Nov 21,2023 07:16

పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదం మద్దతు గనుక లేకపోతే ఇజ్రాయిల్‌లో వలస సామ్రాజ్యవాదం ఉండేదే కాదు. యూదులను శతాబ్దాలపాటు హింసకు, వేధింపులకు గురిచేసిన సామ్రాజ్యవాదులు తాము అంతకాలమూ కొనసాగించిన పాపాన్ని కడిగేసుకోడానికి ఇజ్రాయిల్‌కు మద్దతు కొనసాగిస్తున్నారు. ఆ క్రమంలో పాలస్తీనా ప్రజలను బలి చేస్తున్నారు. ఇజ్రాయిల్‌ లోని మితవాద శక్తులు చెలాయిస్తున్న వలసవాద సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని సమర్ధించుకోడానికి గతంలో యూదుల మీద సాగిన హింస ఒక సాకుగా ఉపయోగపడుతోంది. ఆ ముసుగులో వాళ్ళు తమ విస్తరణను, వివక్ష పూరిత విధానాలను, జాతుల నిర్మూలనను కొనసాగిస్తున్నారు. పైగా ఇజ్రాయిల్‌ దుర్మార్గాలను ప్రశ్నించేవారిని ''యూదు వ్యతిరేకులు''గా ముద్ర వేస్తున్నారు. ఆ నాటి నాజీలు ప్రదర్శించిన యూదు వ్యతిరేకతతో సరిపోల్చుతున్నారు.

ఈ ''వలసవాద సామ్రాజ్యవాదం'' వర్తమాన సామ్రాజ్యవాద దశలో అత్యంత క్రూరమైన, దూకుడు కలిగిన భాగంగా ఉంది. పైగా తన దుర్మార్గాన్ని అది గత కాలంలో తమపై సాగిన హింస, వేధింపుల సాకుతో సమర్ధించుకుంటోంది. అందుచేత ఈ తరహా వలసవాద సామ్రాజ్యవాదాన్ని నిలవరించాలి. కేవలం పాలస్తీనా ప్రజల కోసమే గాక యావత్‌ ప్రపంచ ప్రయోజనాల రక్షణ రీత్యా ఇది అత్యవసరం. కేవలం ప్రపంచ ప్రజానీకపు ఒత్తిడితోనే ఇది సాధ్యపడుతుంది.

లస విధానం 18, 19 శతాబ్దాల్లో రెండు వేర్వేరు పద్ధతుల్లో తలెత్తింది. వీటిలో మొదటిది స్థాపిత కేంద్రీకృత పాలనా వ్యవస్థల ద్వారా సంపదలో మిగులును పిండుకోవడం. వలస పాలకులు తాము బలప్రయోగాల ద్వారా ఆక్రమించుకున్న దేశాల్లో ...అక్కడ ఉన్న పాత పాలకుల స్థానంలో కొత్తగా తమ వలస పాలనను నెలకొల్పడం ఈ పద్ధతిలో కనిపిస్తుంది. ఈ పద్ధతికి భారతదేశం సరైన ఉదాహరణగా నిలుస్తుంది. స్థానికంగా ఉన్న చేతివృత్తులను దెబ్బ తీసి యూరోపియన్‌ ఉత్పత్తులకు మార్కెట్‌ను కల్పించడంతోబాటు తమ దేశాలకు కావలసిన సరుకులను ఇక్కడినుంచి కొల్లగొట్టి తరలించుకుపోవడం ఈ పద్ధతి సారాంశం. మనవంటి దేశాలలో అప్పటికే గణనీయంగా జనాభా నివసిస్తోంది గనుకను, ఇవి ఉష్ణ మండల ప్రాంతాలు అవడం చేతను శీతల ప్రదేశాల్లో జీవించే యూరోపియన్‌ ప్రజలు ఇక్కడికి చాలా తక్కువ సంఖ్యలోనే వలసలు వచ్చారు.
          ఇక రెండో పద్ధతి-ఇతర భూభాగాలను ఆక్రమించుకుని, అక్కడి స్థానిక ప్రజానీకాన్ని వెళ్ళగొట్టి సంపన్న యూరోపియన్‌ దేశాల నుండి జనాలు వలసలు వచ్చి ఆక్రమించుకోవడం. ఈ పద్ధతికి సరిగ్గా అతికే ఉదాహరణ అమెరికా దేశం. సంపన్న దేశాల నుండి వలసలు వచ్చి స్థానికులను తరిమివేసి వారి సంపదను స్వాధీనం చేసుకోవడం ఈ పద్ధతిలోని ప్రధాన అంశం.
మొదటి పద్ధతిని ''కొల్లగొట్టే సామ్రాజ్యవాదం'' అని, రెండో పద్ధతిని ''వలస వచ్చిన సామ్రాజ్యవాదం'' అని నేనంటాను.
