
ప్రజాశక్తి-విజయనగరం : విజయనగరం పట్టణ యువత, శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులతో విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు సోమవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ ఆర్.గోవిందరావు మాట్లాడుతూ.. పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం, సిరిమాను తరలింపులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసుశాఖకు సహకరించాలని కోరారు. సిరిమాను తరలింపు సకాలంలో జరిగితే, సిరిమాను ఊరేగింపు నిర్దిష్ట సమయంలోగా పూర్తవుతుందన్నారు. కావున, కమిటీ సభ్యులు, యువత సకాలంలో సిరిమాను తరలింపుకు సహకరించి, వివిధ ప్రాంతాల నుండి పండగను వీక్షించేందుకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. పోలీసులు, కమిటీ సభ్యులు సమన్వయంతో పని చేస్తే, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టవచ్చునన్నారు. సిరిమానోత్సవం రోజున భక్తులు సిరిమాను తరలింపుకు ముందే పూజలు పూర్తి చేసుకొనే విధంగా చూడాలని కమిటీ సభ్యులకు డిఎస్పీ ఆర్.గోవిందరావు సూచించారు. ఈ సమావేశంలో 2వ పట్టణ సిఐ విజయ ఆనంద్, 2వ పట్టణ ఎస్‌ఐ షేక్ శంకర్, ప్రధాన పూజారి వెంకటరావు, హుకుంపేట పెద్దలు, యువత, అమ్మవారి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.