May 05,2023 07:36

  • నేడు మార్క్స్‌ 205వ జయంతి

        ప్రపంచ ఆర్థిక మాంద్యం అన్ని దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ మాంద్యం మరింత తీవ్రమై ఈ అక్టోబర్‌ నాటికి ప్రపంచ ఆర్థిక సంక్షోభంగా మారుతుందని అనేక మంది ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 'ప్రపంచ దేశాలు ఈ ఆర్థిక మందగమనాన్ని తప్పించుకోలేవు' అని స్వయంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్‌ మల్పాస్‌ వాఖ్యానించాల్సి వచ్చింది. 80 సంవత్సరాల తర్వాత ఒకే దశాబ్దంలో రెండు ప్రపంచ మాంద్యాలు సంభవించడం ఇదే ప్రథమం అవుతుంది. మూడు దశాబ్దాల కాలంలో ప్రపంచ ఆర్థికాభివృద్ధి మూడోసారి అత్యంత అథమ స్థాయికి పడిపోయిందని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. 107 దేశాల్లో 69 దేశాలు ఆహారం, ఇంధన ధరలు, ఆర్థిక కష్టాలను తీవ్రంగా ఎదుర్కొంటాయని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఉద్యోగులు తొలగించబడుతున్నారు. చిన్న, మధ్యతరహా కంపెనీలు మూతపడుతున్నాయి. ఇంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ప్రపంచం ఎందుకు పదేపదే ఎదుర్కొంటున్నది? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే...సంక్షోభాలకు కారల్‌ మార్క్స్‌ చెప్పిన కారణాలను పరిశీలించాల్సిందే.
       కారల్‌ మార్క్స్‌ జర్మనీ లోని ట్రియర్‌లో 1818 మే 5న జన్మించాడు. మార్క్స్‌ యుక్తవయసుకు వచ్చే నాటికి యూరప్‌లో పారిశ్రామిక విప్లవం ద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థ ఖండఖండాంతరాలకు విస్తరిస్తున్నది. రాజరిక పాలన స్థానంలో బూర్జువా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్నది. ఆయన ఈ దశలో నాటి సామాజిక, రాజకీయ, ఆర్థిక విషయాలను పరిశీలించనారంభించాడు. విద్యార్థిగా, న్యాయవాదిగా, జర్నలిస్టుగా, తత్వవేత్తగా, ఆర్థికవేత్తగా, చరిత్రకారుడిగా అన్నిటినీ మించి మహా మనిషిగా, విశ్వనరుడిగా మానవ సమాజ పురోగతికి అనన్య సామాన్యమైన కృషి చేశాడు కారల్‌ మార్క్స్‌. పెట్టుబడిదారీ వ్యవస్థ దఘదఘ వెలుగుల ముందు అందరూ సాగిలపడుతుంటే...మార్క్స్‌ మాత్రం పెట్టుబడి పొట్ట విప్పి అందులోని కుళ్ళును, దోచుకున్న రక్తమాంసాలను, దోపిడి విధానాన్ని, అమానవీయతను, దాన్ని అంతం చేయాల్సిన అవసరాన్ని కార్మిక జనానికి చెప్పేందుకు తన యావజ్జీవితాన్ని త్యాగం చేశాడు. పెట్టుబడిదారీ వ్యవస్థలో అనివార్యంగా వచ్చే ఆర్థిక సంక్షోభాల మూలాలను, వాటిని పరిష్కరించే విధానాన్ని అత్యంత శాస్త్రీయంగా వివరించాడు. నేడు మార్క్స్‌ 205వ జయంతి. ప్రపంచమంతా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నది. అనేకమంది సంక్షోభాన్ని దాని ప్రభావాలను విశ్లేషిస్తున్నారు. మార్క్స్‌ చెప్పినట్లు 'అనేకమంది తత్వవేత్తలు ప్రపంచాన్ని పలు రకాలుగా విశ్లేషించారు, ఇప్పుడు ఆ ప్రపంచాన్ని మార్చాలి, అందుకు ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్ళు తప్ప'.
ప్రస్తుత సంక్షోభం తీవ్రత
        2022 ప్రారంభంలో ప్రపంచ ఆర్థిక పురోగతి రేటు 6.1 శాతం ఉంటుంద్న అంచనా, అదే సంవత్సరం జూన్‌ నాటికి 3.0 శాతం, ఇప్పుడు 1.7 శాతానికి మించదని చెబుతున్నారు. ఐఎంఎఫ్‌ ప్రకటించిన '2023 నవంబర్‌ ప్రపంచ ఆర్థిక దృష్టి' ప్రకారం 2023లో 3.4 శాతం నుండి 2.8 శాతానికి పడిపోయిందంటూనే 2024 నాటికి 3 శాతం వుంటుందని తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వృద్ధి నేలకు అతుక్కుపోతున్నట్లుగా 2023లో 2.7 శాతం నుండి 1.3 శాతానికి పడిపోయింది. అమెరికా 0.2, బ్రిటన్‌ 0.3, ఫ్రాన్స్‌ 0.7 శాతానికి పరిమితం కావచ్చని, ఐరోపా యూనియన్‌ వృద్ధి ఈ సంవత్సరం 0 శాతంగా ఉంటుందని అంచనా. వర్థమాన దేశాలన్నింటి వృద్ధి 2022లో 3.8 శాతం ఉండగా, 2023లో 2.7 శాతం వుంటుందని అంచనా.
     ఈ కాలంలో అమెరికా లోని ముఖ్యమైన రెండు పెద్ద బ్యాంకులు సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌, సిగేచర్‌ బ్యాంక్‌ కుప్పకూలాయి. ప్రఖ్యాత క్రెడిట్‌ సూయిస్‌ కూడా దాని ఈక్విటీ ధరల పతనాన్ని ఎదుర్కొంటున్నది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నివారించేందుకోసమని ఫెడరల్‌ రిజర్వు బ్యాంకు వడ్డీరేట్లను భారీగా పెంచింది. 2022 ఫిబ్రవరి నాటికి అమెరికా వడ్డీరేటు 0.25 వుండగా, 2023 ఫిబ్రవరి నాటికి 4.75 శాతానికి పెరచింది. ఫెడరల్‌ బ్యాంకు వడ్డీరేట్ల పెంపుతో 90 దేశాల కరెన్సీ విలువలు పతనమయ్యాయి.
       మన దేశంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అబద్ధాలనే పునాదిగా కలిగి వుంది. ఆర్థిక విషయాల్లో కూడా అబద్ధాల అంకెలనే ప్రచారం చేసుకుంటున్నది. ప్రపంచంలో ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా బాకా ఊదుకుంటున్నప్పటికి వాస్తవంగా సగటు తలసరి ఆదాయంలో అంగోలా, ఐవరి కోస్ట్‌ దేశాల కంటే వెనుక వున్నాం.
 

                                                                    నిరుద్యోగం- అసమానతలు

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) 2023 జనవరి 14న ప్రకటించిన 'ప్రపంచ ఉపాధి, సామాజిక అంచనాల' నివేదిక ప్రకారం ఈ సంవత్సరం 5.2 కోట్ల పూర్తికాలం ఉద్యోగాలకు సమానమైన పని గంటలు తగ్గిపోతాయని పేర్కొంది. సర్వీసు రంగం ముఖ్యంగా ఐటి రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగుల వేతనాల కుదింపు, తొలగింపు, కొత్త ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌ నిలిపివేత జరుగుతున్నాయి. గత 60 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా ఆహార ధరలు 2022లో పెరిగినట్లు ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (డబ్ల్యుఎఫ్‌ఎఒ) తెలిపింది. పొరుగున వున్న పాకిస్తాన్‌లో ఈ సంవత్సరం 40 శాతానికి పైగా ద్రవ్యోల్బణం పెరిగింది. ఒకవైపు పెరిగిన ద్రవ్యోల్బణం వల్ల కార్మికుల నిజ వేతనాలు ప్రపంచంలో 33,700 కోట్ల డాలర్ల మేర తగ్గిపోయాయి. మరోవైపు 2020 తరువాత 42 లక్షల కోట్ల డాలర్ల కొత్త సంపద సృష్టించబడితే దానిలో మూడొంతులు పై స్థాయిలోని ఒక్క శాతం ధనికుల జేబుల్లోకి వెళ్లింది. ప్రపంచ శత కోటీశ్వరుల సంపద సగటున ప్రతి రోజు 270 కోట్ల డాలర్ల చొప్పున పెరిగిపోయింది.
 