           మొదటి పద్ధతిలో తాము స్వాధీనం చేసుకున్న భూభాగం నుండి సంపదను కొల్లగొడితే, రెండో పద్ధతిలో ఏకంగా ఆ భూమినే తమ స్వంతం చేసుకున్నారు. మొదటి పద్ధతిలో భూమి మీద శ్రమ చేయడానికి స్థానిక ప్రజానీకం అవసరమౌతారు. ఆ భూమి మీద వచ్చిన సంపదలో గరిష్ట భాగాన్ని గనుక సామ్రాజ్యవాదులు కొల్లగొడితే అప్పుడు స్థానిక ప్రజలు తిండి లేక మాడిపోతారు. బ్రిటిష్‌ పాలనలో భారతదేశంలో ఇదే జరిగింది. వరసగా కరువులతో ప్రజలు నానా అగచాట్లూ పడ్డారు. ఐతే, తాము కొల్లగొట్టడానికి కావలసిన సంపదను ఉత్పత్తి చేసేందుకు కొంతమందైనా స్థానిక ప్రజలు బతికివుండాలి గనుక బ్రిటిష్‌ ప్రభుత్వం ఆ కరువు సమయాల్లో కొన్నైనా సహాయ చర్యలు చేపట్టింది. అదే రెండో పద్ధతిలోనైతే ఆ విధంగా స్థానిక ప్రజలను బతికించి వుంచవలసిన అవసరం లేదు. వలసవచ్చిన వారి సంఖ్య తగినంతగా ఉంటే పని చేసేందుకు మనుషులకోసం వెతుక్కోనవసరమే లేదు. అందుచేత వలసవచ్చిన సామ్రాజ్యవాదులు స్థానిక జాతులను పూర్తిగా నిర్మూలించడానికే పూనుకున్నారు.
         ఇలా వలసవచ్చి కొత్త ప్రాంతాల్లో స్థిరపడిన సామ్రాజ్యవాదులు తమ ఆధీనంలోకి అదనపు భూభాగాలను తెచ్చుకునేందుకు విస్తరణకు పూనుకున్నారు. ఇక ఆక్రమించుకోడానికి భూభాగం మిగలనప్పుడో లేదా పొరుగున మరొక బలమైన రాజ్యం ఉన్నప్పుడో మాత్రమే వాళ్ళ విస్తరణ ఆగింది.
        ఇదంతా గతంలో ఎప్పుడో జరిగిపోయినది కదా అని ఎవరైనా మామూలుగా అనుకుంటారు. ఇంకా వలసపాలన అనేది ఎక్కడుంది అని కూడా అనుకోవచ్చు. కాని పెట్టుబడిదారీ దశలో సామ్రాజ్యవాదం వాస్తవంగా ఉనికిలో ఉంది. అందుచేత మనం ఆ విధమైన పొరపాటు అభిప్రాయానికి రాకూడదు. వర్తమాన కాలంలో వలస సామ్రాజ్యవాదానికి గట్టి ఉదాహరణ ఇజ్రాయిల్‌. శతాబ్దాలపాటు యూదులు మైనారిటీలుగా వేధింపులకు, హింసకు గురయ్యారు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో వారిమీద సాగిన హింస పరాకాష్టకు చేరింది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి కాందిశీకులుగా యూదులు పాలస్తీనాకు వలసవచ్చి ఇజ్రాయిల్‌ పేరుతో యూదురాజ్యాన్ని 1948లో ఏర్పాటు చేసుకున్నారు. ఐతే అమెరికన్‌ సామ్రాజ్యవాదం ప్రత్యేక శ్రద్ధతో అందించిన తోడ్పాటును ఉపయోగించుకుని ఇజ్రాయిల్‌లో అధికారం చెలాయించిన మితవాద ప్రభుత్వాలు వేధింపులకు గురైన కాందిశీకులకు ఆశ్రయంగా మొదలైన ఇజ్రాయిల్‌ ను ఆధునిక వలస సామ్రాజ్యవాదానికి నమూనాగా మార్చివేశారు. వలసవచ్చిన సామ్రాజ్యవాదుల తరహాలోనే ఇజ్రాయిల్‌లో సాయుధులైన బృందాలు తమ ఆక్రమణలోకి అదనపు భూభాగాలను తెచ్చుకునేందుకు పూనుకున్నాయి. వెస్ట్‌బ్యాంక్‌, గాజా వంటి కొత్త ప్రాంతాలను ఆక్రమించుకోడానికి పూనుకోడమే గాక అక్కడ ఉన్న జాతులను నిర్మూలించడానికి తయారౌతున్నాయి.
