Nov 05,2023 12:25

ఆడపిల్లలకు ఇవ్వాల్సింది బంగారు ఆభరణాలు కాదు.. ఆత్మవిశ్వాసం ఇవ్వాలి. అది వారిని ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది. అమ్మాయిల విషయంలో ప్రతి తల్లిదండ్రులూ కోరుకునే కోరిక ఇదే కావాలి. అయితే ఆత్మవిశ్వాసం ఆన్‌లైన్‌లో దొరికేదీ కాదు.. ఏ షాపులో అమ్మే సరుకూ కాదు. అది వారికి మనమే నేర్పాలి.. అదెలాగంటే..

స్కూల్‌ దశ నుంచే వారిని అన్నింటా పాల్గొనేలా ప్రోత్సహించాలి. పాఠశాలల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వాటిల్లో తనంతట తానే పాల్గొంటానంటే నిరభ్యంతరంగా ప్రోత్సహించండి. 'నా వల్ల కాదు..' అనే మాటలు మాట్లాడుతుంటే.. పాల్గొనేలా చేయాల్సిన బాధ్యత మనదే. అలా పాల్గొనడం వల్ల తన పట్ల తనకు ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. నలుగురిలో కలవడం, సంబంధిత కార్యక్రమాల పట్ల అవగాహన పెరుగుతుంది. క్రమంగా ఆయా విషయాల్లో నైపుణ్యం కలుగుతుంది. అలాగే ఒక బృందానికి నాయకత్వం వహించాల్సిన అవకాశం వస్తే.. ఏమాత్రం ఆలోచించకుండా నిస్సంకోచంగా బాధ్యత తీసుకోమని చెప్పాలి. అది వారి అభివృద్ధికే తోడ్పడుతుంది. తన గురించే కాకుండా బృందంలో వారి గురించీ ఆలోచించడం.. సమిష్టి విజయానికీ కృషి చేయడం.. బాధ్యతగా మెలగడం తదితర అదనపు సుగుణాలు అలవడతాయి. ఏదైనా సమస్య వస్తే పరిష్కరించడం కూడా అనివార్యమవుతుంది. తద్వారా సమస్యలొచ్చినప్పుడు ఎదుర్కొనే లక్షణం అబ్బుతుంది. విజ్ఞానం అంటే కేవలం చదువు, ర్యాంకుల మీదే ధ్యాస పెట్టేలా చేయడం కాదు. ఇలా అదనపు అంశాల్లో చొరవ, నైపుణ్యం ఉండటమే అసలైన సజ్ఞానం.

44

                                                                           దృఢత్వం..

ఆడపిల్ల అనగానే సుకుమారిగా.. పువ్వులా.. లేలేత ఆకులా కవులు వర్ణించడమే కాదు.. తల్లిదండ్రులూ అలాగే చూస్తుంటారు. అమ్మాయిలు సున్నితంగా, సుకుమారంగా ఉండాలనేది సరికాదు. అందుకే వారిని పరిగెత్తనివ్వకుండా, ఏదీ ఎక్కనివ్వకుండా.. క్రీడల్లో పాల్గొననివ్వకుండా.. ఎక్కడైనా సుదూర ప్రాంతాలకు వెళ్లాలన్నా.. 'నువ్వు ఆడపిల్లవి.. పరిగెత్తితే దెబ్బలు తగులుతాయి.. అణుకువుగా ఉండాలి.. గోడలు, చెట్లు ఎక్కకూడదు. ఆటలు కూడా కొన్నింటినే ఆడొచ్చు. అబ్బాయిల్లా అన్నింటిలో తగుదునమ్మా అంటూ ఎగరొద్దు..' అంటూ పనికిమాలినవి నూరిపోయడం మానివేయాలి. అమ్మాయిలకీ, అబ్బాయిలకీ ఎలాంటి తేడాలూ చూపకండి. అన్నింటా ప్రోత్సహించండి. మీరలా నేర్పడం వల్ల వారు మానసికంగా బలహీనులై, తద్వారా శారీరకంగానూ తాము చాలా సున్నితమని ఆగిపోతారు. అందుకే మనమే మారాలి. వారిని మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారుచేయాలి. ఆడపిల్లకి దృఢత్వమే గొప్ప ధైర్యం.
 