                                                                      ఆర్థిక సంక్షోభం అంటే ?

సులభంగా చెప్పాలంటే వరుసగా రెండు త్రైమాసికాలు (ఆరు నెలలు) గనుక స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధి రేటు తిరోగమనంలో సాగితే ఆ దేశం మాంద్యంలోకి వెళ్లినట్లు పరిగణిస్తారు. మాంద్యం పెరిగి ఆర్థిక పునరుత్పత్తిలో తీవ్రమైన నిలుపుదల ఏర్పడితే ఆర్థిక సంక్షోభం అంటారు. ఇటీవల పత్రికల్లో, టీవీల్లో వస్తున్న ధరల పెరుగుదల, పరిశ్రమల మూత, వేల సంఖ్యలో ఐ.టి ఉద్యోగుల తొలగింపు, పెరుగుతున్న నిరుద్యోగం, పేదరికం వార్తలు, విశ్లేషణలు ఇంతవరకు ప్రపంచీకరణ అందమైనదని, అద్భుతమైనదని, సమాజ పురోగమనంలో ఇదే చివరిదనీ ఊదరగొట్టిన దానికి భిన్నంగా 'అందమైన లోకమని రంగురంగు లుంటాయని... అందరూ అంటుంటారు...అది అంత అందమైనది కానే కాదు చెల్లెమ్మా' అన్నట్లుగా తయారైంది. 185 సంవత్సరాల క్రితం మార్క్స్‌ చెప్పినట్లు 'పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పత్తి సామాజికం, యాజమాన్యం వ్యక్తిగతం'. ఇదే ఈ వ్యవస్థలోని సర్వ సమస్యలకు మూలం. సమిష్టి కృషి వల్ల సృష్టించబడిన విజ్ఞానం, పరికరాలు, ప్రకృతి వనరుల మీద కొందరు ధరాధిపతులై, చివరకు శ్రమను కూడా సరుకుగా మార్చేశారు.
 

                                                                ఆర్థిక సంక్షోభాలు ఎందుకు వస్తాయి ?

