Jan 22,2023 09:47

క్యూబా విప్లవం 1959లో విజయవంతం అయిన తర్వాత సోషలిస్టు క్యూబా నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. అలా క్యూబాలోనే స్థిరపడిపోయి, అధికారంతో పాటు సుఖవంతమైన జీవితాన్ని అనుభవించడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ప్రపంచమే తన మాతృభూమిగా భావించిన చే క్యూబాలో ఉంటూనే కాంగో పోరాటంలో పాల్గొన్నాడు. మొత్తం లాటిన్‌ అమెరికాలో విప్లవ పోరాటాన్ని విజయవంతం చేయాలని సంకల్పించాడు. దీనిలో భాగంగా బొలీవియాలో గెరిల్లా పోరాటం నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. కొద్దిమంది విప్లవకారులతో కలిసి 1966 నవంబరులో చే బొలీవియా చేరుకున్నాడు. అక్కడి సైనిక నియంతృత్వ పాలకునికి వ్యతిరేకంగా గెెరిల్లా పోరాటాన్ని ఆరంభించాడు.

చే గువేరా.. ఆ పేరు విననివారు ఎవరూ ఉండరు. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి ఆయనొక ప్రతీక. ప్రపంచంలో దోపిడీ, పీడన లేని ఉన్నతమైన సమాజం కోసం అవిశ్రాంతంగా పోరాడిన గొప్ప విప్లవకారుడు. డాక్టర్‌ పట్టాను 1953లో పుచ్చుకున్నాక చే గువేరా లాటిన్‌ అమెరికాలో ఎనిమిది నెలల మోటారు సైకిల్‌ యాత్రకు బయల్దేరాడు. ఎక్కడ, ఏ సామాజిక సమస్యతో పెనవేసుకోవాలా అని అన్వేషిస్తూ చివరికి గ్వాటిమాలాలో వామపక్ష భావజాలంతో స్ఫూర్తి పొంది, పనిచేస్తున్న జాకోబో అర్బెంజా ప్రభుత్వ విధానాల పట్ల ఆకర్షితుడై ఆ దేశంలో పనిచెయ్యాలనే నిర్ణయానికి వచ్చాడు. కొద్ది నెలలలోనే అమెరికన్‌ సిఐఎ సంస్థ ఇచ్చిన దన్నుతో సైన్యం తిరుగుబాటు చేసి, అర్బెంజా ప్రభుత్వాన్ని కూలగొట్టడం కళ్ళారా చూశాడు. ఈ అనుభవంతో అతని రాజకీయ అవగాహన అతివాద భావజాలం వైపు మొగ్గింది. మార్క్సిస్టు దృక్పథాన్ని అలవర్చుకున్నాడు. అమెరికన్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడడమే తన లక్ష్యం అనే నిర్ధారణకు వచ్చాడు. మెక్సికోకు పయనమయ్యాడు. అక్కడ కాస్ట్రోను కలుసుకున్నాడు. నవ యువకుడు, న్యాయవాది అయిన కాస్ట్రో ప్రవాస జీవితం గడుపుతూ అమెరికా అండదండలతో క్యూబాలో బాటిస్టా నేతృత్వంలోని సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని నిశ్చయించుకున్నాడు. గెరిల్లా దళాలను సమీకరిస్తున్నాడు. మెక్సికోలో కలిసిన ఈ క్యూబా కామ్రేడ్లే గువేరాకు 'చే' అనే ముద్దుపేరు పెట్టారు. ఆ పేరునే గువేరా తన విప్లవ నామధేయంగా స్వీకరించాడు. 1956-58 మధ్య కాలంలో క్యూబాలో జరిగిన గెరిల్లా పోరాటంలో కాస్ట్రోకు 'చే' అత్యంత సన్నిహితుడుగా, అత్యున్నత మిలిటరీ కమాండరుగా, భయమన్నదే ఎరుగని యోధుడిగా, నిజమైన మార్క్సిస్టుగా వ్యవహరించాడు.
