
ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి) ఆవశ్యకతపై మరోసారి అభిప్రాయాలు తెలియ చేయాల్సిందిగా కోరుతూ ... లా కమిషన్ గత నెల 14వ తేదీన పబ్లిక్ నోటీసు జారీ చేసింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ... దేశవ్యాప్తంగా కోటికి పైగా సభ్యత్వం కలిగిన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) తరపున ... లా కమిషన్ సభ్య కార్యదర్శికి మెమోరాండం అందించాం. - పి.కె.శ్రీమతి, మరియం ధావలె, (ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు), - కీర్తి సింగ్ (న్యాయ సలహాదారు)
ఈ ప్రభుత్వం లింగ న్యాయానికి ఎన్నడూ ప్రాధాన్యతనివ్వలేదు. మహిళల కోసం ఒక్క సంస్కరణను కూడా తీసుకురాలేదు. 'హిందూ పర్సనల్ లా' లో కొన్ని సంస్కరణలు తీసుకురావాలంటూ అనేక డిమాండ్లు వచ్చినా ఈ చట్టాలను మార్చడానికి, ఈ మహిళలకు సమాన చట్టాలు తీసుకురావడానికి ప్రభుత్వం ఒక్క చర్య కూడా తీసుకోలేదు. కేవలం ప్రస్తుతమున్న 'ముస్లిం లా' ని, రాజ్యాంగంలో ఆరవ షెడ్యూల్ కిందకు వచ్చే గిరిజన ప్రాంతాలకు సంబంధించిన చట్టాలను లేకుండా చేసే ప్రయత్నమే ఈ యుసిసి అని బలంగా అభిప్రాయపడుతున్నాం.
అన్ని మతాలకు చెందిన కమ్యూనిటీల్లోనూ పితృస్వామ్య భావజాలంతో కూడిన, వివక్షాపూరితమైన పర్సనల్ చట్టాల భారంతో శతాబ్దాల తరబడి మన దేశంలో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ఏకరీతి (యూనిఫామ్) చట్టాలు తీసుకువచ్చినంత మాత్రాన మహిళలు సమాన హక్కులు పొందలేరు, అలాగే ఈ చట్టాల్లో వివిధ స్థాయిల్లో అంతర్లీనంగా వున్న వివక్షను రూపుమాపలేరు. అందువల్ల యుసిసికి మేం అనుకూలం కాదు. భారతదేశంలో ఈనాడు ఏకరూపత అన్నది అవసరమూ కాదు, వాంఛనీయం కాదు.
గత 40 ఏళ్ళుగా పర్సనల్ లాకి సంబంధించిన అనేక సమస్యలతో ఐద్వా పోరాడుతూ వచ్చింది. ప్రతి రాష్ట్రంలోనూ వివిధ లీగల్ సెల్స్‌లో మహిళల పర్సనల్ లా కేసులను ఎదుర్కొనడంలో క్రియాశీలంగా పనిచేస్తూ వచ్చాం. ప్రతి పర్సనల్ లా లోనూ సంస్కరణలు తీసుకురావడానికి, సమానత్వం తీసుకువచ్చేందుకు, వివక్షను రద్దు చేయడానికి ఐద్వా స్పష్టంగా, నిర్ద్వంద్వంగా కట్టుబడి వుంది. ఉదాహరణకు, ఇతర సంస్కరణలతో పాటూ, హిందూ వారసత్వ చట్టంలో, క్రైస్తవులకు సంబంధించి భారత విడాకుల చట్టంలో సంస్కరణలు తీసుకురావడానికి చురుకుగా కృషి చేస్తోంది. అలాగే మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులివ్వడానికి కూడా వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. వివిధ కమ్యూనిటీల సభ్యులతో ముఖ్యంగా ఈ కమ్యూనిటీలకు చెందిన మహిళలతో సంప్రదింపులు జరపడంతో పాటూ ఈ సంస్కరణల యత్నాలను కొనసాగించాం. పర్సనల్ చట్టాల్లో అంతరం వున్నపుడు లేదా మహిళలకు న్యాయం చేయడానికి ఇటువంటి చట్టాలు తీసుకురావాల్సిన అవసరమున్నపుడు ప్రతి కమ్యూనిటీలోనూ సంస్కరణలకు మద్దతిస్తూ, ఉమ్మడి చట్టాలు తీసుకురావడానికి రెండంచెల వ్యూహాన్ని ఐద్వా పాటిస్తోంది. ఆ రకంగా, వరకట్న చట్టాల్లో, బాల్య వివాహాల నిరోధక చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టంలో, గృహ హింస నిరోధక చట్టంలో సంస్కరణలకు మద్దతిస్తూ వాటికోసం సాగిన పోరాటాల్లో ఐద్వా పాల్గొంది.
యుసిసిపై 21వ లా కమిషన్ తన అభిప్రాయాలను విస్పష్టంగా వ్యక్తం చేసినా కూడా మళ్ళీ 22వ లా కమిషన్ ఈ అంశాన్ని పరిశీలించడం ఆశ్చర్యకరంగా వుంది. గణనీయమైన రీతిలో సమానత్వంతో పాటూ మహిళలకు ప్రాథమిక హక్కులతో పర్సనల్ లాని కలిపేందుకు యుసిసి అవసరం కాదని లేదా వాంఛనీయం కూడా కాదన్న మా అభిప్రాయాన్ని 2018లో 21వ లా కమిషన్ కూడా అంగీకరించింది. ఈ అంశంపై 21వ లా కమిషన్ విస్తృతమైన సాక్ష్యాధారాలను తీసుకుంది. విస్తృత పరిశోధన చేపట్టింది. అనేక సెమినార్లలో, చర్చలు, సంప్రదింపుల్లో పాల్గొంది. ఆ తర్వాత యుసిసికి సమయం ఆసన్నమవలేదంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది.
లా కమిషన్ ఏం చేయాలనే దానిపై స్పష్టమైన ప్రణాళిక లేకుండా, కేవలం అస్పష్టమైన పదాలతో జారీ చేసిన నోటీసు ద్వారా ఈ ప్రక్రియనంతటినీ మళ్లీ చేపట్టాల్సిన అవసరం వుందని మేము అనుకోవడం లేదు. పైగా, కేవలం నెల రోజుల పరిమిత కాలంలో అభిప్రాయాలు తెలియచేయాలని కోరడం ద్వారా, వివిధ సంస్థలు, లేదా ఈ అంశంపై పని చేసే పలువురు వ్యక్తుల నుండి అభిప్రాయాలు కోరడానికి సీరియస్‌గా ప్రయత్నం జరగడం లేదు. వివిధ బిజెపి పాలిత రాష్ట్రాలు, ప్రధాని ఇటీవల యుసిసికి అనుకూలంగా మాట్లాడినందున యుసిసి కావాలని ఏదో ఒక రకంగా సిపార్సు చేయాలన్నది లా కమిషన్ ఎజెండాగా వున్నట్లు కనిపిస్తోంది. వివిధ మతపరమైన సంస్థలను తమ అభిప్రాయాలు తెలియచేయాలంటూ ప్రత్యేకంగా లా కమిషన్ కోరడం విస్మయానికి గురి చేసింది. మహిళల హక్కులు, సమానత్వానికి సంబంధించిన అంశం యుసిసి, అటువంటపుడు ఈ అంశాలపై పనిచేస్తున్న వారందరికీ, అలాగే ఆ యా కమ్యూనిటీల్లోని మహిళలకు లా కమిషన్ ప్రాధాన్యతనివ్వాలి. అందువల్ల, యుసిసి తీసుకురావడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ అంశాన్ని పున:పరిశీలించే ప్రస్తుత ప్రక్రియ...అనేక మహిళా సంఘాలు, గ్రూపులు, మైనారిటీ కమ్యూనిటీల ఆకాంక్షలకు పూర్తి విరుద్ధంగా వుంది. ఉత్తరాఖండ్ వంటి బిజెపి పాలిత రాష్ట్రాలు చురుకుగా ఈ ఎజెండాను అనుసరిస్తున్నాయన్నది స్పష్టమైంది. ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలన్న తమ ఉద్దేశ్యాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి బహిరంగంగానే ప్రకటించారు కూడా.
