ప్రజాశక్తి -సామర్లకోట రూరల్ (కాకినాడ) : పంచరామ క్షేత్రం సామర్లకోట భీమేశ్వర ఆలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఆలయానికి విచ్చేసిన కలెక్టర్ కృతిక శుక్ల కుటుంబ సభ్యులకు ఆలయ ఈఓ డి.నాగమల్లేశ్వరరావు, ఆలయ అర్చకులు మేళ తాళాలు వేదమంత్రాలు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. తొలిత కాలభైరవ ఆలయం ఏకశిలానంది దర్శనం చేసుకున్నారు. అనంతరం భీమేశ్వరునికి బాలా త్రిపుర సుందరి అమ్మవారికి పూజలు చేపట్టారు. నందిమండపంలో కలెక్టర్ సహా ఆమె కుటుంబీకులకు ఆలయ ఈవో నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో వేద ఆశీర్వచనాలు, ప్రసాదాలు, స్వామి వారు చిత్రపటాలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట మండల తహశీల్దార్ లక్ష్మీనరసికుమారి, వీఆర్వో నల్లజర్ల మురళీకృష్ణ, కలెక్టర్ కుటుంబీకులు ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.










