Nov 27,2022 07:06

        'అక్షరంబు తల్లి యఖిలవిద్యల కెన్న/ నక్షరంబు లోకరక్షకంబు/ అక్షరంబులేని యబలున కెందును/ భిక్ష పుట్టబోదు పృథ్విలోన' అని ఒక చాటువు చెబుతుంది. జీవన వికాసానికి, పరిపూర్ణతకు అక్షరం ఓ గీటురాయి. అక్షరాస్యత మానవ ప్రగతికి దిక్సూచి. 'మనిషి జీవించడానికి ఆహారం ఎంత అవసరమో... మానవ ప్రగతికి చదువు కూడా అంతే అవసరమ'ని యునెస్కో నిర్వచించింది. ఏ దేశమైనా, రాష్ట్రమైనా ప్రగతిపథంలో ఉందంటే అక్కడి అభివృద్ధికి దోహదపడే ముఖ్యమైన అంశాలలో ప్రధానమైనది అక్షరాస్యత. 'ఒక సంస్కృతిని నాశనం చేయడానికి పుస్తకాలను కాల్చే పనిలేదు...జనాన్ని చదవకుండా చూడండి చాలు' అంటాడు అమెరికన్‌ రచయిత రే బ్రాడ్బరీ. ఏ దేశాభివృద్ధి అయినా ఆ దేశ ప్రజల అక్షరాస్యతపైనే ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడంతా టెక్నాలజీ కాలం. రోజువారీ జీవితంలో డిజిటల్‌ అవసరాలు కూడా కలగలిసిపోయాయి. కంప్యూటర్లు మానవ జీవితంలో ముఖ్యమైన భాగమయ్యాయి. ఈ క్రమంలోనే 'కంప్యూటర్‌ అక్షరాస్యత' అవసరం పెరిగింది.
       ప్రపంచవ్యాప్తంగా బాలబాలికలు, మహిళలలో డిజిటల్‌ అక్షరాస్యతను ప్రోత్సహించడానికి డిసెంబర్‌ 2వ తేదీని 'కంప్యూటర్‌ అక్షరాస్యత దినోత్సవం'గా పాటిస్తున్నారు. ప్రపంచం డిజిటల్‌ భవిష్యత్తు వైపు కదులుతున్నప్పటికీ, సమాజంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ కంప్యూటర్లు, ఇంటర్నెట్‌కు దూరంగానే ఉన్నాయి. చైనా, జపాన్‌ వంటి దేశాలు 6జి వైపు అడుగులు వేస్తోంటే, మనం ఇంకా 4జీ తోనే కుస్తీ పడుతున్నాం. నేటికీ కోట్లాది మంది ప్రజలకు కనీసం వారి పేరు చదివే, రాసుకోగలిగే చదువు కూడా లేదని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. కానీ సాంకేతిక విజ్ఞానం దూసుకుపోతూనే వుంది. ఇప్పుడు సాంకేతికత తాకని రంగమంటూ లేదు. రోజువారీ పనులు కూడా ఈ సాంకేతికతతో ముడిపడిపోయాయి. చదువులు, ఉద్యోగాల్లోనూ మార్పులొచ్చాయి. కంప్యూటర్‌ అక్షరాస్యత అంతా ఇంటర్నెట్‌ చుట్టూనే తిరుగుతోంది. ఇదొక సమాచార సంద్రం. ఇందులో నిజాలు, అబద్ధాలు, అపోహలు... అన్నీ ఉంటాయి. ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అనే విచక్షణకు కంప్యూటర్‌ అక్షరాస్యత చాలా ముఖ్యం. దీనిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. అవసరంలేని విషయాలను సెర్చ్‌ చేయడం, అనవసరమైన లింక్‌లపై క్లిక్‌ చేయడం వంటివి డిజిటల్‌ ప్రమాదాలకు తావిస్తున్నాయి. ఈ ప్రమాదాల నుంచి బయట పడాలంటే...చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికీ కంప్యూటర్‌ అక్షరాస్యత అవసరం. విద్యార్థులు, ఉద్యోగార్థులకైతే కంప్యూటర్‌ విద్య తప్పనిసరి. '2025 చివరికి ప్రపంచవ్యాప్తంగా 8.5 కోట్ల ఉద్యోగాలు మనుషుల నుంచి యంత్రాల చేతుల్లోకి వెళ్లనున్నాయి. అదే సమయంలో 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలు పుట్టుకురానున్నాయి' అని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ అంచనా. దీనికి డిజిటల్‌ నైపుణ్యం అవసరం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
           అయితే, ప్రాథమిక అవసరంగా మారిన కంప్యూటర్‌ విద్యను ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వుంది. స్కూళ్లు, కాలేజీల కంప్యూటర్‌ ల్యాబ్‌లతో పాటు ప్రభుత్వ ఆఫీసులన్నీ మైక్రోసాఫ్ట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌... విండోస్‌తోనే నిండిపోయి వున్నాయి. సాధారణ ప్రజలకు, పేద విద్యార్థులకు ఈ సాఫ్ట్‌వేర్లు అందని ద్రాక్షయే. అంతేకాదు...ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్‌ వినియోగదారులలో పురుషులే ఎక్కువని, మహిళలు, పిల్లలు చాలా తక్కువ సంఖ్యలో వున్నారని ఒక సర్వే వెల్లడించింది. భారత్‌లో 53.9 శాతం మహిళలకు మొబైల్‌ ఫోన్లు ఉన్నప్పటికీ... డిజిటల్‌ పేమెంట్స్‌ చేస్తున్నవారు 22.2 శాతం మాత్రమేనని దేశవ్యాప్తంగా చేపట్టిన పలు సర్వేలు చెబుతున్నాయి. దాదాపు 135 కోట్ల మంది జనాభా వున్న భారత్‌లో ప్రస్తుతం 64.6 కోట్ల మంది మాత్రమే ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారు. కంప్యూటర్లను, ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవాలంటే... ప్రతి ఒక్కరికీ ప్రాథమిక విద్య, డిజిటల్‌ అక్షరాస్యత అవసరం. లినక్స్‌ వంటి ఉచిత ఆపరేటింగ్‌ సిస్టమ్‌లు, ఉచిత సాఫ్ట్‌వేర్‌లను ప్రభుత్వాలు ప్రోత్సహించడం లేదు. వీటిని ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ, కాలేజీల్లోనూ ప్రవేశపెట్టడం ద్వారా పాఠశాల స్థాయి నుంచే తక్కువ ఖర్చుతో కంప్యూటర్‌ విద్యను అందించే అవకాశం వుంది. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి.