
దేశ చరిత్రలో పెద్ద నోట్ల రద్దు జనానికి ఒక పెద్ద పీడ కల, పాలకులకు ఘోర వైఫల్యం. ఆరు సంవత్సరాల తరువాత 'పెద్ద నోట్ల రద్దు లక్షా˜్యన్ని సాధించిందా?' అన్న అంశాన్ని విచారించేందుకు ఐదుగురు జడ్జీలతో కూడిన సుప్రీంకోర్డు డివిజన్ బెంచ్ అంగీకరించింది. తీర్పు తీరు తెన్నులు ఎలా ఉన్నప్పటికీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయ ఫలితాలు, పర్యవసానాల మంచి చెడ్డల గురించి జరిగే చర్చలో అనేక అంశాలు వెలుగులోకి వస్తాయి.
పెద్ద నోట్ల రద్దు ద్వారా నల్లధనాన్ని వెలికి తీస్తామని, ఉగ్రవాదులు, ఇతర విద్రోహ శక్తులకు నిధులు అందకుండా చూస్తామని, సమాంతర ఆర్థిక వ్యవస్థ అంతు చూస్తామని, తెరవెనుక లావాదేవీలను బహిర్గతపరుస్తామని ప్రధాని నరేంద్ర మోడీ 2016 నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటనలో చెప్పారు. లెక్కాపత్రం లేని ధనాన్ని పన్ను అధికారులకు వెల్లడించటం లేదా బ్యాంకుల్లో జమ మినహా మరొక మార్గం లేదన్న ఎందరో దాన్ని అవినీతి, నల్లధనంపై మెరుపు (సర్జికల్) దాడిగా పేర్కొన్నారు. ఆ తరువాత తెలంగాణలో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక, ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలో లెక్కా పత్రం లేని డబ్బు ప్రవాహాన్ని చూసిన తరువాత మోడీ అమాయకుడై అలా చెప్పారా లేక జనాలను వెంగళప్పలుగా భావించినట్లా? ఇటీవలనే పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థా చటర్జీ, అతని సన్నిహితురాలు అపర్ణా ముఖర్జీ ఇళ్లలో అధికారికంగా ప్రకటించిన రూ.49.80 కోట్ల నగదు కట్టలు, ఐదు కోట్ల విలువైన బంగారం వారి వద్దకు ఎలా చేరినట్లు? ఇది సముద్రంలో కాకి రెట్ట వంటిది. నిజానికి చిత్తశుద్ధితో దాడులు చేస్తే దేశంలో అలాంటివి ఇంకా ఎన్ని దొరికేదీ చెప్పాల్సిన పని లేదు.
పెద్ద నోట్ల రద్దు వలన సుమారు నాలుగున్నర లక్షల కోట్ల మేర నగదు చలామణి నుంచి అదృశ్యమౌతుందని ఎస్‌బిఐ ప్రధాన ఆర్ధిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ 2016 నవంబరు 14వ తేదీన బిజినెస్ స్టాండర్డ్ పత్రికలో రాసిన విశ్లేషణలో పేర్కొన్నారు (అంటే ఆమేరకు ప్రభుత్వానికి లబ్ధి చేకూరినట్లే). పోపుల డబ్బాల్లో దాచుకొని నోట్ల రద్దు తెలియని వారు, ఇతర కుటుంబ సభ్యులకు తెలపకుండా కొంత మొత్తాలను దాచుకొని అవి వెల్లడైతే కుటుంబంలో కలతల గురించి భయపడినవారు తప్ప...నల్ల ధనికులందరూ తమ సొమ్మును తెల్లగా మార్చుకున్నారని అధికారిక గణాంకాలే చెప్పాయి. ఆశించిన ఫలితాలు రాకపోవటంతో భంగపడిన అధికారపార్టీ పెద్దలు పెద్ద నోట్ల రద్దు వలన అసలెందుకు చేశారో చెప్పటం మానేసి దీని వలన డిజిటల్ చెల్లింపులు పెరిగాయి కదా అని వాదించారు. అది కూడా నిజం కాదు. కార్డుల ద్వారా చెల్లిస్తే రెండు శాతం అదనంగా వసూలు చేస్తుండటంతో జనాలు తిరిగి నగదుకే మొగ్గారు. అనేక దుకాణాల్లో యుపిఐ చెల్లింపులను అంగీకరించటం లేదు. కార్డులు లేదా యుపిఐ లావాదేవీలను పెంచేందుకు ప్రపంచంలో ఏ దేశంలో కూడా పెద్ద నోట్ల రద్దు అనే పిచ్చిపనులు చేయలేదు. కానీ కొందరు ఈ ఘనతను నరేంద్రమోడీకి ఆపాదించేందుకు మరో సాకు లేక పెద్ద నోట్ల రద్దుకు ముడిపెట్టారు.