            వలసవాదుల పాలన ప్రత్యేక లక్షణం జాతి వివక్షత. తమ ఆక్రమణలో ఉన్న ప్రతీ నగరంలోనూ రెండు భాగాలు ఉంటాయి. ఒక భాగంలో అధికారం చెలాయించేవారు, వారితోబాటు వలసవచ్చిన కొద్దిమంది ప్రజలు నివసిస్తారు. రెండో భాగంలో సామాన్య, స్థానిక ప్రజలు ఉంటారు. ఇప్పుడు ఇజ్రాయిల్‌ ఆక్రమణలో ఉన్న భూభాగాల్లోనూ అదే పరిస్థితి ఉంది. జాతి వివక్షత అక్కడ తాండవమాడుతోంది.
పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదం మద్దతు గనుక లేకపోతే ఇజ్రాయిల్‌లో వలస సామ్రాజ్యవాదం ఉండేదే కాదు. యూదులను శతాబ్దాలపాటు హింసకు, వేధింపులకు గురిచేసిన సామ్రాజ్యవాదులు తాము అంతకాలమూ కొనసాగించిన పాపాన్ని కడిగేసుకోడానికి ఇజ్రాయిల్‌కు మద్దతు కొనసాగిస్తున్నారు. ఆ క్రమంలో పాలస్తీనా ప్రజలను బలి చేస్తున్నారు. ఇజ్రాయిల్‌ లోని మితవాద శక్తులు చెలాయిస్తున్న వలసవాద సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని సమర్ధించుకోడానికి గతంలో యూదుల మీద సాగిన హింస ఒక సాకుగా ఉపయోగపడుతోంది. ఆ ముసుగులో వాళ్ళు తమ విస్తరణను, వివక్ష పూరిత విధానాలను, జాతుల నిర్మూలనను కొనసాగిస్తున్నారు. పైగా ఇజ్రాయిల్‌ దుర్మార్గాలను ప్రశ్నించేవారిని ''యూదు వ్యతిరేకులు''గా ముద్ర వేస్తున్నారు. ఆ నాటి నాజీలు ప్రదర్శించిన యూదు వ్యతిరేకతతో సరిపోల్చుతున్నారు.
            గతంలో యూదులపై సాగిన హింస, వేధింపులు సామ్రాజ్యవాదులకు, మితవాద శక్తులకు ఇప్పుడు ఒక సాకుగా ఉపయోగపడుతున్నాయి. గాజాలో సామాన్య ప్రజానీకం మీద ఇజ్రాయిల్‌ కొనసాగిస్తున్న దారుణాలు కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి. వాటిని వ్యతిరేకిస్తూ పాలస్తీనా ప్రజానీకానికి సంఘీభావంగా వివిధ పెట్టుబడిదారీ దేశాల్లో తలపెట్టిన నిరసన కార్యక్రమాలను నిషేధించడానికి ఒక సాకుగా ఆ ప్రదర్శనలు ''యూదు వ్యతిరేకత'' తో కూడుకునివున్నాయని సామ్రాజ్యవాద ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. అటువంటి నిషేధాలతో పాలస్తీనా సంఘీభావ ప్రదర్శనలు ఆగిపోలేదు. లండన్‌ లో జరిగిన ఒక ప్రదర్శన విషయంలో పోలీసులు పాలస్తీనా పట్ల పక్షపాత వైఖరిని ప్రదర్శించారంటూ విమర్శించిన బ్రిటిష్‌ హోంశాఖ మంత్రి సుయెల్లా బ్రేవర్‌మాన్‌ తన పదవినే కోల్పోవలసివచ్చింది.
             ఇజ్రాయిల్‌కు సామ్రాజ్యవాదులు మద్దతు కొనసాగించడానికి ఇంకో కారణం ఉంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు వలసవాద సామ్రాజ్యవాదాన్ని అమలుచేయడం ద్వారానే ఉనికిలోకి వచ్చాయి. ఆ కాలంలో అవి ఆక్కడి స్థానిక జాతుల నిర్మూలనకు నిర్దాక్షిణ్యంగా పూనుకున్నాయి. అదే పనికి ఇప్పుడు తమకు అత్యంత అభిమాన పాత్రురాలైన ఇజ్రాయిల్‌ పూనుకుంటోంది. అటువంటప్పుడు దానికి తమ సమర్ధన తెలపకుండా ఎలా ఉండగలుగుతాయి ?
