Sep 08,2023 07:01

మోడీ, ఆయన అనుచరులు వెనకేసుకొస్తున్నది ఈ పనికిమాలిన, కాలం చెల్లిన ధర్మాన్నే. 75 సంవత్సరాల క్రితమే, మన దేశ ప్రజలు తమకు ఏ ధర్మం కావాలో స్పష్టంగానే ఎంచుకున్నారు. సనాతన ధర్మాన్ని, కుల, మత, లైంగిక, వివక్షత అనాగరికం అని తేల్చి చెప్పేశారు. సతీ సహగమనం ఇప్పుడు నేరం. అంటరానితనాన్ని పాటిస్తే అది నేరం. బాల్య వివాహాలు నిషిద్ధం, స్త్రీల పట్ల అగౌరవంగా వ్యవహరిస్తే అది నేరమే. అంటే, స్వతంత్ర భారతదేశ ప్రజలు వివక్షతాపూర్వకమైన ఆ సనాతన ధర్మం తమకు అవసరం లేదని తేల్చి చెప్పేశారు. మరి మోడీ సైన్యానికి ఎందుకు సనాతన ధర్మం పట్ల ఆసక్తి ?

         'సనాతన ధర్మాన్ని కాపాడండి' అని స్వయానా ప్రధాని పిలుపునిచ్చారు. మన తెెలుగు సినీ హీరోల కుటుంబ పరంపరలోని ఒక మగధీరుడు ఆ పిలుపుని అందుకుని సనాతన ధర్మ పరిరక్షణ చేయవలసిందిగా తెలుగు ప్రజలందరినీ కోరారు. మరోపక్క సనాతన ధర్మం పేర సాగుతున్న సామాజిక దురాచారాలను తుదముట్టించాలని ఉదయనిధి స్టాలిన్‌ పిలుపునిచ్చారు.
           భేతాళ కథల్లో విక్రమార్కుడు భేతాళుడి ప్రశ్నకు సమాధానం తెలిసీ చెప్పకపోతే అతడి తల వెయ్యి ముక్కలౌతుందని భేతాళుడు షరతు పెట్టాడు. తనకు సమాధానం నిజంగానే తెలియదు గనక విక్రమార్కుడు మౌనం వహించాడు. తన తల ముక్కలు కాకుండా చూసుకున్నాడు. కాని మన రాష్ట్ర ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రులిద్దరూ కొత్త రకం విమ్రార్కులు. హిందూత్వ- కార్పొరేట్‌ భేతాళుడిని ఇద్దరూ మోస్తూనే వున్నారు. ఆ మోతకి అధికారంలో ఉండడం, లేకపోవడం అనేదానితో నిమిత్తం లేదు. ఈ సనాతన ధర్మం విషయం ఆ ఇద్దరికీ తెలుసు. తెలుసును గనుక సమాధానం చెప్పేస్తే ? అమ్మో ! ఏమన్నా ఉందా ? తల ఏమౌతుంది ? అందుకే సమాధానం తెలిసీ మౌనం వహిస్తున్నారు. సినిమా హీరోలు అలా కాదు. మాట్లాడితేనే, అది కూడా ఒకానొక విధంగా మాట్లాడితేనే, ఒకానొక తరహా కథలున్న సినిమాల్లో నటిస్తేనే కదా వాళ్ళకి జాతీయ అవార్డులూ గట్రా వచ్చేది ?
          ఈ తగువెందుకు, సూటిగా సనాతనం గురించి చెప్పొచ్చు కదా అని మీరు విసుక్కోకండి. మోడీ ప్రభుత్వం దేశానికి గాని, ప్రజలకు గాని ఏ మాత్రమూ ఉపయోగం లేని అనవసర వివాదాలను రేపడంలో ఆల్‌టైం ప్రపంచ రికార్డు సృష్టించింది. అందులో తాజా వివాదాలే ఇండియా-భారత్‌ అన్న రెండు పేర్లలో ఏది గొప్ప? అన్న తగువు. పేరులోనేమున్నది? గులాబీని గులాబీ అన్నా, రోజా అన్నా, లేకపోతే ఆ నాడు భీముడు తెచ్చిన సౌగంధికాపుష్పం అన్నా దాని వాసన ఒకే విధంగా ఉంటుంది తప్ప మారిపోదు అని షేక్‌స్పియర్‌ అంతటివాడు అన్నాడు. ఇండియా అన్నా, భారత్‌ అన్నా అది మన దేశమే. దానికి మూలకందం మన ప్రజల ఐక్యత. ఆ ఐక్యతకే ఏదో ఒక రూపంలో చిచ్చు పెడుతూ, దేశ పునాదినే నాశనం చేస్తూ, మరోపక్క దేశం గురించి వాపోయే నయవంచనలో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి కూటమి స్పెషలిస్టులు.