క్యూబా విప్లవం 1959లో విజయవంతం అయిన తర్వాత సోషలిస్టు క్యూబా నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. అలా క్యూబాలోనే స్థిరపడిపోయి, అధికారంతో పాటు సుఖవంతమైన జీవితాన్ని అనుభవించడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ప్రపంచమే తన మాతృభూమిగా భావించిన చే క్యూబాలో ఉంటూనే కాంగో పోరాటంలో పాల్గొన్నాడు. మొత్తం లాటిన్‌ అమెరికాలో విప్లవ పోరాటాన్ని విజయవంతం చేయాలని సంకల్పించాడు. దీనిలో భాగంగా బొలీవియాలో గెరిల్లా పోరాటం నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. కొద్దిమంది విప్లవకారులతో కలిసి 1966 నవంబరులో చే బొలీవియా చేరుకున్నాడు. అక్కడి సైనిక నియంతృత్వ పాలకునికి వ్యతిరేకంగా గెెరిల్లా పోరాటాన్ని ఆరంభించాడు. ప్రారంభంలో కొన్ని విజయాలు సాధించాడు. ఆ తరువాత కొద్ది కాలానికే సిఐఏ (అమెరికా గూఢచారి సంస్థ) సహకారంతో మిలిటరీ పాలకులు చే గువేరాను ఓ స్కూలు భవనంలో బంధించి, కాల్చి చంపేశారు. అయితే, చే గువేరా పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు లాటిన్‌ అమెరికా దేశాలు నడుం బిగించాయి. ఇప్పటికే అవి కొన్ని విజయాలు సాధించాయి. అమెరికా సామ్రాజ్యవాదుల కుట్రలను అడుగడుగునా ప్రతిఘటిస్తున్నాయి.
ఇరవయ్యో శతాబ్దం తొలి దశకంలో లాటిన్‌ ప్రజలు స్పెయిన్‌ దురాక్రమణకు, దమనకాండకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించి, దాస్య విముక్తులయ్యారు. అయితే తర్వాతి కాలంలో విదేశీయుల దోపిడీ స్థానంలో భూస్వామ్య వ్యవస్థ బలపడి, సామాన్య ప్రజలు ముఖ్యంగా రైతాంగం తీవ్ర కష్టాలపాలవడం మొదలైంది. ఫలితంగా ప్రజలు శాశ్వత బానిసత్వంలో మగ్గిపోయారు. దీనికి తోడు అమెరికా సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ వ్యవస్థ వారి జీవితాలను మరింత కుంగదీశాయి.. అమెరికా తన గుత్తాధిపత్యం కోసం ఈ ప్రాంత ప్రజలపై దాడులకు దిగింది. లాటిన్‌ అమెరికా ప్రజల ఆశయాలను కాలరాయడానికి ప్రయత్నించింది. ఈ స్థితిలో లాటిన్‌ అమెరికాలో గ్వాటిమాలా, కొలంబియా, వెనిజులా, బొలీవియాల్లో సాయుధపోరాటాలు తీవ్రమవుతున్నాయి. బ్రెజిల్‌లో తిరుగుబాటు పొద్దు పొడుస్తోంది. మరికొన్ని దేశాల్లో చెదురుమదురుగా తిరుగుబాటు స్వరాలు వినిపిస్తున్నాయి. అంతలోనే మూగబోతున్నాయి. ఈ స్థితిలో చే గువేరా లాటిన్‌ అమెరికా ప్రజలను చైతన్యపరిచాడు. అమెరికా సామ్రాజ్యవాదాన్ని, దాని అడుగులకు మడుగులొత్తే దేశీయ నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు సాయుధ తిరుగుబాట్లను ప్రేరేపించాడు.

  • కాంగోలో ...

