- సత్యాగ్రహ దీక్ష విరమణ : జీడి రైతుసంఘం
ప్రజాశక్తి - పలాస :జీడికి మద్దతు ధర కల్పించాలని, ఆర్‌బికెల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ ఆగస్టు 5 నుంచి 20వ తేదీ వరకు లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు జీడి రైతుసంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజరు కుమార్, ఎపి రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు తెలిపారు. సేకరించిన లక్ష సంతకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందిస్తామన్నారు. సంతకాల సేకరణ ఉద్యమంలో జీడి రైతాంగం పెద్దఎత్తున పాల్గని జయప్రదం చేయాలని కోరారు. జీడికి మద్దతు ధర కోసం కాశీబుగ్గలోని గాంధీ విగ్రహం వద్ద జీడిరైతు సంఘం ఆధ్వర్యాన చేపట్టిన 24 గంటల సత్యాగ్రహ దీక్ష శనివారం ముగిసింది. దీక్షలో కూర్చొన్న కె.మోహనరావు, కె.హేమారావు చౌదరి, పి.కుసుమ, కె.బాలాజీరావు, కె.సింహాచలం, ఎ.రామకృష్ణ, కె.తవిటయ్య, ఎస్.ఈశ్వరరావు, ఎస్.కుమార్, జె.గవరయ్య, కె.గురయ్యకు జీడి ఉద్యమ నాయకులు కె.సురేఖ, రైతుసంఘం సీనియర్ నాయకులు బమ్మిడి శ్రీరాములు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీడి రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 80 కేజీల జీడిపిక్కల బస్తాను రూ.16 వేలకు కొనుగోలు చేయాలని, కేరళ తరహాలో జీడి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని, రైతులకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దేశీయ జీడిపిక్కలు కొనుగోలు చేసిన తర్వాతనే విదేశీ పిక్కలు తేవాలన్నారు. దీక్షకు పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.










