Dec 25,2022 09:51

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ బదిలీల్లో అసంబద్ధాల కారణంగా ఉపాధ్యాయులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. బదిలీల నిమిత్తం విడుదల చేసిన 187,190 జివోలలో ఇచ్చిన మార్గదర్శకాలు అర్హులైన సీనియర్లకు నష్టం చేకూర్చేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పాటు 117 జివో ప్రకారం రేషనలైజేషన్‌ చేయడంతో అనేక ప్రైమరీ, యుపి స్కూల్స్‌ సిబ్బంది కూడా నష్టపోయేవీలుంది. ఉపాధ్యాయులు కష్టపడి విద్యార్థుల సంఖ్య పెంచినా.. రేషనలైజేషన్‌ వల్ల వారు కూడా నష్టపోవాల్సివస్తోంది. 2021 బదిలీల్లో వచ్చి రేషనలైజేషన్‌కు గురైనవారికి మాత్రమే రేషనలైజేషన్‌ పాయింట్లతో పాటు పాత స్టేషన్‌ పాయింట్లు కూడా వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనివల్ల 2015, 2017 బదిలీల్లో వచ్చి పూర్తికాలం పనిచేయకుండానే రేషనలైజేషన్‌కు గురై నష్టపోవాల్సివస్తోందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. గత బదిలీల్లో రేషనలైజేషన్‌కు గురైన వారికి పాత స్టేషన్‌ పాయింట్లతో పాటు ప్రిఫరెన్షియల్‌, స్పౌజ్‌ కేటగిరీలు వర్తింపచేయగా ఈ బదిలీల్లో వాటిని నిరాకరించడంతో సీనియర్లు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. రోజువారీ తీసుకునే నిర్ణయాలను ఉత్తర్వులు రూపంలో కాకుండా వెబెక్స్‌ ద్వారా అధికారులకు తెలియజేస్తుండటం ఉపాధ్యాయులను సమస్యల్లోకి నెడుతోంది. దీనివల్ల మండల, జిల్లా విద్యాశాఖ అధికారులు సొంత నిర్ణయాలు తీసుకుంటూ అమల్జేస్తుండటంతో ఉపాధ్యాయులు గందరగోళానికి గురౌతున్నారు. వీటి కారణంగా ఇప్పటికీ కొందరు ఉపాధ్యాయులు బదిలీ కోసం దరఖాస్తు కూడా చేసుకోలేకపోయారు.
జివో 117పేరుతో రేషనలైజేషన్‌ చేయడం, జివో 128ను పరిగణనలోకి తీసుకోకపోవడం, మ్యాపింగ్‌ సరిగా చేయకపోవడం వంటి కారణంగా అవసరం లేకపోయినా ఉపాధ్యాయులు రేషనలైజేషన్‌కు గురవుతున్నారు. బదిలీలకు చూపించే వేకెన్సీల విషయంలో అధికారుల వ్యవహారశైలి కూడా ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తోంది. బదిలీల షెడ్యూల్‌ తక్కువ వ్యవధితో హడావుడిగా రూపొందించడం, తగినంత సమయం ఇవ్వకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు షెడ్యూల్‌ను ముగించడం వల్లే సమస్యలకు కారణమని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
కౌన్సిలింగ్‌ రీషెడ్యూల్‌ చేయాలి : యుటిఎఫ్‌ డిమాండ్‌
ఈ నేపథ్యంలో బదిలీ కౌన్సిలింగ్‌ రీషెడ్యూల్‌ చేయాలని యుటిఎఫ్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకు బదిలీకి దరఖాస్తు చేసుకోనివారికి కూడా అవకాశం కల్పించి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అధికారులు ఒక్కొ జిల్లాల్లో ఒక్కొ విధంగా నిబంధనలు పాటించడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని, అస్సలు ఇన్ని సమస్యలతో బదిలీలు అవసరమా? అనే అభిప్రాయం ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతోందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బదిలీలకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తే ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. తగినంత సమయం ఇచ్చేలా బదిలీల షెడ్యూల్‌లో మార్పు చేయాలని కోరారు. 2020 బదిలీలకు ఇచ్చిన జివో 54లోని అంశాలను అమల్జేయాలని డిమాండ్‌ చేశారు. అవసరమైతే బదిలీలను కొంతకాలం వాయిదా వేసి సమస్యల పరిష్కరించిన తర్వాతే కౌన్సిలింగ్‌ చేపట్టాలన్నారు. లేదంటే పెద్దఎత్తున ఆందోళనకు చేపడుతామని హెచ్చరించారు.