి, రైతు, వ్యవసాయ కార్మిక, చేనేత కార్మిక సంఘాల్లో కార్యకర్తగా, నాయకునిగా తనకున్న అపార అనుభవంతో అసెంబ్లీలో ఏ సమస్యపైన అయినా లోతుగా విశ్లేషించి మాట్లాడేవారు. సూటిగా, పదునైన విమర్శలు చేసేవారు. ఆ సమస్యకు నిర్దిష్ట పరిష్కారాలను సూచించేవారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఆయనకు మంచి పట్టు ఉండేది. గుంటూరు జిల్లా కాజ గ్రామంలో సుందరయ్యగారు నిర్వహించిన 'గ్రామీణ పేదలు-భూ పంపకం' సర్వేలో కొరటాల స్వయంగా పాల్గొన్నారు. గ్రామీణ పేదల పరిస్థితిని అధ్యయనం చేసి పత్రికలో పలు విశ్లేషణాత్మక వ్యాసాలు రాశారు. 1982లో గుంటూరు జిల్లాలో పత్తి రైతుల ఆత్మహత్యలు ప్రారంభమైనప్పుడు ఆ సమస్య తీవ్రతపై మొట్టమొదట స్పందించింది ఆయనే. రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడంతో 13 సంఘాలతో కలిపి అఖిలపక్ష సమావేశం జరిపి కార్యాచరణకు పూనుకున్నారు. ఈ ఆత్మహత్యలకు దారితీసిన పరిస్థితులను అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని వేయాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో ఆయనే చొరవ తీసుకుని పిఎ చౌదరి కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఆ కమిషన్‌ చేసిన నిర్ధారణలు, సిఫారసులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిలదీశారు. పొగాకు, మిర్చి, వరి, తదితర పంటలకు గిట్టుబాటు ధర కోసం రైతు సంఘం ఆధ్వర్యాన రాజీ లేని పోరాటం సాగించారు. ఆ విధంగా ప్రతి క్షణం పార్టీ గురించి, ప్రజల గురించే ఆయన తపన పడేవారు. జీవిత చరమాంకంలో తన వద్ద మిగిలిన ఆస్తిని కూడా పార్టీకి ఇచ్చేశారు.
 

                                                                       ప్రజాశక్తి అభివృద్ధికి విశేష కృషి

మోటూరు హనుమంతరావు అనారోగ్యం పాలైన నేపథ్యంలో అనుకోకుండా ప్రజాశక్తి సాహితీ సంస్థ ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ప్రజాశక్తిని అభివృద్ధి చేయడంలో ఆయన అందించిన తోడ్పాటు మరువలేనిది. నిత్యం పత్రికలను చదివే అలవాటు ఉన్న కొరటాల తన అనుభవాన్ని ఉపయోగించి ప్రతి అక్షరం ప్రజల పక్షం వహించేలా ప్రజాశక్తిని తీర్చిదిద్దాలని తపించారు. సరళీకరణ విధానాల నేపథ్యంలో కార్పొరేట్‌, విదేశీ కంపెనీలు మన మీడియాను కబళిస్తున్న స్థితిలో ప్రత్యామ్నాయ మీడియా బలపడాల్సిన అవసరాన్ని ఆయన ఎప్పుడూ నొక్కి చెబుతుండేవారు. ప్రజాశక్తి పత్రికలో శీర్షికలు, వార్తలు, వ్యాసాలు, సంపాదకీయాలు, ఫీచర్స్‌ అన్నిటినీ క్షుణ్ణంగా చదివి అందులోని మంచి చెడులను ఎప్పటికప్పుడు సంబంధిత బాధ్యుల దృష్టికి తెచ్చేవారు. ఎడిషన్ల స్థాపనలో, విస్తరణలో, జిల్లా టాబ్లాయిడ్‌లను మరింత మెరుగుపరచే విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆయన దీర్ఘకాలం ఆసుపత్రిలో ఉండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వైద్యులు విశ్రాంతి తీసుకోమని ఇచ్చిన సలహాను లెక్కచేయకుండా ప్రజాశక్తి మేనేజర్ల సమావేశంలో రోజంతా పాల్గొన్నారు. ప్రజాశక్తి సాహితీ సంస్థ ఛైర్మన్‌గా పెద్దరికంతో కాకుండా ప్రత్యక్షంగా పత్రిక అభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషిచేశారు. ప్రజాశక్తి పదకొండు ఎడిషన్లతో ఆనాడు రాష్ట్రమంతటా విస్తరించిందంటే అందులో కొరటాల కృషి ఎంతో ఉంది. 'గొలుసు కట్టు వ్యాపార సంస్థల కబంధ హస్తాల నుంచి మీడియా విముక్తి కావాలని, లేకుంటే పత్రికా రంగం మనుగడే ప్రమాదంలో పడుతుందని' పత్రికా రంగ పితామహుడిగా పేరొందిన ఎం చలపతిరావు మాటలను ఆయన సదా గుర్తు చేస్తుండేవారు. శోధన, పరిశోధన అంటే ఆయనకు ఎనలేని మక్కువ. ఆయన అభిరుచికి తగినట్టుగానే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కొరటాల పేరుతో 'శోధన' విభాగాన్ని ఆయన కుటుంబ సభ్యుల సహకారంతో నెలకొల్పడం జరిగింది. ఈ చరాచర జగత్తులో మార్పు ఒక్కటే శాశ్వతమైనది. దానిని నువ్వు అవకాశంగా పరిగణిస్తావో, ముప్పుగా భావిస్తావో అది నీ ఆలోచనను బట్టి ఉంటుంది. కానీ, ఈ పోటీ ప్రపంచంలో నువ్వు నెగ్గుకు రావాలంటే ఆ వేగాన్ని, పోటీని తట్టుకునే శక్తిసామర్థ్యాలను సంతరించుకోవాలి అన్న నానుడిని ఆచరణలో చూపించిన కమ్యూనిస్టు యోధుడు కొరటాల.
 

/వ్యాసకర్త ఎ.పి రైతుసంఘం అధ్యక్షులు,
సెల్‌ : 9090499000 /

వి. కృష్ణయ్య