Jul 12,2023 07:09

         'స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం' అన్న నినాదాన్ని ప్రపంచానికందించిన ఫ్రెంచి విప్లవం నాటి స్ఫూర్తి అదే గడ్డపై మంటగలవడం క్షంతవ్యం కాదు. పదిహేడేళ్ల ముస్లిం యువకుడు నహేల్‌ ట్రాఫిక్‌ పాయింట్‌లో కారు ఆపలేదని ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ నగర శివార్లలో కాల్చిచంపడంతో మొదలైన ఆగ్రహ జ్వాల నేటికీ రగులుతూనే ఉంది. పోలీసులు పెద్దఎత్తున రంగంలోకి దిగి, వేలమందిని అరెస్టు చేస్తున్నా, లాఠీఛార్జి, టియర్‌ గ్యాస్‌ ప్రయోగిస్తున్నా... అల్లర్లు ఆగడం లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. రోజురోజుకూ తీవ్రమవుతున్న ఆర్థిక - సామాజిక అసమానతలు, శ్వేత జాతియేతరుల పట్ల తీవ్రమైన వివక్ష దీనికి ప్రధాన కారణం కాగా, ఉక్రెయిన్‌ సంక్షోభం, ఆర్థికంగా దిగజారడంతో కనీస ఆదాయాలు పడిపోవడం, పెన్షన్‌ సంస్కరణలు...ఇలా జనంలో ప్రభుత్వంపై గూడుకట్టుకున్న అసంతృప్తి మరో కారణం.
            తల్లితోపాటు పారిస్‌లో నివసిస్తున్న అల్జీరియా-మొరాకో సంతతికి చెందిన నహేల్‌ డెలివరీ బారుగా పనిచేస్తున్నాడు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోవడంతో కారు ఆపకుండా వెళ్లిపోవడానికి ప్రయత్నించగా, ఏ నేర చరిత్రా లేని ఆ కుర్రాడిని శ్వేత జాతి దురహంకారం తలకెక్కించుకున్న ఓ పోలీసు అధికారి ఎటువంటి విచక్షణా లేకుండా కాల్చేశాడు. అదే శ్వేత జాతి యువకుడైతే కచ్చితంగా ఆ పనిచేసేవాడు కాదని ఫ్రెంచి ప్రజలు నమ్ముతున్నారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో ప్రజానీకంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఫ్రాన్స్‌లో పట్టణాలు, నగరాల చుట్టూ శివార్లలో అల్పాదాయ వర్గాలు నివసించే 'బాన్ల్యూ'లు ఉంటాయి. ఇక్కడ నివసించే వారిలో అత్యధికులు అల్జీరియా, మెరాకో, ట్యునీషియాలో వందల ఏళ్లపాటు ఫ్రెంచి పాలకుల దోపిడీకి గురైన వారు. కనీస ప్రాథమిక సౌకర్యాలకు సైతం నోచని వీరు అక్కడ శ్రమశక్తిలో కీలకం. 2021 నాటికి ఫ్రాన్స్‌ జనాభాలో 10.7 శాతంగా అంటే 70 లక్షలమంది వలస దారులున్నారు. రాజ్యాంగం పౌరసత్వాన్ని గొప్పగా నిర్వచించినా... పోలీసు వ్యవస్థ వివక్ష చూపడం సర్వసాధారణం. న్యాయవ్యవస్థ కూడా నల్లజాతీయుల ప్రాణాలకు, హక్కులకు విలువనివ్వకపోవడం కనిపిస్తోంది. పేరు, నివసిస్తున్న ప్రాంతం తెలిస్తే వారికి ఉపాధి లభించదు. మితవాద పార్టీలు వారిని శత్రువులుగా చూపి రాజకీయంగా ఎదుగుతున్నాయి. ఈ వైఖరి శ్వేతజాతియేతరుల్లో అభద్రతను పెంచింది. పశ్చిమ దేశాల్లో అమెరికా తరువాత ఫ్రాన్స్‌లోనే పోలీసుల చేతిలో ఎక్కువమంది మరణిస్తున్నారు. 2020లో అమెరికాలో నల్లజాతి యువకుడు జార్జి ఫ్లాయిడ్‌ను ఊపిరాడకుండా చేసి చంపిన శ్వేతజాతి దురహంకార పోలీసు అధికారి దాష్టీకంపై పెల్లుబికిన ఆగ్రహం తరహాలోనే తాజాగా నహేల్‌ ఆందోళనలు కొనసాగాయి. 2005లో పోలీసులు వెంబడిస్తుండటంతో ఇద్దరు ముస్లిం బాలురు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో దాక్కుని మరణించడంతో ప్రారంభమైన అల్లర్లు చివరికి అత్యయిక పరిస్థితికి దారితీశాయి. ఫ్రాన్స్‌లో పోలీసులు ఆదేశించినప్పుడు వాహనం ఆపకున్నా, బెదిరించినా నిర్దాక్షిణ్యంగా కాల్చివేసేందుకు అనుమతిస్తూ 2017లో చేసిన సవరణ పోలీసులకు అపరిమిత అధికారాల్ని కట్టబెట్టింది. 2020 నుంచి ఏటా సగటున 44 మంది పోలీసుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో అత్యధికులు శ్వేత జాతియేతరులే. ట్రాఫిక్‌ జంక్షన్ల వద్ద కాల్పుల్లో గత ఏడాది 13 మంది మరణించగా, ఈ ఏడాది ఇది మూడో హత్య.
          ఫ్రాన్స్‌ సమాజంలో సంపద పంపిణీ, అవకాశాల్లో భారీ అంతరాలున్నాయి. వాటిని సరిచేసి శ్వేత జాతియేతరులకు సమాన అవకాశాలు కల్పించడంలో మాక్రాన్‌ ప్రభుత్వం విఫలమవడంతో రావణకాష్టం రగిలింది. మన రాజ్యాంగ పీఠికలో సైతం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని చేర్చుకున్నాం. ఈ మూల సూత్రాల అమలులో ఫ్రాన్స్‌కంటే భిన్నమైన పరిస్థితులేవీ మనదేశంలో కనిపించడం లేదు. మణిపూర్‌లో రెండు నెలలుగా చిచ్చు రగులుతూనే ఉన్నా ప్రధాని కనీసం నోరు మెదపకపోవడం చూస్తున్నాం. అమెరికా, ఇతర ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యం గురించి గొప్పలు చెప్పి 24 గంటలైనా కాకముందే తన మనుషుల అధీనంలో ఉండే భారతీయ ఆర్మీ మేజర్‌ ఒకరు ఈద్‌ పండగ రోజున కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా జదూరా గ్రామంలోని మసీదులోకి చొరబడి అక్కడి వారితో 'జై శ్రీరామ్‌' అని బలవంతంగా నినాదాలు ఇప్పించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బహుళ సంస్కృతిని కాపాడుకోవాలి. ఈ విషయంలో ఫ్రెంచ్‌ ప్రజలు చూపిన తెగువ అభినందనీయం. ఫ్రాన్స్‌ పరిణామాలు మన దేశంతోపాటు అనేక దేశాలకు కనువిప్పు కావాలి. వివిధ జాతులు, మతాలు, వర్ణాలు, వర్గాలతో వైవిధ్యభరితమైన ప్రజానీకమున్న మనదేశం వారి ఆకాంక్షలకు తగినట్టుగా మలచుకోవాలి. ఒకే దేశం, ఒకే జాతి, ఒకే చట్టం, ఒకే సంస్కృతి పేరుతో భారతదేశ బహుళత్వాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యలను అనుమతించరాదు.