
శ్రీదేవి కూతురుగా ఇండిస్టీలో ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం గట్టిగా పోరాడుతోంది జాన్వీ కపూర్. తాజాగా 'గుడ్ లక్ జెర్రీ' చిత్రంతో డిస్నీ హాట్ స్టార్‌లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2018లో నయనతార కెరీర్‌లోనే సూపర్ హిట్‌గా నిలిచిన 'కోలమావు కోకిల'కు ఇది అఫీషియల్ రీమేక్. థియేటర్‌లో ప్లాన్ చేసుకున్నప్పటికీ, మారిన పరిస్థితుల దృష్ట్యా వెండితెర కంటే స్మార్ట్ స్క్రీన్‌పై వర్కౌట్ అవుతుందని గుర్తించిన నిర్మాతలు దానికి అనుగుణంగానే విడుదల చేశారు. తెలుగు, తమిళ ఆడియన్స్ ఆల్రెడీ ఈ కథను చూసేసినప్పటికీ కొన్ని కీలక మార్పులతో మరోసారి ట్రై చేయొచ్చు. కాగా జాన్వీ.. నయన్ పాత్రకు న్యాయం చేసిందా? లేదా? అనేది తెలుసుకుందాం..!
కథలోకి వెళ్తే.. జెర్రీ (జాన్వీ కపూర్) పూర్తిపేరు జయకుమారి ఓ మధ్యతరగతి అమ్మాయి. తండ్రి చనిపోవడంతో కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకుంటుంది. అమ్మా చెల్లి బాధ్యతలు నెత్తిమీద వేసుకుని, వాళ్లను పోషిస్తూ ఉంటుంది. వారి ఆలనాపాలన చూసుకునేందుకు స్థానికంగా ఉండే మసాజ్ సెంటర్‌లో ఉద్యోగమే తనకు ఉపాధి. తల్లి (మితా వశిష్ఠ్), చెల్లి (సమతా సుదీక్ష) తో ఎంతో సరదాగా ఉండే క్రమంలో ఆ కుటుంబానికి ఊహించని సమస్య ఎదురవుతుంది. జెర్రీ తల్లి.. ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతుంది. తన తల్లిని రక్షించుకునేందుకు చికిత్సకు పాతిక లక్షలు అవసరమవుతాయని జెర్రీకి వైద్యులు చెబుతారు. జెర్రీ ఆ మొత్తాన్ని సమకూర్చేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఎంత ప్రయత్నించినా అంత డబ్బు దొరకదు. ఈ క్రమంలో తన ప్రమేయం లేకుండానే డ్రగ్స్ సరఫరా చేసే ఓ ముఠా చేతుల్లో చిక్కుకుంటుంది. దీంతో మాఫియా ముఠాకు జెర్రీ టార్గెట్ అవుతుంది. ఇంతకీ జెర్రీ ఈ చక్రవ్యూహంలో ఎలా చిక్కుకుంది? వారెందుకు జెర్రీని టార్గెట్ చేశారు? ఆ చీకటి వ్యాపారం నుంచి ఆమె ఎలా తప్పించుకుంది? తన తల్లి ఆరోగ్యం బాగుపడిందా? అన్నదే మిగతా కథ.
కొత్త కథలను తెరకెక్కించడం కంటే ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేయడం కష్టమనేది అనేకమంది దర్శకులు చెప్పేమాట. ప్రేక్షకులు మాతృక చిత్రాన్ని చూసుంటారు కాబట్టి కథేంటో ముందే తెలిసిపోతుంది. దీంతో రీమేక్‌లు చేసే దర్శకుడు, నటులు మరింత శ్రద్ధ చూపాల్సి వస్తుంది. 'గుడ్‌లక్ జెర్రీ' థీమ్ 'కోలమావు కోకిల'దే అయినా.. ఉత్తరాది ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొన్ని మార్పులు చేశారు. 'కోలమావు కోకిల' చూడనివారికి ఈ సినిమా మంచి అనుభూతి కలిగిస్తుంది. పంజాబ్ నేపథ్యంలో సాగే కథ ఇది. జెర్రీ కుటుంబ పరిచయం, జెర్రీని- ఆమె చెల్లిని ప్రేమిస్తున్నామంటూ ఇద్దరు యువకులు వారి వెంటపడటం, జెర్రీ మత్తు పదార్థాలు రవాణా చేసే బృందానికి చిక్కడం తదితర సన్నివేశాల్లో ప్రథమార్ధం సరదాగా సాగుతుంది. ఆ తర్వాతే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. డ్రగ్స్ ముఠా నుంచి బయటపడేందుకు జెర్రీ వేసిన స్కెచ్ ద్వితీయార్ధంలో థ్రిల్ పంచుతుంది. డ్రగ్స్ దందా సబ్జెక్ట్‌కి కామెడీని జతచేయడమే ఓ సవాలు. ఈ విషయంలో దర్శకుడు విజయం సాధించారు. ఓ వైపు జెర్రీ పరిస్థితి ఏమవుతుందోననే ఉత్కంఠ, మరోవైపు కామెడీ సన్నివేశాలతో ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా కథను నడిపించిన తీరు మెప్పిస్తుంది. హీరోలే కాదు హీరోయిన్లతోనూ ఇలాంటి స్టోరీలను డీల్ చేయొచ్చని నిరూపించారు.
కొన్ని ముఖ్యమైన లాజిక్స్‌ని లింక్స్‌ని మిస్ చేసినప్పటికీ ఓవరాల్‌గా కోలమాపు కోకిల చూడనివాళ్లకు ఈ జెర్రీ నచ్చే అవకాశాలు ఎక్కువ. కామెడీ ట్రాక్స్ బాగా పేలాయి. కానీ డ్రగ్స్ గ్యాంగ్ క్యారెక్టరైజేషన్లలో లోపాల వల్ల కొన్ని ఎపిసోడ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. అంతే మినహా చిత్రీకరణ విధానం ఆకట్టుకుంటుంది. మొత్తానికి క్లైమాక్స్ విషయంలో మాతృకు విభిన్నంగా తెరకెక్కించారు. అదే టైటిల్‌కు జస్టిఫికేషన్.
జెర్రీ పాత్రలో జాన్వీ చక్కగా ఒదిగిపోయింది. నటనపరంగా ఇచ్చిన ఛాలెంజ్‌ని ఒరిజినల్ వెర్షన్‌లో నయనతారతో మ్యాచ్ చేసి, ఆడియన్స్‌ని మెప్పించేలా పర్ఫెక్ట్ ఛాయిస్ అయ్యింది. ఆహార్యం, హావభావాలతో మిడిల్ క్లాస్ అమ్మాయిగా ఒదిగిపోయింది. సీనియర్ నటి మితా వశిష్ఠ్.. జెర్రీ తల్లిగా కనిపించి, మంచి మార్కులు కొట్టేశారు. మాతృకలో నయనతారను ప్రేమించే వ్యక్తిగా నవ్వులు పంచే యోగిబాబు పాత్రలో దీపక్ దోబ్రియాల్ సందడి చేశారు. డ్రగ్స్ గ్యాంగ్ పాత్రలు పోషించిన ప్రతి ఒక్కరూ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. దర్శకుడు సిద్ధార్థ్‌సేన్ గుప్తా స్క్రిప్ట్‌ని తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంది. కథకు ఆ మూడ్ ఎలివేట్ అయ్యేలా సినిమాటోగ్రఫీ బాగుంది. అమన్ పంత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ అయ్యింది. ఒరిజినల్ వెర్షన్ చూసుండకపోతే కామెడీ టైంపాస్ కోసం జెర్రీ మీద హ్యాపీగా ఓ లుక్ వేయొచ్చు.