              ఇప్పుడు సనాతన ధర్మం గురించి వద్దాం. సమాజాన్ని అభ్యుదయం వైపు నడిపించేదే ధర్మం. ప్రజల మధ్య ఐక్యత, మానవత్వం, అభిమానం పెంచే విధంగా, అదే సమయంలో ప్రజల దైనందిన జీవితంలో జీవన ప్రమాణాలు అంతకంతకూ మెరుగుపడేలా, అసమానతలు తగ్గేలా, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం మరింత బలపడేలా దేశాన్ని నడిపించడం ప్రభుత్వ ధర్మం. బుద్ధుడు పశువులని వృధాగా యాగాల్లో చంపొద్దని, వాటి శక్తిని కూడా ఉపయోగించి వ్యవసాయాన్ని విస్తరింపజేయాలని ఆనాటి సమాజాన్ని ముందుకు నడిపించే ధర్మాన్ని బోధించాడు కాబట్టి బౌద్ధం మన దేశంలో దాదాపు 800 సంవత్సరాలపాటు ప్రధాన ధర్మంగా వర్ధిల్లింది. అదే సనాతన ధర్మం గురించి చూద్దాం. చాలా కాలం వరకూ భూమిని నాగలితో దున్నడం అంటే మహా పాపం అని వ్యవసాయాభివృద్ధిని వ్యతిరేకించింది. అందుకే ఆ సనాతన కాలంలోనే సనాతన ధర్మాన్ని తిరస్కరించి ప్రజలు బౌద్ధాన్ని ఆదరించారు. పాలకవర్గాల, ఆధిపత్య కులాల దయ వలన సనాత ధర్మం ఇంకా బతికుంది గాని, ప్రజలకే పూర్తిగా వదిలిపెడితే ఎప్పుడో తేలిపోయేది.
            సనాతన ధర్మం అన్నది బ్రాహ్మణాధిపత్యవాదులు రాసిన ధర్మ శాస్త్రాల్లో ఉంది. వాటన్నింటిలోకీ మనుధర్మ శాస్త్రం ప్రధానమైనది. వివక్షతతో నిండివున్న కుల వ్యవస్థను ఆ మను ధర్మశాస్త్రం బలపరిచింది. రాజ్యాంగం కుల వివక్షతను చట్టవిరుద్ధం అని ప్రకటించింది. దానికి అనుగుణంగా చాలా చట్టాలు ఉన్నాయి కూడా. సనాతనవాదులు ఆనాడు ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. అప్పుడు ఆరెస్సెస్‌ కూడా రాజ్యాంగాన్ని అంగీరించలేదు. మనుధర్మ శాస్త్రం ఉండగా వేరే రాజ్యాంగం ఎందుకని యాగీ చేసింది. మనువాదం అన్ని దశల్లోనూ స్త్రీ పురుషుడికి లొంగి వుండాల్సిందే అని చెప్తుంది. అమ్మాయికి యుక్త వయస్సు రాకుండానే పెళ్ళి అయిపోవాలని సనాతనధర్మం చెప్తుంది. అందువల్లనే ఇప్పటికీ మనదేశంలో ఇంకా బాల్య వివాహాలు జరుగుతూనే వున్నాయి. సతీ సహగమనం పతివ్రతాధర్మం అని సనాతన (అ)ధర్మం చెప్పింది. శూద్రులు చదువుకోకూడదు అని మనువు శాసించాడు. పొరపాటున చదివితే శంబూకుడికి పట్టిన గతే పడుతుంది సుమా అని రామకథ హెచ్చరించింది కూడా. అంటరానితనాన్ని ఆచారంగా పాటించి తీరాలని మనుధర్మం చెప్తోంది.
           మోడీ, ఆయన అనుచరులు వెనకేసుకొస్తున్నది ఈ పనికిమాలిన, కాలం చెల్లిన ధర్మాన్నే. 75 సంవత్సరాల క్రితమే, మన దేశ ప్రజలు తమకు ఏ ధర్మం కావాలో స్పష్టంగానే ఎంచుకున్నారు. సనాతన ధర్మాన్ని, కుల, మత, లైంగిక, వివక్షత అనాగరికం అని తేల్చి చెప్పేశారు. సతీ సహగమనం ఇప్పుడు నేరం. అంటరానితనాన్ని పాటిస్తే అది నేరం. బాల్య వివాహాలు నిషిద్ధం, స్త్రీల పట్ల అగౌరవంగా వ్యవహరిస్తే అది నేరమే. అంటే, స్వతంత్ర భారతదేశ ప్రజలు వివక్షతాపూర్వకమైన ఆ సనాతన ధర్మం తమకు అవసరం లేదని తేల్చి చెప్పేశారు. మరి మోడీ సైన్యానికి ఎందుకు సనాతన ధర్మం పట్ల ఆసక్తి? గతకాలపు ఊహాజనిత, భ్రమాన్విత, బూటక వైభవం గురించి గొప్పగా చెప్పుకుంటూ, అటువైపే చూడమని (రెండో వైపు చూడకూ! చూస్తే తట్టుకోలేవూ! అని నటసార్వభౌమ జూ. అన్నది ఇందుకే) వర్తమాన సమాజంలో ప్రభుత్వ ఘోర వైఫల్యాల వైపు ఆ ప్రజలు చూడకుండా చేయడానికే.