బెల్జియం నుండి కాంగో స్వాతంత్య్రం 1960 జూన్‌లో పొందింది. వామపక్ష నేత, కాంగో జాతీయోద్యమ నేత పాట్రిస్‌ లుముంబా ప్రజాతంత్ర రిపబ్లిక్‌ కాంగో తొలి ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత కొద్ది కాలానికే లుముంబా ప్రభుత్వాన్ని సైన్యం కూల్చివేసింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు లుముంబా సోవియట్‌ యూనియన్‌, ఐక్యరాజ్య సమితి సాయం కోరాడు. అమెరికా, బెల్జియం కలసి సైనికాధిపతి జోసెఫ్‌ డిజైర్‌ మొబుటు కొమ్ముకాశాయి. మొబుటు ప్రభుత్వం లుముంబాను పట్టుకుని, 1961 జనవరిలో ఉరి తీసింది. అప్పటికి లుముంబా వయసు 35 సంవత్సరాలు. లుముంబా హత్య వెనక అమెరికా, బెల్జియం హస్తం ఉందనేది స్పష్టం. ఈ నేపథ్యంలో చే గువేరా, కొందరు క్యూబన్‌ గెరిల్లాలతో కలసి కాంగోలో లుముంబాకు మద్దతుగా పోరాటం నిర్వహించారు. మరో ఆఫ్రికన్‌ దేశం అల్జీరియాలో విముక్తి పోరాటానికి కూడా చే దన్నుగా నిలిచాడు. అల్జీరియా 1962లో స్వాతంత్య్రం పొందాక బొలీవియాలో గెరిల్లా పోరాటం చేపట్టేందుకు చే గువేరా బయల్దేరారు.

  • బొలీవియాలో...

చే 1966 నవంబరులో బొలీవియా చేరుకున్నాడు. అక్కడి సైనిక నియంతృత్వానికి వ్యతిరేకంగా గెరిల్లా సాయుధ పోరాటాన్ని నడిపించాడు. ప్రారంభంలో కొన్ని విజయాలు సాధించిన చే గువేరా శాంటాక్రజ్‌ ప్రాంతంలో ఒక గెరిల్లా బృందాన్ని ఏర్పాటు చేసి, పోరాటాన్ని మరింత ఉధృతం చేశాడు. అమెరికా ఆధ్వర్యంలోని బొలీవియా కిరాయి దళాలు ఆయన్ను బంధించాయి. 1967 ఆక్టోబరు8న సిఐఎ సహాయంతో మిలిటరీ పాలకులు ఆయనను పట్టుకుని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. చే గువేరా హత్య వార్త వినగానే ఆయన ఉద్యమ సహచరుడు, బొలీవియా కమ్యూనిస్టు విప్లవకారుడు ఇంతి పెరెదో స్పందిస్తూ 'బొలీవియాలో గెరిల్లా యుద్ధ తంత్రం అంతం కాలేదు. ఆరంభం మాత్రమే. మా కామ్రేడ్‌ మేజర్‌ ఎర్నెస్టో చే గువేరా, ఇంకొందరు గెరిల్లా యోధులు ప్రాణతర్పణం మాకు గట్టి ఎదురు దెబ్బే. పూడ్చుకోలేని నష్టమే. మానవజాతి విముక్తి కోసం ఎంతటి త్యాగం చేయడానికైనా వెనుకాడని తరం ఉన్న భూ ఖండం మాది. ఆదర్శ వీరోచిత దార్శనికుడు చే ఆకాంక్షించిన మరో వీర వియత్నాంను ఇక్కడ ఆవిష్కరిస్తాం. మన జెండా నలిగి, ముడతలు పడుతుందేమో కానీ అవనతం చెందదు. పిరికితనంతో చే ను హత్య చేసినవాళ్లు ఆయన ఆలోచనలను, వారసత్వాన్ని నిలువరించలేరు. బొలివర్‌- చే గువేరా బోధనలే మన వారసత్వంగా జాతీయ విముక్తి సైన్యం విశ్వసిస్తుంది' అని చెప్పారు.