Dec 18,2022 12:09

కాంతి కిరణాలు దుఃఖపు కత్తుల వేటుకు తెగిపడినపుడు..
నిశీధి నాకు నేస్తమై తోడుంటుంది
నేను.. మోసం..
మేమెప్పుడూ ఒకరికొకరం పోటీనే
అయినా.. గెలుపు మజిలీ తలుపుతట్టదు
నేను...కష్టం.. కలియ తిరుగుతాం
ఫలితం అందనిద్రాక్షయ్యి ఊరిస్తుంది
నేను..దుక్కి. దుఃఖపువానై నానిపోతుంటాం
శ్రమకుదక్కని విజయం..
తలచుకుంటే శూన్యం
అందుకే..నేను...తిమిరంతో తిరుగుతాను
దోస్తీ కట్టి కన్నీరు తుడుస్తుంది
మోసపూరిత సమాజాన్ని నాకుఎరుకజేస్తుంది.
నాకు తెలుసు చీకటి గుట్టల తెరచాటున..
విజయపు వెలుగుల దరహాసం దాగివుందని
చెమట చుక్కలు చిందించడం మరవకు..
పగలురాత్రులు శ్రమించడం ఆపనే ఆపకు..
అంతులేని పోరాటాన్ని ఆపకు..
గెలుపు గుర్రాలు ఏ మూలనుంచో
నిను చూస్తున్నాయని..
ఓటమేమి నీకు కొత్తకాదని
చీకటితో నా బతుకుపాటను చెప్పుకుంటాను
రేపటి భవిష్యత్తును కలలుగంటాను
స్వప్నాల్లో విహరిస్తూ
పోరాట పాఠాలను నేర్చుకుంటాను.
విజయ తీరం చేరడానికి
ఎన్ని చీకటి రోజులనైనా గడుపుతాను
అలసిపోను.. మధురగీతమై నను చేరేవరకు...

అశోక్‌ గోనె
9441317361