Jul 31,2023 16:52

న్యూఢిల్లీ : మణిపూర్‌లో చెలరేగిన హింసలో గిరిజనులు ఎంతో నష్టపోయారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా గిరిజన సంఘాలు కేంద్ర వైఖరిపై తీవ్ర అసహనంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌పార్టీ ఆగస్టు 9వ తేదీన 'ప్రపంచ ఆదివాసీల అంతర్జాతీయ గిరిజన దినోత్సవం' సందర్భంగా 'ఆదివాసీ గౌరవ్‌ పర్వ'ను చేపట్టి గిరిజనులకు సంఘీభావం తెలియజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ రోజున విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహించాలని అన్ని రాష్ట్ర విభాగాలకు సూచనలు చేసింది. ఈ సందర్భంగా అన్ని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి)లకు పిసిసి జనరల్‌ సెక్రటరీ కె.సి వేణుగోపాల్‌ సోమవారం లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన 'ఆగస్టు 9వ తేదీ ప్రపంచ ఆదివాసీల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా భారత జాతీయ కాంగ్రెస్‌ ఆదివాసీ వర్గాల పట్ల అపారమైన అభిమానాన్ని వ్యక్తం చేసింది. గత తొమ్మిది సంవత్సరాల్లో ఆదివాసీలు గుర్తింపు లేనివారిగా, వారికున్న హక్కుల్ని కోల్పోయారు. వారి హక్కుల పోరాటంలో కాంగ్రెస్‌ మద్దతుగా నిలుస్తుంది. ఆదివాసీల నిరసనలు పట్టించుకోకుండా నరేంద్రమోడీ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాలను పలచన చేసింది. ప్రస్తుత బిజెపి పాలన ఆదివాసీ వర్గాలను ఎలా అవమానపరుస్తుందో, అవమానకరంగా ఎలా వేధింపులకు గురిచేస్తున్నదో, వారి చట్టబద్ధమైన హక్కులను కూడా ఎలా హరిస్తుందో మనందరం సాక్షులం. కాంగ్రెస్‌ పార్టీ వారికి నిరంతరం అండగా నిలుస్తూ వివిధ వేదికలపై తమ గళాన్ని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 9న ఆదివాసీ గౌరవ్‌ పర్వ్‌ను నిర్వహించాలని అన్ని రాష్ట్ర యూనిట్లను కోరుతున్నాను' అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం గిరిజన సోదర, సోదరీమణుల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించే అవకాశంగా ఉండాలి. ఆదివాసీ సోదర, సోదరీమణులతోపాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమానమైన, న్యాయమైన సమాజం కోసం తమ నిబద్ధతను పునరుద్ఘాటించాలి. దీని కోసం ఆదివాసీల అభ్యున్నతికి కాంగ్రెస్‌ చేస్తున్న కృషిని తెలిపేలా రాష్ట్రంలోని ఒక ప్రదేశంలో ఆదివాసీ గౌరవ్‌ మహాసభను ఏర్పాటు చేయాలని పిసిసి కమిటీలకు రాసిన లేఖలో వేణుగోపాల్‌ పేర్కొన్నారు. అలాగే ఆరోజు ఆదివాసీలపై బిజెపి చేస్తున్న దౌర్జన్యాలను ఎత్తిచూపేలా ఓ మెగా ర్యాలీని నిర్వహించాలి. ఈ సందర్భంగా పిసిసి కమిటీలు రాష్ట్ర ఆదివాసీ ఫోరమ్‌ను ఏర్పాటు చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ ఫోరమ్‌లో ఆదివాసీ కమ్యూనిటీలకు చెందిన విద్యావేత్తలు, కార్యకర్తలు, విద్యార్థులతో పాలు పంచుకోవడానికి ఆదివాసీ మేధావుల ఫోరమ్‌ కాన్ఫరెన్స్‌ను పిసిసి నిర్వహించాలి' అని లేఖలో వేణుపాల్‌ తెలిపారు. అదేరోజు ఆదివాసీలకు అండగా నిలబడాలని కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు 'సంరక్షన్‌ ప్రతిజ్ఞ'ను చేయాలి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో గిరిజనుల కోసం సమావేశాలు సదస్సులు నిర్వహించాలి. రాష్ట్రంలో స్థానిక ప్రభావశీలురతో కలిసి ఆదివాసీ వర్గాల ప్రత్యేక సంప్రదాయ సంగీతం, నృత్యాలు ప్రదర్శన కార్యక్రమాలు జరపాలి. ఈ కార్యక్రమాల సందర్భంగా కమ్యూనిటీ విందులను కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర నాయకత్వం సూచించినట్లు వేణుగోపాల్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఈ పోరాటంలో రాత్రి సమయంలో కొవ్వొత్తుల నిరసన ప్రదర్శనలు జరపాలి అని వేణుగోపాల్‌ తన లేఖలో పేర్కొన్నారు.