ఆఖరు పేజీ చదివి
పుస్తకం మూసేయబోతుండగా
'సశేషం' అంటూ కనిపిస్తావు
రాలిన ఎండుటాకు స్ధానంలో
కొత్త చిగురు తొడుగుతావు
మరొక ముఖచిత్రంతో
నూతన పనిదినాలు మొదలవుతాయి
కాసేపు విరామం తీసుకుంటే
మరొకరితో నా స్థానం భర్తీ అవుతుంది
నేను బ్యాక్ బెంచికి పరిమితం
అప్పుడర్థమవుతుంది
కాలమూ శ్వాస వేరు కాదని
గాడిద మేసిన తర్వాత
పుట్టుకొచ్చే గరికలా మారతాను
సుఖ దుఃఖాలతో నీకు నిమిత్తం లేదు
గెలుపోటములు పట్టించుకోవు
నీకు తెలిసింది పరుగు మాత్రమే
అందరినీ వెంట రమ్మని పిలుస్తావు
బడికి పోనని మారాం చేసే పిల్లలం
రెక్కపట్టుకుని ఈడ్చుకుపోతావు
మొండికేస్తే వదిలేసిపోతావు
నీరసపడితే జారవిడుస్తావు
అప్పుడు మరిచిపోయిన చరిత్రలో
మరుగునపడ్డ పేరాల్లో గడ్డకడతాం
నీతో సమానంగా దూసుకొస్తే
ఎవరెస్ట్ శిఖరాన నిలుపుతావు
'కాలాతీత వ్యక్తి' బిరుదునిస్తావు
ఒక్కటి మాత్రం నిజం
అనంతమైన నీ నడకకి అలుపు లేదు
నా ఊపిరికి మాత్రం సొలుపు ఉంది
అది ఆగేవరకూ పరుగు ఆపలేను
కౌలూరి ప్రసాదరావు
73829 07677