                                                                               స్వతంత్రంగా..

ఆడపిల్లల్ని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోనివ్వం. ఏదైనా చెప్పి చేయాలని ఆంక్షలు పెడుతుంటాం. వాళ్లు ఏదైనా సరైన నిర్ణయం తీసుకుంటారనీ, ఆ అవకాశం ఇస్తేకదా మనకు తెలిసేదీ. వాళ్లనే సొంతగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఇవ్వండి. వాళ్లూ ఆలోచిస్తారు. స్వతంత్రంగా ఆలోచించడం వల్ల నిర్ణయాలు తీసుకోవడం అలవాటవుతుంది. మొదట్లో మనం కూడా సొంత నిర్ణయం తీసుకోవడానికి కొన్ని సూచనలు చేయొచ్చు. అలా సహాయపడేలా ఉండాలేగానీ.. అన్నీ మనమే నిర్దేశించకూడదు. వాళ్లకూ బాధ్యతలు అప్పగించాలి. కుటుంబంలో తీసుకునే నిర్ణయాల్లో కూడా వాళ్లని భాగస్వామ్యం చేయాలి. సహజంగా మన పురుషాధిక్య సమాజంలో ఇంట్లో పురుషులే నిర్ణయాలు చేసేస్తుంటారు. మహిళల్ని సంప్రదించే అలవాటుండదు. ఈ తరం నుంచైనా ఆ మార్పు తీసుకొద్దాం. వాళ్లనూ భాగస్వాముల్ని చేద్దాం. దీనివల్ల వాళ్లు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు, సవాళ్లు ఎదురైనా ఎదుర్కోగల సామర్థ్యం కలిగినవాళ్లగా ఎదుగుతారు. ధైర్యంగా ఎదుర్కొంటారు కూడా.
 

                                                                                 ఆర్థికంగానూ..

పిల్లల్ని ఆర్థికంగానూ ఆలోచించేలా చేయాలి. వాళ్ల ఖర్చులకు డబ్బులు ఇవ్వండి. దీనివల్ల వేటికి ఎంత ఖర్చు పెట్టాలో అవగాహన కలుగుతుంది. ఏది కావాలంటే అది కొనివ్వడం వల్ల డబ్బు విలువ తెలియదు. పెరుగుతున్న ఖర్చుల పట్ల కూడా వాళ్లకి అవగాహన అవసరం. డబ్బు ఖర్చు పెట్టడంలో క్రమశిక్షణ కూడా అలవాటవుతుంది. అంతేకాదు ఏదైనా పార్టుటైమ్‌ జాబ్‌ చేయాలన్న ఆలోచన కూడా వస్తుంది. తామూ ఆర్థికంగా భాగస్వాములు అవ్వాలని అనుకుంటారు. ఫలితంగా వాళ్ల భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలో ప్రణాళిక వేసుకునేలా ఎదుగుతారు. స్నేహితులతో ఎక్కడికి వెళ్తున్నదీ, ఎందుకు వెళ్తున్నదీ మీతో వాళ్లంత వాళ్లే పంచుకునే అవకాశం ఇవ్వాలి. అలాంటప్పుడే వాళ్లు మీకు తెలియకుండా వెళ్లే ఆలోచనలు మానుకుంటారు. మనతో చర్చించడం వల్ల మంచీ చెడూ తెలుసుకోగలుగుతారు. మనం కూడా అంతవరకే జోక్యం చేసుకోవాలి తప్ప, నియంత్రించకూడదు. మంచి స్నేహాలను ప్రోత్సహించాలి.