పెట్టుబడిదారీ వ్యవస్థ ఉత్పత్తి, పంపిణీ, వినిమయం గురించి విశ్లేషించే క్రమంలో కారల్‌ మార్క్స్‌ మాంద్యం గురించి సూత్రీకరించాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ జీవకణం సరుకుల ఉత్పత్తి. ఉపయోగపు విలువ (మనిషి ఏదో ఒక అవసరాన్ని తీర్చే గుణం)తో పాటు, మారకపు విలువ వుండేదే అమ్మబడుతుంది, కొనబడుతుంది. సరుకుకు మారకపు విలువ ఆ సరుకులో వున్న శ్రమ నుండే వస్తుంది. అందుకే సరుకులు అమ్మబడడం లేదా కొనబడడం జరుగుతుందంటే ఆ సరుకులోని శ్రమ అమ్మబడుతుంది లేదా కొనబడుతుంది అని అర్థం. సమస్త సరుకులు శ్రమ జనితాలే. సరుకు అమ్మడంలో వచ్చే లాభాలే పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రాణం. లాభం కోసమే ఉత్పత్తి, లాభం కోసమే అమ్మకం. లాభం లేకపోతే ఎలా మరీ. అని అమాయకంగా ఈ వ్యవస్థను బలపరచే వారు అంటారు. నిజమే కాని...ఆ లాభం ఎక్కడిదో చెప్పమంటాడు మార్క్స్‌. వారు నిజం చెప్పరు, చెప్పలేరు. ఒకవేళ చెబితే డిమాండ్‌, సప్లరు అనో, తక్కువ కొని ఎక్కువకు అమ్మడమనో, ముందే ధర నిర్ణయించుకోవడమనో కాకమ్మ కథలు చెబుతారు.
        లాభం ఎక్కడి నుండి ఎలా వస్తుంది, అది ఎలా పెరుగుతుంది, చివరకు ఆ లాభమే ఈ వ్యవస్థ పతనానికి ఎలా కారణమవుతుందో మార్క్స్‌ కులంకుషంగా వివరించాడు. లాభం ఉత్పత్తి క్రమంలో ఏర్పడి, మర్కెట్‌లో చేతికి వస్తుందన్నాడు. పెట్టుబడిదారుడు మార్కెట్‌లో భూమి, యంత్రాలు, ముడి పదార్థాలను కొంటాడు. వాటి నిజమైన ధరకే మరో పెట్టుబడిదారుడు ఉత్పత్తి చేసే పెట్టుబడిదారునికి అమ్ముతాడు. వీటితోపాటు మార్కెట్‌లో మరో ప్రత్యేక లక్షణమున్న సరుకును కొంటాడు. అదే శ్రమ. వ్యవస్థ సృష్టించిన లేబర్‌ మార్కెట్‌ లోని రిజర్వు సైన్యం నుండి వీలైనంత చౌకగా ఈ శ్రమ అనే సరుకును కొంటాడు. కార్మికులకు ఇచ్చే వేతనాల కంటే అదనంగా పని చేయించుకోవడం ద్వారా అదనపు విలువ లేదా లాభం పొందుతాడు.
        లాభం మరింతగా పెంచుకోవడం కోసం అధునాతన యంత్రాలను ఫ్యాక్టరీలో ప్రవేశపెట్టి, కార్మికుల పని వేగం పెంచి తక్కువ మంది కార్మికులతో ఎక్కువ ఉత్పత్తి, ఎక్కువ లాభాన్ని పొందుతాడు. పని గంటలను పెంచడం, కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌, పీస్‌ రేటు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇలా అనేక రకాల మార్గాల ద్వారా అధికోత్పత్తిని పెంచుతారు. దీనివల్ల కార్మికుల తొలగింపు, చిన్న పరిశ్రమల మూత పెరుగుతాయి. అప్పటికే వున్న నిరుద్యోగులకు ఉపాధి కోల్పోయిన వారు తోడవుతారు. వీరందరి కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. మిగిలిన ఆ కొద్దిపాటి కొనుగోలు శక్తిని తామే ఆక్రమించుకుని, తమ సరుకులు మాత్రమే అమ్ముకునేందుకు దేశీయ, విదేశీ పెద్ద పెట్టుబడిదారులు తమలో తాము పోటీ పడి వినియోగదారులను ఆకర్షిస్తారు. ఈ పోటీకి నిలబడలేని మధ్యతరహా కంపెనీలు మరింతగా మూతపడడం లేదా విలీనం చేయడం జరుగుతుంది. అదనపు నిరుద్యోగులు మరింతగా పెరిగి వారి కొనుగోలు శక్తి మరింతగా క్షీణిస్తుంది. ఇది సంక్షోభాన్ని తీవ్రం చేస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆర్థికాభివృద్ధి రంగం మందగించడమే కాదు, సరుకుల ఉత్పత్తే సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తన గొయ్యిని తానే తవ్వుకుంటాడు. ఆ గోతిలో (తనే సృష్టించుకున్న కార్మిక వర్గ పోరాటాల్లో) ఈ వ్యవస్థ అంతం అవుతుందన్నాడు మార్క్స్‌.
        ప్రపంచీకరణ విధానాల వల్ల సంక్షోభం కూడా ప్రపంచ వ్యాప్తమైంది. సంక్షోభానికి శాశ్వత పరిష్కారం పెట్టుబడిదారీ వ్యవస్థ స్థానంలో సోషలిస్టు వ్యవస్థను నిర్మించడం. అందుకోసం కారల్‌ మార్క్స్‌ రచనలను విస్తృతంగా అధ్యయనం చేయాలి, నూతన సమాజ నిర్మాణానికి ఆచరణలో కృషి చేయాలి.
 

/వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు/

వి. రాంభూపాల్‌