             అన్నింటికన్నా ముఖ్యమైనది ఇంకో కారణం ఉంది. పశ్చిమ ఆసియా ప్రాంతంలో తమకు నమ్మినబంటులాగా ఇజ్రాయిల్‌ ఇప్పుడు తయారైంది. ఒకప్పుడు అరబ్‌ ప్రాంతంలో కమ్యూనిజం బలమైన శక్తిగా ఉండేది. దానిని దెబ్బతీసి తన ఆధిపత్యాన్ని నిలుపుకోడానికి సామ్రాజ్యవాదం ఇస్లామిక్‌ మతోన్మాద శక్తులను బలపరచింది (వాటిలో ఒకప్పుడు హమాస్‌ కూడా ఉండేది). ఇజ్రాయిల్‌కు సాయుధ తోడ్పాటును అందించడం కూడా ఆ వ్యూహంలో భాగమే. ఒకపక్క ఇజ్రాయిల్‌ గాజా ప్రాంతంలో నరమేధాన్ని కొనసాగిస్తున్నా, ఐరాస భద్రతామండలి సమావేశాల్లో ఇజ్రాయిల్‌ తక్షణమే కాల్పుల విరమణ పాటించాలన్న తీర్మానానికి అమెరికా వ్యతిరేకంగా ఓటు చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు. ''మానవతా దృక్పథంతో వ్యవహరించి'' ఇజ్రాయిల్‌ తన దాడుల మధ్య కొద్ది విరామం పాటించాలని మాత్రం అమెరికా కోరింది! బహుశా అమెరికా దృష్టిలో మానవతా దృక్పథం అంటే కాల్పులలో మరణించినవారి మృతదేహాలను, గాయపడిన ప్రజలను వేరే చోట్లకు తరలించడానికి అప్పుడప్పుడు కాల్పులను ఆపడమే కాబోలు.
గాజా వంటి ప్రాంతాలను బహిరంగ చెరసాలలుగా ఎంతోకాలం పాటు కొనసాగించడానికి ఇజ్రాయిల్‌ అంత సుముఖంగా ఉంటుందని భావించలేం. పాలస్తీనా ప్రజల ఉనికే తమ భద్రతకు ముప్పు అని ఇజ్రాయిల్‌ భావిస్తోంది. అందుచేత ఇజ్రాయిల్‌ దూకుడు ఇలానే కొనసాగితే అది పాలస్తీనా జాతి మొత్తాన్ని తుడిచిపెట్టేవరకూ ఆగదు. ఇజ్రాయిల్‌కు చెందిన నిర్మాణ సంస్థలు తమ వద్ద పని చేస్తున్న పాలస్తీనీయుల స్థానే భారతీయ కార్మికులను నియమించాలని కోరుతున్నాయి. అంటే మూడవ ప్రపంచదేశాల్లో భారీగా నిరుద్యోగులు ఉన్నంత కాలమూ పాలస్తీనా ప్రజలను గాని, మరేదైనా జాతి ప్రజలను గాని నిర్మూలించడం సామ్రాజ్యవాదులకు పెద్ద ఇబ్బంది కలిగించదు.
            ఈ ''వలసవాద సామ్రాజ్యవాదం'' వర్తమాన సామ్రాజ్యవాద దశలో అత్యంత క్రూరమైన, దూకుడు కలిగిన భాగంగా ఉంది. పైగా తన దుర్మార్గాన్ని అది గత కాలంలో తమపై సాగిన హింస, వేధింపుల సాకుతో సమర్ధించుకుంటోంది. అందుచేత ఈ తరహా వలసవాద సామ్రాజ్యవాదాన్ని నిలవరించాలి. కేవలం పాలస్తీనా ప్రజల కోసమే గాక యావత్‌ ప్రపంచ ప్రయోజనాల రక్షణ రీత్యా ఇది అత్యవసరం. కేవలం ప్రపంచ ప్రజానీకపు ఒత్తిడితోనే ఇది సాధ్యపడుతుంది. కొలంబియా, బొలీవియా, దక్షిణాఫ్రికా తదితర దేశాలు ఇప్పటికే ఇజ్రాయిల్‌తో దౌత్య సంబంధాలు తెంచుకున్నాయి. పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ప్రపంచమంతటా ప్రజాభిప్రాయం వ్యక్తమౌతోంది. పలు సంపన్న పశ్చిమ దేశాల్లో పాలస్తీనా సంఘీభావ ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ప్రదర్శనల్లో ఇటీవల కాలంలో ఎన్నడూ చూడనంత పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నారు. స్థానికంగా ఉంటున్న యూదుప్రజలు సైతం ఈ ప్రదర్శనలకు మద్దతు పలుకుతున్నారు. ఇజ్రాయిల్‌ మారణకాండను ఖండిస్తున్నారు. వెల్లువెత్తుతున్న ఈ ప్రపంచవ్యాప్త ప్రతిఘటన మీద పాలస్తీనా ప్రజల భవిష్యత్తు మాత్రమే గాక యావత్‌ ప్రపంచ ప్రజల భవిష్యత్తు కూడా ఆధారపడి వుంది.

( స్వేచ్ఛానుసరణ )
ప్రభాత్‌ పట్నాయక్‌

prabhat patnaik