Oct 11,2022 07:11

         వధూవరులకు వివాహ ప్రోత్సాహకాలు అందించే కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన బడుగు, బలహీన, పేద తరగతులకు కాస్తంత ఊరట. ఈ రోజుల్లో ఆడపిల్లలకు పెళ్లి చేయడం పేద కుటుంబాలకు తలకుమించిన భారం. సర్కారు ఇస్తామంటున్న ఆర్థిక సహాయం వేడినీళ్లకు చన్నీళ్లు తోడైనంత ఉపశమనం. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, విభిన్న ప్రతిభావంతులు, భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు ఈ అక్టోబర్‌ 1 నుంచి పెళ్లి ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది సర్కారు. బాలికల్లో విద్యాభివృద్ధి, బాల్య వివాహాల అంతం, కులాంతర పెళ్లిళ్ల ప్రోత్సాహం స్కీంల లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్‌ ఉద్ఘాటించారు. గత టిడిపి ప్రభుత్వం కొన్ని వర్గాలకు, అదీ కొందరికి, అరకొర సహాయం చేసిందని, తాము సాయాన్ని పెంచామన్నారు. 2018-19లో గత సర్కారు పథకాలను నిలిపివేయగా, ఆ సంవత్సరం అర్హత సాధించిన 17 వేల పైచిలుకు వధూవరులకు తమ ప్రభుత్వం ప్రోత్సాహకాలిస్తోందని వివరించారు. అయితే 'కళ్యాణమస్తు' లబ్ధి పొందాలంటే వధువు తప్పనిసరిగా పదవ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలని ప్రభుత్వం విధించిన షరతు ఎంతో మంది ఆడపిల్లల తల్లిదండ్రులకు ఊహించని షాక్‌. స్కీం పెట్టినట్లే పెట్టి చదువు నిబంధన జోడించడం నోటి దాకా ముద్ద తీసుకొచ్చి వెనక్కి లాగేయడం వంటిది.
        టెన్త్‌ నిబంధన ఎంత అసంబద్ధమో సర్కారీ గణాంకాలే చెబుతాయి. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం ఎ.పి. అక్షరాస్యత 67.35 శాతం. ఆలిండియా సగటు 72.98 శాతం కంటే తక్కువే. పురుషుల్లో అక్షరాస్యత 80.90 శాతం కాగా మహిళల్లో అక్షరాస్యత 64.60 శాతం. పురుషులు, స్త్రీల అక్షరాస్యత నడుమ భారీ వ్యత్యాసం నెలకొంది. ఇక ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలలో అక్షరాస్యత, ఆ మహిళల చదువు ఇంకా ఇంకా తక్కువ. అమ్మవడి, నాడు-నేడు ఉన్నా డ్రాపవుట్స్‌ పెద్దగా తగ్గింది లేదు. నిరుడు ఒకటి నుంచి టెన్త్‌ లోపు బడి మానేసిన పిల్లలు 4.38 శాతం. బాలికల డ్రాపవుట్స్‌ 3.37 శాతం. బడిలో చేరుతున్న పిల్లల్లో లక్షల మంది మధ్యలోనే చదువు చాలిస్తున్నారు. ఎనిమిది నుంచి టెన్త్‌ మధ్య గిరిజనుల్లో 70 శాతం డ్రాపవుట్స్‌ ఉంటున్నారని సామాజిక సంస్థలు ఘోషిస్తున్నాయి. కుటుంబాలు గడవక బడి మానేసి ఉపాధి పనులకు పోతున్నారు. బాల కార్మికులుగా మారుతున్నారు. కరోనా వలన ఈ రెండేళ్లలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తమైంది. డ్రాపవుట్స్‌ మరింతగా పెరిగారు. ఈ పరిస్థితులను విస్మరించి కళ్యామమస్తు, షాదీ తోఫా పథకాలకు వధువు టెన్త్‌ పాసై తీరాలని ప్రభుత్వం నిబంధన విధించడం లబ్ధిదారులను పథకాలకు దూరం చేయడమే.
            సంక్షేమ పథకాలపై ఇల్లెక్కి హోరెత్తించడం అమల్లో ఇంటి గడపలను సైతం దాటించకపోవడం ప్రభుత్వానికి అలవాటై పోయింది. అందుకు ఇటీవలికాలంలో ప్రభుత్వం ఎంచుకున్న విధానాలే సాక్ష్యం. ఏ పథకం రావాలన్నా కరెంట్‌ బిల్లు 300 యూనిట్లు దాటకూడదన్న నిబంధన ఎంతో మందిని పథకాలకు దూరం చేస్తోంది. ఫోర్‌ వీలర్‌ వెహికిల్స్‌ ఉండకూడదు. వాషింగ్‌ మిషన్‌, డాబా ఇల్లు ఉంటే తెల్ల రేషన్‌ కార్డులు కట్‌ చేస్తున్నారు. ప్రభుత్వ డిపార్టుమెంట్లలో ఔట్‌సోర్స్‌, కాంట్రాక్టు కార్మికులు, అంగన్‌వాడీ, ఆశాల వంటి స్కీం వర్కర్లను తెల్ల రేషన్‌కార్డులకు అనర్హులను చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీతగా అభివర్ణించే ప్రభుత్వం, లబ్ధిదారులను కుదించేందుకు కఠిన షరతులు పెట్టడం సంక్షేమం అనిపించుకోదు. వివాహ ప్రోత్సాహకాల పథకాలను అధికారంలోకొచ్చి మూడేళ్లు దాటాక అమలు చేస్తున్నారు. సాయానికి టెన్త్‌ అనడం సహేతుకం అనిపించుకోదు. వలస కార్మికులు, రోజువారీ కూలీలు పిల్లలను చదివించుకోవడం తక్కువ. చదువు షరతు లేకుండా పేదలందరికీ పథకాలు వర్తింపజేయాలి. లబ్ధిదారుల వార్షిక ఆదాయాన్ని రూ.5 లక్షలకు పెంచాలి. ప్రభుత్వం అలా చేయకపోతే పథకం అసలు లక్ష్యం సాకారం కాదు.