
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ ఇటీవల న్యాయ వ్యవస్థను, రాజ్యాంగాన్ని చులకన చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యమైనవి కావు. రాజ్యాంగ పదవుల్లో ఉంటూ అదే రాజ్యాంగాన్ని తప్పుబట్టే యత్నాలు విచారకరం. 83వ అఖిల భారత శాసనసభ, శాసన మండలి సభాపతుల సమావేశంలో ధన్‌కర్ మాట్లాడిన తీరు ఆసాంతం.. రాజ్యాంగ మౌలిక స్వభావాన్నే ప్రశ్నించేలా ఉంది. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు రాజ్యాంగమే దఖలు పర్చినా కూడా రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు లేదని స్పష్టం చేస్తూ భారత న్యాయ చరిత్రలో మైలురాయి వంటి కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్న వ్యక్తి శంకించడం నేరుగా రాజ్యాంగంపై దాడి చేయడమే తప్ప మరొకటి కాదు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి అదే రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలనే సవాలు చేయడం ఉపరాష్ట్రపతి కార్యాలయానికి తగనిపని. 2015లో మోడీ సర్కార్ నియమించిన న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జెఎసి)ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా ధన్‌కర్ విమర్శలు గుప్పించారంటే ఉపరాష్ట్రపతి తీరు బిజెపి ఎజెండాను నెత్తినపెట్టుకొని మోస్తున్నట్లు ఉంది మినహా రాజ్యాంగ విధులు నిర్వహించేదిగా లేదు.
పరిపాలన సౌలభ్యం కోసం శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ ఇలా అన్ని విభాగాలకు అధికారాలను, విధులను కల్పించింది కూడా రాజ్యాంగమే అన్న సంగతి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి గుర్తు చేయాల్సి వస్తుండటం శోచనీయం. గౌరవ ఉపరాష్ట్రపతి సర్వోన్నతమైనదిగా భావిస్తున్న పార్లమెంటుకు సైతం హక్కులను ప్రసాదించింది రాజ్యాంగమే. ఇలాంటి పరిస్థితి వస్తుందనే కేశవానంద భారతి కేసులో సర్వోన్నత న్యాయస్థానం 'ప్రాథమిక నిర్మాణం' (బేసిక్ స్ట్రక్చర్) సూత్రాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ తీర్పును శంకిస్తున్నారు. సంఖ్యా బలం ఉన్నంత మాత్రాన ఏ ప్రభుత్వానికి కూడా మన గణతంత్ర వ్యవస్థలోని ప్రాథమిక నిర్మాణాన్ని తక్కువ చేసే హక్కు లేదు. పార్లమెంటులో మందబలం చూసుకొని ఏకపక్ష నిర్ణయాలతో దేశాన్ని ధ్వంసం చేయనీయకుండా కాపాడుతూ వస్తున్నది ఈ ప్రాథమిక నిర్మాణ సూత్రమే. రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి అయినా సరే, దేశంలోని సాధారణ పౌరులైనా సరే రాజ్యాంగ 'సర్వోన్నత'ను ప్రశ్నించడం అంటే దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడమే అవుతుంది.
సార్వభౌమాధికారం అంటే ఏమిటి? అదెక్కడుందనేది కూడా రాజ్యాంగమే తేల్చి చెప్పింది. భారత రాజ్యాంగ రచనా కాలంలో రాజ్యాంగ సభలో రాజ్యాంగాన్ని ఎలా ప్రారంభించాలనే చర్చ జరిగింది. అప్పుడు భారత రాజ్యాంగాన్ని 'భారతదేశ ప్రజలమైన మేము..' అని మొదలు పెట్టి ఈ దేశ ప్రజానీకానికి సార్వభౌమాధికారాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు కట్టబెట్టారు. అంతేకాదు..సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాతంత్ర, గణతంత్ర రాజ్యంగా రాజ్యాంగ పీఠికలోనే స్పష్టంగా వుంది. అందువల్ల పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు ఏ ఒక్కటీ సర్వోన్నతం కాదు..కాబోవు. ఈ దేశంలో సర్వోన్నత సార్వభౌమాధికారం రాజ్యాంగానిదే..అంటే ప్రజలదే. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులుగా ఈ మూడింటిలో ఒక అంగంలో మెజార్టీ సభ్యులున్నంత మాత్రాన రాజ్యాంగాన్ని మార్చేయాలనుకుంటే అలాంటి పప్పులుడకవు. భారత గణతంత్ర, లౌకిక, ప్రజాతంత్ర లక్షణాన్ని ధ్వంసం చేసి ఆ స్థానంలో ఫాసిస్టు హిందూత్వ రాష్ట్ర ఏర్పాటుకు జరుగుతున్న కుట్రల్లో భాగంగానే తాజా పరిణామాలను చూడాల్సి వుంది. అటువంటి కుట్రల పట్ల ప్రజాస్వామ్యవాదులందరూ అప్రమత్తంగా వుండాలి. సార్వభౌమాధికారాన్ని కలిగియున్న దేశ ప్రజానీకమే రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని కూడా పరిరక్షించుకోవాలి.