Dec 23,2022 07:49

              ప్రభుత్వ బడుల్లో డిజిటల్‌ విప్లవం తెస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన ట్యాబుల్లో లోడ్‌ చేసిన స్టడీ మెటీరియల్‌ నాణ్యత, వాటి కొనుగోలు వ్యవహారం, బైజూస్‌ కంపెనీ అనుసరించిన తప్పుడు పద్ధతులపై వస్తున్న మీడియా కథనాలు పలు సందేహాలకు తావిస్తున్నాయి. పిల్లలు, వారి తల్లిదండ్రుల ఫోన్‌ నెంబర్లను అక్రమంగా కొనుగోలు చేసి, తల్లిదండ్రులను బైజూస్‌ బెదిరిస్తోందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్‌సిపిసిఆర్‌) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 'తమ కోర్సులను కొనుగోలు చేయకపోతే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని బెదిరిస్తోందని' ఎన్‌సిపిసిఆర్‌ చీఫ్‌ ఓ వార్తా సంస్థకు వెల్లడించడమేగాక ఆ కంపెనీపై చర్యలను ప్రారంభిస్తామని చెప్పారు. ఈ విషయమై శుక్రవారం (డిసెంబర్‌ 23) నాడు తమ ముందు హాజరు కావాలని బైజూస్‌ సిఇఒ రవీంద్రన్‌కు నోటీసులు జారీ చేశారు. ఒత్తిడి చేసి కోర్సులను కొనుగోలు చేయించడం, నిబంధనలకు విరుద్ధంగా ఫోన్‌ నెంబర్లను సంపాదించడం లాంటి అతిక్రమణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. బైజూస్‌ సంస్థ రుణ ప్రాతిపదికన సైతం తల్లిదండ్రులతో ఒప్పందాలు చేసుకుంటోందని, ఎవరైనా తిరిగి తమ మొత్తాన్ని ఇవ్వాలని, ఈ ఒప్పందం నుంచి వెనక్కు వెళ్లిపోతామని కోరినా అంగీకరించకుండా వేధింపులకు గురిచేస్తోందని తెలిపారు. తాము దోపిడీకి గురయ్యామని, మోసపోయామని పలువురు తల్లిదండ్రులు కమిషన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఇటువంటి కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం విస్తుగొలుపుతోంది.
ప్రభుత్వ బడుల్లో డిజిటల్‌ విప్లవం తెస్తామని, వాటి ఫలితాలను రాష్ట్రంలోని పేద కుటుంబాలు వచ్చే పదేళ్లలో అనుభవిస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు, బోధిస్తున్న టీచర్లకు మొత్తంగా 5,18,740 ట్యాబుల పంపిణీకి బుధవారం ఆయన శ్రీకారం చుట్టారు. బైజూస్‌ ప్రీ లోడెడ్‌ కంటెంట్‌తో అందించనున్న ఈ ట్యాబుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,466 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. పిల్లలకు మరింత సులువుగా పాఠాలు అర్థమయ్యేందుకు వీలుగా ట్యాబులు అందిస్తున్నామని చెప్పారు. అసలు బైజూస్‌ కంటెంట్‌ వల్ల అటువంటి మహా ప్రయోజనం కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేక సిబిఎస్‌ఇ లేదా ఇంకేదైనా శాస్త్రీయ అధ్యయనం చేసే సంస్థగానీ నిర్ధారించిన దాఖలాల్లేవు. కంటెంట్‌ విషయంలో ఎవరితోనైనా సంప్రదించివుంటే ఆ విషయాన్నైనా బయటపెట్టాలి కానీ సర్కారు అదీ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వమే ఏకపక్షంగా బైజూస్‌ కంపెనీని ఎంపిక చేసుకొని, వందల కోట్ల రూపాయలు దానికి కుమ్మరించింది. ఈ నేపథ్యంలోనే దివాళా తీసిన సంస్థకు సిఎం మార్కెటింగ్‌ మేనేజర్‌లాగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ విద్యపై బైజూస్‌ పెత్తనాన్ని అంగీకరించడం ప్రమాదకరం.
             ట్యాబుల కొనుగోలు సందర్భంగా నిర్ణయించిన ప్రమాణాల విషయంలోనూ వస్తున్న ఆరోపణలతో కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలూ కొనుగోలు చేసే ట్యాబులకు ఎనిమిది అంగుళాల సైజుకు పైబడాలన్న నిబంధన అమలు చేస్తుండగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాన్ని 8.7 అంగుళాలుగా నిర్ణయించడం మూలంగా ఒక్క కంపెనీకి మాత్రమే అర్హత కలిగించిందన్న అంశం ఎవరినైనా ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. టెండర్‌ విషయంలో లెవెల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌ లేదని ఇతర కంపెనీలు లబోదిబోమంటున్నాయి. బైజూస్‌ కంపెనీ అనైతిక వ్యవహారాలు ప్రస్తుతం ఎన్‌సిపిసిఆర్‌ విచారణ పరిధికి వెళ్లాయి. ట్యాబుల్లో ప్రీలోడ్‌ చేసిన కంటెంట్‌ నాణ్యత ఎక్కడా నిగ్గు తేలలేదు. వాటితోబాటు ట్యాబుల కొనుగోలు విషయంలోనూ అనుమానాలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పథకం అమలు నిలుపుదల చేసి, ఈ మొత్తం వ్యవహారంపై నిష్పక్షపాతమైన స్వతంత్ర ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడం సబబుగా ఉంటుంది. పారదర్శకతను రుజువు చేసుకోవడం పాలకుల బాధ్యత కదా !