ఈ ప్రభుత్వం లింగ న్యాయానికి ఎన్నడూ ప్రాధాన్యతనివ్వలేదు. మహిళల కోసం ఒక్క సంస్కరణను కూడా తీసుకురాలేదు. హిందూ పర్సనల్ లాల్లో కొన్ని సంస్కరణలు తీసుకురావాలంటూ అనేక డిమాండ్లు వచ్చినా ఈ చట్టాలను మార్చడానికి, ఈ మహిళలకు సమాన చట్టాలు తీసుకురావడానికి ప్రభుత్వం ఒక్క చర్య కూడా తీసుకోలేదు.
కేవలం ప్రస్తుతమున్న ముస్లిం లాని, రాజ్యాంగంలో ఆరవ షెడ్యూల్ కిందకు వచ్చే గిరిజన ప్రాంతాలకు సంబంధించిన చట్టాలను లేకుండా చేసే ప్రయత్నమే ఈ యుసిసి అని బలంగా అభిప్రాయపడుతున్నాం. ప్రజాస్వామ్య నిబంధనలను దృష్టిలో వుంచుకుని, ఆ యా కమ్యూనిటీలతో విస్తృతంగా చర్చించిన తర్వాత మాత్రమే ఇది జరగాలి.
యుసిసి అవసరాన్ని పున:పరిశీలించాలన్న సాకుతో ఏకరూపత చట్టాలను, ప్రధానంగా మెజారిటీవాదుల చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతాయి. అంతేకానీ మహిళలకు గణనీయంగా సమాన హక్కులు కల్పించే చట్టాలు తీసుకు వచ్చే ప్రయత్నాలు కాదివి. వాస్తవానికి, దీనివల్ల హిందూ చట్టాల నకలు ఏర్పడవచ్చు, అన్ని కమ్యూనిటీల్లో లింగ వివక్ష వుంటుంది.
తమ పిల్లలపై సమాన సంరక్షక హక్కులు లేకపోవడం వల్ల మన దేశంలో హిందూ మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అత్తింటివారి ఆస్తులపై కూడా వారికి సమాన హక్కులు వుండడం లేదు. వివాహ సమయంలో భార్యాభర్తల్లో ఎవరో ఒకరు, లేదా ఇద్దరు కలిసి సమకూర్చుకున్న ఆస్తే అయినా వాటిపై హక్కు వుండడం లేదు. ఇటీవలే, మద్రాసు హైకోర్టు ఒక కేసులో తీర్పు వెలువరిస్తూ, మహిళలు ఇంట్లో చేసే పనికి కూడా విలువుంటుందని స్పష్టం చేసింది. అందువల్ల ఆమె భర్త సంపాదించిన ఆస్తిలో ఆమెకు కూడా సమాన వాటా వుంటుందని పేర్కొంది. ఆ ఆస్తి ఏర్పాటులో ఆమె ఆర్థికంగా సాయపడినా లేకపోయినా దానిపై హక్కు వుంటుందని తీర్పు చెప్పింది. అయితే, దీనికోసం అనేక మహిళా సంఘాలు, గ్రూపులు అడుగుతున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు.
కుల దురహంకారం పేరుతో జరిగే నేరాలు, హత్యలను ఎదుర్కొనేందుకు సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని ఐద్వా సహా అనేక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటువంటి చట్టం కోసం 2005లోనే ఐద్వా ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుత ప్రభుత్వానికి కూడా ఇచ్చింది. కానీ ఇంతవరకు ఆ దిశగా ఏమీ జరగలేదు.
అలాగే, యు.పి, ఉత్తరాఖండ్ సహా కొన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ భూములపై హిందూ మహిళలకు, ఇతర మహిళలకు సమాన హక్కులు వుండడం లేదు. ఈ రెండు రాష్ట్రాల్లో ఇటువంటి ఆస్తులపై వారసత్వం నుండి వివాహమైన కుమార్తెలను మినహాయిస్తున్నారు. హెచ్‌ఎస్‌ఎ పరిధి నుండి వ్యవసాయ భూమిని తొలగిస్తున్న మినహాయింపును రద్దు చేయడానికి 2005లో హిందూ వారసత్వ చట్టాన్ని సవరించినప్పటికీ, కొన్ని రాష్ట్ర చట్టాల్లో వ్యవసాయ భూమి వారసత్వం కొనసాగుతోంది. ఈ రాష్ట్ర చట్టాలు ఈ వారసత్వపు హక్కును మహిళలు పొందకుండా అడ్డుకుంటున్నాయి. వాస్తవానికి, ఈ చట్టాలను రాజ్యాంగం లోని 9వ షెడ్యూల్‌లో పెట్టారు. కోర్టుల పరిధికి వాటిని వెలుపల వుంచాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేశారు. ఒక హిందూ మహిళ తన స్వంతంగా సంపాదించుకున్న ఆస్తికి, ఆమె భర్త, పిల్లలు లేనపుడు ఆమె కన్నా ఆమె భర్త వారసులకే హక్కు వుంటుందనే అన్యాయమైన నిబంధన హిందూ వారసత్వ చట్టంలో వుంది. దీన్ని కూడా సవరించలేదు.
