Jul 23,2022 06:54

      భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము విజయం సాధించడం అభినందనీయం. జయాపజయాలు పక్కనపెట్టి ప్రజాస్వామ్య విలువలను, పౌర హక్కులను పరిరక్షించి సమాజ పురోభివృద్ధికి కృషి చేసేవారే సరైన పాలకులౌవుతారు. రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతలు కలిగియున్న రాష్ట్రపతి పీఠానికి ప్రత్యేక విశిష్టతలూ, విశేషాధికారాలూ ఉన్నాయి. భారత నూతన రాష్ట్రపతిగా ఈ నెల 25న ఆమె పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. స్వాతంత్య్రం అనంతరం జన్మించి రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించిన తొలి వ్యక్తిగా, తొలి ఆదివాసీ మహిళగా, రెండో మహిళగా పలు రికార్డులు ఆమె సొంతం కానున్నాయి. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. అణగారిన ఆదివాసీ తెగల నుంచి అత్యున్నత రాష్ట్రపతి పీఠం అధిష్టించే స్థాయికి ఎదిగిన ముర్ముపై ఆయా తెగల ప్రజల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ అనేక ఆశలు, ఆకాంక్షలు ఉండటం సహజం. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నట్లు రాజ్యాంగ పరిరక్షణకర్తగా ముర్ముపై బృహత్తర బాధ్యతలున్నాయి.
    కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వినాశకర నిర్ణయాలతో నిరుద్యోగం కోరలు చాస్తోంది. తిండి గింజలతో సహా నిత్యావసర సరుకులపై వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) పెంచేయడంతో పోషకాహార లభ్యతకు మప్పు వాటిల్లుతోంది. ద్రవ్యోల్బణం కత్తి నూరుతుంటే..రూపాయి పాతాళానికి పరుగులు తీస్తోంది. మతోన్మాద విద్వేషం కోరలు చాస్తోంది. సామాజిక, హక్కుల కార్యకర్తల అరెస్టులు నిత్యకృత్యమయ్యాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగ పరుస్తూ ప్రతిపక్ష నాయకుల పట్ల వేధింపులు కొనసాగుతూనే వున్నాయి. సమస్యల సుడిగుండంలోకి ప్రజలను నెట్టేసి సహజ వనరులను, ప్రజల సంపదను కార్పొరేట్‌ కంపెనీలకు దోచిపెట్టే చర్యలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే ఆదివాసీలను బలిపీఠం ఎక్కించేలా కార్పొరేట్‌ అనుకూల సంస్కరణలతో అటవీ సంరక్షణ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు మోడీ సర్కార్‌ కొన్ని కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది. దేశంలోని 10 కోట్ల మంది ఆదివాసీలపై కత్తిని వేలాడదీసింది. ఖనిజ తవ్వకాలు, పునరుత్పాదక విద్యుత్‌, పర్యాటకం, వన్యమృగాల పరిరక్షణ జోన్ల పేరుతో ఇప్పటికే అడవి బిడ్డలను అడవికి దూరం చేస్తున్నారు. ఒడిశాలో బిజెడి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వం హయాంలో అటవీభూములను వేదాంత, పోస్కో వంటి బడా కంపెనీలకు కట్టబెట్టి వేలాది మంది గిరిజనులను నిర్వాసితులుగా అడవి నుంచి వెళ్లగొట్టారు. ఒడిశాకే చెందిన ముర్ము సంతాల్‌ తెగకు చెందిన గిరిజన పుత్రిక అయివుండి కూడా నాటి ఆందోళనల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. ద్రోహానికి ఒడిగట్టిందే బిజెపి గనుక అది గిరిజన హక్కుల కోసం పోరాడుతుందని ఆశించలేం. అందుకే ఆదివాసీ ఓటు బ్యాంకు కోసం బిజెపి సోషల్‌ ఇంజినీరింగ్‌లో భాగంగా ఆమెను ఎంపిక చేసింది.
2017లో రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎన్నిక వేళ కూడా బిజెపి ఇలానే ప్రచారం చేసుకుంది. దళితుల సాధికారతకు బ్రాండ్‌ అంబాసిడర్లమంటూ గొప్పలు చెప్పుకుంది. కానీ ఎస్సీ, ఎస్టీలపై దాడులు యేటికేడూ పెరుగుతూ పోతున్నాయి. 2018లో దళితులపై దాడులు జరిగిన కేసులు 42,793 ఉండగా 2020 నాటికి వాటి సంఖ్య 50 వేలకు పెరిగింది. ఆదివాసీలపై దాడులు జరిగిన ఘటనలు 2018లో 6528 ఉండగా, 2020 నాటికి 8272కు పెరిగాయి. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఈ దాడులు అత్యధికంగా ఉంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కార్‌ కేబినెట్‌లోనే దళితుల పట్ల వివక్ష ఉందంటూ ప్రముఖ దళిత నేత దినేష్‌ ఖటిక్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారంటే బిజెపి చెప్పే దళిత సాధికారత ఏమిటో బోధపడుతుంది. అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో దళిత, ఆదివాసీ వ్యక్తులను కూర్చోబెట్టినంత మాత్రాన బిజెపి, సంఫ్‌ు పరివార్‌.. ఆదివాసీ, దళిత వ్యతిరేక వికృత ముఖాన్ని దాచుకోజాలదు. ఈ నేపథ్యంలో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలపై కొనసాగుతున్న వేధింపులు, విద్వేష రాజకీయాల పట్ల కొత్త రాష్ట్రపతి ఎలాంటి విధానాన్ని అవలంబిస్తారనేదే ఇప్పుడు ముఖ్యం. కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం గిరిజనులను బలిపీఠమెక్కిస్తున్న మోడీ సర్కార్‌కు వంత పాడుతూ రబ్బరు స్టాంపుగా మిగిలిపోతారా? విశేషాధికారాలను వినియోగించుకొని అడవి బిడ్డలను, ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ పునాదులను పరిరక్షిస్తారా? ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ముర్ముపై పోటీ చేసిన యశ్వంత్‌ సిన్హా ఆమెకు అభినందనలు తెలియజేస్తూ అభిప్రాయపడినట్లుగా 'ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా రాజ్యాంగ సంరక్షకురాలిగా ముర్ము తన విధులు నిర్వహిస్తార'ని ఆశిద్దాం.