పెద్ద నోట్ల రద్దు గురించి అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా 2017 ఫిబ్రవరి రెండున పార్లమెంటులో చేసిన ప్రసంగంలో చెప్పిందేమిటి? 2016 నవంబరు ఎనిమిది నుంచి డిసెంబరు 30 వరకు రెండు నుంచి 80 లక్షల వరకు డిపాజిట్లు చేసిన ఖాతాలు 1.09 కోట్లు కాగా ఒక్కొక్క ఖాతా సగటు మొత్తం రూ.5.03 లక్షలు, 80 లక్షలకు మించి దాఖలు చేసిన ఖాతాలు 1.48 లక్షలు, వీటి సగటు రూ.3.31 కోట్లు. వీటిని మరొక విధంగా చెప్పారు కొందరు. రూ.80 లక్షల లోపు డిపాజిట్లు చేసిన ఖాతాల్లో చేరిన మొత్తం రూ.5.48 లక్షల కోట్లు కాగా అంతకు మించి చేసిన ఖాతాల మొత్తం రూ.4.89 లక్షల కోట్లు. ఆర్‌బిఐ ప్రకటించిన దాని ప్రకారం 99 శాతం పైగా నగదు వెనక్కు వచ్చింది, రిజర్వుబ్యాంకు నివేదిక ప్రకారం 99.3 శాతం రద్దయిన నోట్లు వెనక్కు తిరిగి వచ్చాయి. 10,720 కోట్లు మాత్రమే వెనక్కు రాలేదని, మొత్తం నోట్లలో 0.0005 శాతం అంటే 5,22,783 మాత్రమే నకిలీ నోట్లను కనుగొన్నట్లు రిజర్వుబ్యాంకు వెల్లడించింది. రిజర్వుబ్యాంకు అధికారికంగా చెప్పినదాని ప్రకారమే వెనక్కు రాని నోట్ల కంటే కొత్త నోట్లు అచ్చేసి, పంపిణీ చేసేందుకు అయిన ఖర్చు ఎక్కువ. పదమూడు వేల కోట్ల రూపాయలని చెప్పింది. రద్దు చేసిన నోట్ల విలువ రూ.15.44 లక్షల కోట్లు. మూడో వంతు (31 శాతం) సొమ్ము రూ.4.89 లక్షల కోట్లు 80 లక్షలకు పైగా డిపాజిట్లు కేవలం 1.48 లక్షల మంది నుంచే వచ్చిందంటే నోట్ల రద్దు వలన లబ్ధి పొందింది నల్ల మహా ధనికులా మరొకరా ?
పెద్ద నోట్ల రద్దు తరువాత నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మారిందని చెప్పే పెద్దమనుషులతో, డిజిటల్ లావాదేవీలు పెరిగాయంటూ టీ స్టాల్, కూరల దుకాణాల ఉదాహరణలు చెప్పేవారితో నాకు పేచీ లేదు. అది వేరే సమస్య. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలకు అవినీతితో సంబంధం ఉంటుందని పెద్ద నోట్ల రద్దు ప్రసంగంలో నరేంద్ర మోడీ నే చెప్పారు. నోట్ల రద్దు జరిగి ఆరేళ్లు కావస్తోంది, నల్లధనం ఎలా జడలు విరుచుకొని తిరుగుతోందో రిజిస్ట్రారు కార్యాలయాలను సందర్శించిన వారికి తెలిసిందే.
పెద్ద నోట్ల రద్దుకు ముందు 2015-16లో నగదు చెలామణి జిడిపిలో 12.1 శాతం ఉంది. రద్దు తరువాత సంవత్సరం అది 8.7 శాతానికి తగ్గింది. నగదును తీసుకొనేందుకు బ్యాంకులు పడిన ఇబ్బంది గురించి వాటిలో పని చేసే వారికి తెలుసు. తరువాత అది ఇంతింతై వటుడింతై అన్నట్లుగా నరేంద్రమోడీ ఏలుబడిలో కొత్త రికార్డులను బద్దలు చేసింది. నగదు చెలామణి - అవినీతికి ఉన్న సంబంధం గురించి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లుగా వరదలపుడు గోదావరి నీటి మట్టం పెరిగే మాదిరి 2021-22లో 16.8 శాతానికి పెరిగింది. మోడినోమిక్స్ ప్రకారం ఉక్రెయిన్ సంక్షోభం లేకున్నా నగదు చెలామణితో ద్రవ్యోల్బణం, ధరలు పెరిగి ఉండేవి. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం చమురు మీద పన్నులు తగ్గించినపుడు బంకుల వద్ద పన్నుల గురించి బోర్డులు పెట్టాలని బిజెపి పెద్దలు చెప్పినట్లుగా ఇప్పుడు అవినీతి స్థాయి గురించి బోర్డులు పెడితే తప్ప జనానికి అర్ధం కాదు.