          ఒక వ్యాపార ప్రకటనలో ''ఈ దేశంలో ఏది నడిచినా, నడవకపోయినా. ఫాగ్‌ మాత్రం నడుస్తూనే వుంటుంది'' అని అంటాడు (ఫాగ్‌ అనేది ఒక బాడీ స్ప్రే పేరు). ఫాగ్‌ అంటే పొగమంచు అని అర్ధం. ఆ విధంగా చూసుకుంటే ఆ ప్రకటన అతికినట్టు మన మోడీ పాలనకు సరిపోతుంది. విద్వేష రాజకీయాల, వృధా వివాదాల పొగమంచు దేశాన్నంతటినీ ఆవరించినందువలన ప్రజలకి మరేదీ కనిపించడం లేదు.
           స్వామి వివేకానందుడు ఆకలిగొన్న కడుపు ఈ దేశంలో ఒక్కటి ఉన్నా సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని స్పష్టంగా చెప్పాడు. జనాలు ఆకలితో ఒక పక్క ఛస్తూంటే వాళ్ళ గోడు పట్టించుకోకుండా గోమాత రక్షణ అంటూ బయలుదేరినవాళ్ళని ముక్కచీవాట్లు పెట్డాడు. ఆయన కట్టిన కాషాయానికి, ప్రభుత్వ కాషాయానికి ఎక్కడైనా పోలిక ఉందా? వివేకానందుడు మానవతను మించిన ధర్మం లేదన్నాడు. మానవతనే మరిచి గుజరాత్‌, మణిపూర్‌ తరహా మారణహోమాలకు ఆజ్యం పోస్తున్న మోడీ సర్కార్‌కి ఆ మానవత్వం లేశమైనా ఉందా?
సమాజంలో ఎల్లవేళలా ఒక సంఘర్షణ ఉంటుంది. ఆ ఘర్షణలో సమాజాన్ని ముందుకు నడిపించే శక్తులు ఒకవైపు చేరుతాయి. సమాజాన్ని వెనక్కి నెట్టి అభ్యుదయాన్ని అడ్డుకునే శక్తులు ఇంకోవైపు చేరతాయి. ఈ రెండింటి నడుమ జరిగే సంఘర్షణలో మనం ఏ వైపున ఉంటామో తేల్చుకోవాలి. ''ఆ గట్టునుంటావా? ఈ గట్టుకొస్తావా?'' అని మనల్ని అడిగిన హీరో గారు తాను సనాతన గట్టుమీదే ఉంటానని ప్రకటించేశాడు. అంటే సినీ జీవితంలో హీరో పాత్రల్ని పోషించినా వాస్తవ సమాజ జీవితంలో జీరో అవడానికే సిద్ధపడుతున్నాడు. పోనీయండి, అది అతగాడిష్టం. కాని మనం ఎటువైపున ఉంటామో మనమంతా తేల్చుకోవాలి కదా. సనాతనమా ? అభ్యుదయమా? ఎటువైపు?
           ''మంచి గతమున కొంచెమేనోరు మందగించక ముందు అడుగేరు'' అని యుగకర్త గురజాడ ఎప్పుడో చెప్పేశాడు. నిజమే కదా, వెనక్కి చూస్తూ చూస్తూ నడవడం మొదలెడితే గ్యారంటీగా బోర్లా పడతాం. అందుకే గురజాడ చెప్పినట్టు ముందుకే అడుగేద్దాం.
నవయుగ కవిచక్రవర్తి జాషువా ఏమన్నాడు?'' కులమతాలు సృష్టించిన పంజరాన కట్టువడను, విశ్వ నరుడ నేను'' అన్నాడు. మనదీ ఆ మాటే కావాలి.
         మహాకవి శ్రీశ్రీ అవతలిగట్టున ఉన్నవారి గురించి ఏం చెప్పాడు? ''తృప్తిగా చచ్చిపోతారు మీరు, ప్రపంచం మిమ్మల్ని మరిచిపోతుంది'' మరి ఇవతల గట్టునున్నవాళ్ళో? ''మేం ముందు నడుస్తాం. ప్రపంచం మా వెంట నడుస్తుంది'' అన్నాడు.
అందుకే సనాతన పంజరాలను ఛేదించి, మందగించ కుండా ముందడుగేస్తూ, కొత్త ప్రపంచాన్ని నిర్మించే మార్గాన నడుద్దాం, ప్రజలను నడిపిద్దాం.
                                                         మానవతా ధర్మో రక్షతి రక్షిత:

ఎం.వి.ఎస్‌. శర్మ