అలాగే, ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహం చేసుకోవాలంటే ముందుగా ఒక నెల నోటీసు ఇచ్చి ఆ కాలపరిమితి ముగిసిన తర్వాతనే వివాహం చేసుకోవాలనే నిబంధనను తొలగిస్తూ, ప్రత్యేక వివాహ చట్టాన్ని సవరించాలని కూడా సూచించాం.
మహిళలకు సమానహక్కులు తీసుకురావడం కోసం ఐద్వాతో సహా పలు ఇతర మహిళా సంఘాలు అనేక సంవత్స రాలుగా కొన్ని సూచనలు చేస్తున్నాయి. అయితే, ఈ డిమాండ్లను గత, ప్రస్తుత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూనే వచ్చాయి. మరోవైపు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లవ్ జిహాద్‌ను లేవనెత్తుతూ, మతాంతర, కులాంతర వివాహాలు చేసుకోవడాన్ని నిలువరించేందుకు నిరంకుశమైన మత మార్పిడి చట్టాలు తీసుకువస్తున్నాయి. ఇప్పుడు ఏకరూపత కోసమంటూ ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలని కోరుతున్నాయి.
కుటుంబ చట్టాలు లేని రంగాల్లో బహుళ కుటుంబ చట్టాలు (ప్లూరల్ ఫ్యామిలీ లాస్), ఉమ్మడి చట్టాలు రెండూ వున్న సుసంపన్నమైన సాంప్రదాయం భారత్‌కు వుంది. ఇంతకుముందే చెప్పినట్లుగా, వరకట్న నిరోధక చట్టం, సతి అమలు (నిరోధక) చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, గృహ హింస నుండి మహిళలను కాపాడే చట్టం ఇవన్నీ ఉమ్మడి చట్టాలు. అన్ని కమ్యూనిటీలకు వర్తిస్తాయి. అలాగే కుల దురహంకారంతో చేసే హత్యలు, నేరాలను నిరోధించే చట్టం కూడా చేయాలి, అత్తింటివారి ఆస్తిపై సమాన హక్కు వుండేలా చట్టం తీసుకురావాలి. అదే సమయంలో, ఆయా కమ్యూనిటీల్లోని మహిళల, మహిళా ఉద్యమాల ప్రతినిధుల అభీష్టానుసారం పర్సనల్ చట్టాల్లో సంస్కరణలు తీసుకురావాలి. యుసిసిని తీసుకురావాలని ప్రభుత్వం నిశ్చయించింది కాబట్టి కేవలం ఆ కారణంతోనే ఈ అంశాన్ని లా కమిషన్ పున:పరిశీలించవద్దు.
ఈ రంగంలో మాకు వున్న అనుభవాన్ని దృష్టిలో వుంచుకుని, లా కమిషన్ పిలిచిన రోజు వెళ్ళి మౌఖికంగా సాక్ష్యాధారాలు అందచేయాలనుకుంటున్నాం. ఈ అంశంతో సంబంధముండే మహిళా సంఘాలు, ఇతర గ్రూపులు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వారితో కూడా లా కమిషన్ విస్తృతంగా చర్చలు జరపాలి. ముఖ్యంగా మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన మహిళలతో మాట్లాడాలి. అలాగే గిరిజన మహిళలతో మాట్లాడాలి. ఆ తర్వాతనే యుసిసిపై సిఫార్సు చేయడానికి నిర్ణయం తీసుకోవాలి.
/ లా కమిషన్‌కు ఐద్వా సమర్పించిన మెమోరాండం సంక్షిప్తంగా/