పెద్ద నోట్ల రద్దు వలన పన్నుల వసూలు పెరిగిందని చెప్పవచ్చు తప్ప దానికి ఆధారాలు చూపటం చాలా కష్టం. ఎందుకంటే అది జరిగిన కొద్ది నెలలకే 2017 జులైలో జిఎస్‌టి విధానాన్ని తీసుకు వచ్చారు.ఆ తరువాత కార్పొరేట్ పన్ను మొత్తాన్ని గణనీయంగా తగ్గించారు. అందువలన పన్ను లక్ష్యాలను ఏ మేరకు సాధించిందీ, దాన్ని పెద్ద నోట్ల రద్దుకు ముందు తరువాత చూడాలన్నది కొందరి అభిప్రాయం. తాత్కాలికంగా ఇబ్బందులు పెట్టినా దీర్ఘకాలంలో పరిస్థితి మెరుగు పడుతుందని చెప్పారు. కానీ జరిగిందేమిటి? పెద్ద నోట్ల రద్దుకు ముందు 2011-12 నుంచి 2016-17 వరకు జిడిపి వృద్ధి రేటు 5.2 నుంచి 8.3 శాతానికి పెరిగింది. తరువాత దానికి భిన్నంగా కరోనాకు ముందు 2019-20 నాటికి నాలుగు శాతానికి దిగజారింది. మరుసటి ఏడాది కరోనాతో 7.3 శాతం తిరోగమనంలో పడింది. తరువాత వృద్ధి రేటు ఇంకా కరోనా పూర్వపు స్థితికి చేరుకోలేదు. అలాంటపుడు ఏ శాస్త్రీయ పరిశీలన ప్రాతిపదికన పెద్ద నోట్ల రద్దుకు-పన్నుకు ముడిపెట్టారు? అదేవిధంగా యుపిఐ చెల్లింపుల పెరుగుదల గణనీయంగా ఉంది. అది పెద్ద నోట్ల రద్దుకు ముందే ప్రారంభమై ఉంటే తరువాత పెరుగుదల ఎక్కువగా ఉంటే దాని ఫలితమే అనవచ్చు. యుపిఐ సౌకర్యాన్ని ప్రవేశపెట్టిందే 2016 ఏప్రిల్ పదకొండున, ఆ ఏడాది అసలు లావాదేవీలు జరగలేదు. 2017 నవంబరు నాటికి కూడా నామమాత్రమే. అందువలన దానికి పెద్ద నోట్ల రద్దుకు సంబంధమే లేదు.
పన్ను ఎగవేతలు, ఆర్థిక నేరాలకు తావు లేకపోతే గత ఎనిమిదిన్నర సంవత్సరాల్లో విపరీతంగా పెరిగిన దాడులకు ఏ భాష్యం చెబుతారు? పోనీ దాడులతో సాధించింది ఏమిటో చెప్పాలి. 2004 నుంచి 2014 వరకు 112 ఇ.డి దాడులు జరిగితే 2014 నుంచి 2022 వరకు 3,010 డాడులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. నూటపన్నెండు దాడుల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం రూ.5,346 కోట్లు. సగటున 47.73 కోట్లు. కాగా 3010 దాడుల్లో స్వాధీనం చేసుకున్నది రూ.99,356 కోట్లు సగటున 33 కోట్లు ఉంది. దేశంలో అక్రమ లావాదేవీలు ఇంతేనా? ఎంతకాలం జనాన్ని మభ్య పెడతారు. 3010 కేసుల్లో శిక్షలు పడింది కేవలం 23 ఉదంతాల్లోనే, అందుకే వీటిని ప్రతిపక్షాల నేతల మీద బెదిరింపు దాడులని జనాలు అనుకుంటున్నారు. ఏటా జిఎస్‌టి 85 వేల కోట్ల మేరకు ఎగవేస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన రుబిక్స్ సంస్థ అంచనా వేసింది. ప్రభుత్వం కూడా దాదాపు ఇలాంటి మొత్తాల గురించే అధికారికంగా ప్రకటిస్తున్నది. ఇలాంటి వైఫల్యాల గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు. సుప్రీం కోర్టులో తన చర్యను కేంద్ర ప్రభుత్వం ఎలా సమర్ధించుకుంటుందో ఏ వాదనలను ముందుకు తెస్తుందో చూద్దాం !
ఎం. కోటేశ్వరరావు