Jan 11,2023 07:33

            బ్రెజిల్‌లో బోల్సనారో మద్దతుదారుల వీరంగం ఫాసిస్టు శక్తుల నుంచి ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న ముప్పును తెలియజేస్తోంది. రెండేళ్ల క్రితం అమెరికన్‌ కాంగ్రెస్‌పై ట్రంప్‌ అనుయాయులు దాడి చేసినట్టే ఆదివారం నాడు బ్రసీలియాలోని పార్లమెంటు, సుప్రీంకోర్టు, అధ్యక్ష భవనాలపై బోల్సనారో మద్దతుదారులు దాడి చేశారు. మాజీ అధ్యక్షుడు బోల్సనారో గత ఏడాది ఎన్నికల్లో లూలా చేతిలో ఓడిపోయినప్పటి నుంచి బ్రెజిల్‌ ఎన్నికల వ్యవస్థలో అక్రమాల గురించి పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. వీటిలో ఏఒక్క దానికి ఆధారాలు చూపలేకపోయారు. ఆదివారం నాటి దాడిని ఉగ్రవాద చర్యగా బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డసిల్వా, కాంగ్రెస్‌, సుప్రీంకోర్టు ప్రకటించడం సబబే.
         లాటిన్‌ అమెరికాలో కార్పొరేట్‌ శక్తుల విచ్చలవిడి దోపిడీని భరించలేక ప్రజాక్షేమమే ధ్యేయంగా పరితపించే వామపక్షవాదులకు ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. దీంతో, వారు గెలవకుండా అడ్డుకునేందుకు డబ్బు కుమ్మరించడం, ప్రజల మధ్య మతం, ఇతర పేర్లతో చీలికలు తేవడం, బెదిరింపులకు పాల్పడటం తదితర అక్రమాలన్నీ అమెరికా మద్దతుతో అడ్డగోలుగా సాగించింది. వాటన్నింటినీ అధిగమించి లాటిన్‌ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్‌లో వర్కర్స్‌ పార్టీ నాయకుడు, వామపక్ష వాది లూలా డసిల్వా 50.9 శాతం ఓట్లతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆరేళ్లపాటు అధికారంలో ఉన్న బోల్సనారో 49.1 శాతం ఓట్లు పొందారు. లూలా వారసురాలు దిల్మా రౌసఫ్‌ను అభిశంసించి పదవి నుంచి తొలగించిన తరువాత 2018లో బోల్సనారో అధికారంలోకి వచ్చాడు. అప్పటి నుంచి నియంతృత్వ పాలనను ఆ దేశ ప్రజలు అనుభవించారు. లాభాలను కార్పొరేట్లకు, పెద్దలకు కట్టబెట్టాడు. 3 కోట్ల 30 లక్షల మంది తినడానికి సరైన తిండి లేని స్థాయికి దిగజారారు. కరోనా చిన్న ఫ్లూనే అంటూ వ్యాక్సినేషన్‌ మాస్కులు, భౌతిక దూరం, లాక్‌డౌన్‌ తదితర పద్ధతులన్నీ తోసిపుచ్చాడు. దీంతో, ఏడు లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అమెజాన్‌ అడవుల్లో వన్య ప్రాణులను నాశనం చేయించి, మూలవాసులను నిర్వాసితులుగా మార్చేశాడు. కార్మిక హక్కులన్నీ అణగదొక్కాడు. కాంగ్రెస్‌ను రద్దు చేయాలని వాదించాడు. రాజ్యాంగ సంస్థలు, సుప్రీంకోర్టుపై, న్యాయమూర్తులపై విషం వెళ్లగక్కేవాడు. మితవాదులను, తన మద్దతుదారులను సైన్యంలోకి, రాజ్యాంగ సంస్థల్లోకి చొప్పించాడు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారినందరినీ దేశద్రోహులుగా ప్రచారం చేశాడు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా తన మద్దతుదారులతో ఆందోళనలు చేయిస్తూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డాడు. ట్రంప్‌లాగే బోల్సనారో కూడా లూలా ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరించాడు. లూలా ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకునేందుకు అంతర్గత అత్యవసర పరిస్థితి విధించే కుతంత్రం పన్నాడు. అదీ విఫలమవడంతో అమెరికాలోని ఫ్లోరిడా పారిపోయాడు.
           బోల్సనారో అనుచరులు వందకుపైగా బస్సుల్లో బ్రసీలియాకు వస్తుంటే వారిని అడ్డుకోవడానికి స్థానిక పోలీసులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు చేపట్టకపోవడం స్థానిక పోలీసుల వైఫల్యాన్ని తెలియజేస్తోంది. కుట్రదారులతో అధికారులు కుమ్మక్కయ్యారా? లేక వారి అసమర్థతా? అనేది విచారణలో తేలాలి. లూలా హయాంలో తమ దోపిడీ కొనసాగదని భావించిన పెద్ద భూస్వాములు, బడా వ్యాపారులు బస్సులు, అవసరమైన ఇతర ఏర్పాట్లన్నీ చేసి బోల్సనారో మద్దతుదారుల అల్లర్లకు మద్దతుగా నిలిచారు.
            లూలాపై కార్పొరేట్ల, బడా భూస్వాముల అక్కసుకు అనేక కారణాలున్నాయి. గతంలో, తన హయాంలో రెండు కోట్ల మందిని పేదరికం నుంచి, ఆకలి నుంచి బయటపడేసిన బోల్సా ఫేమలియా పథకాన్ని అమలు చేస్తానని లూలా ప్రకటించారు. ఫ్యామిలీ డాక్టర్‌ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. తాజాగా 16 మంది మంత్రుల్లో 11 మంది మహిళలకు కీలక బాధ్యతలు అప్పగించారు. పేద ప్రజలకు ఆశాజనకంగా ఉన్న లూలా పాలనను ఎలాగైనా అంతమొందించేందుకు బోల్సనారో పన్నిన కుట్రను తాజాగా లూలా ప్రభుత్వం తిప్పికొట్టగలిగింది. సైనిక కుట్ర ద్వారా బొలీవియాలో ఎవొ మోరల్స్‌ను, పార్లమెంటరీ కుట్ర ద్వారా పెరూ అధ్యక్షుడు పెడ్రో కాస్టిలోనూ అధికారం నుంచి దింపివేసేందుకు తెరవెనుక నుంచి అన్నీ తానైన అమెరికా సైతం తాజా దుశ్చర్యను ఖండించాల్సి వచ్చింది. బ్రెజిల్‌లో ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగానే చూడలేము. ప్రపంచవ్యాపితంగా ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న ప్రమాదంగా చూడాలి. ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలి.