

పొద్దున పొద్దున్నే ఓ కప్పు కాఫీ కడుపులో పడితేనేగానీ రోజు మొదలుకాదు. మరికొందరికి ఏదైనా ఒత్తిడిగా ఉన్నప్పుడు ఓ కాఫీ తాగితే గొప్ప రిలీఫ్‌గా ఫీలవుతారు. కాఫీ ప్రియులు మనదేశంలోనూ చాలామంది ఉన్నారు. అందుకే కాఫీకి ఈ మధ్య గిరాకీ పెరిగిపోయింది. మనదేశంలో అరకు కాఫీ టాప్ బ్రాండ్స్‌లో ఒకటి. వంద సంవత్సరాల కిందట విశాఖ మన్యానికి చేరింది ఈ కాఫీ. ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకతనూ చాటుకుంది. అందుకు కారణం లేకపోలేదు.. ఇక్కడ గిరిజనులు సేంద్రియ పద్ధతుల్లో కాఫీని పండించడమే. మన ఆంధ్ర రాష్ట్రంలో అరకు కాఫీ గురించి తెలియని తెలుగువారు లేరంటే అతిశయోక్తి కాదు. అరకు ప్రయాణమే పచ్చదనాల మధ్య.. ఇరువైపులా కాఫీ తోటల మధ్య సాగుతుంది. అసలు ఇంతకీ నా ఈ కాఫీ ప్రయాణం అరకు మన్యంలోకి ఎలా చేరిందో తెలిపేదే ఈ ప్రత్యేక కథనం..
అరకు ప్రయాణమే ఓ మంచి కాఫీలాంటిది. మేఘాలలో తేలిపోయినట్లు ఉంటుంది. అందుకు దారికి ఇరువైపులా జామాయిల్, అక్కడక్కడ మామిడి తదితర పెద్ద చెట్లు.. వాటి మధ్యలో కాఫీ చెట్లు.. ఈ పెద్ద చెట్లకు అల్లుకున్న మిరియపు తీగలు. ప్రయాణం అంతా కింద నుండి పైన కొండల మీదకు సాగుతుంటే.. ఆ చెట్ల మధ్యలో మేఘాలు మనతో ప్రయాణం చేస్తూ గమ్మత్తుగా అనిపిస్తుంది. వాతావరణం కూడా కింద నుండి పైకి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతల స్థాయి తగ్గుతూ చల్ల చల్లగా హాయిగొల్పుతుంది. ఆ చల్లటి ప్రయాణం ముగియగానే కాఫీ హౌస్‌లో ఓ కప్పు కాఫీ వేడి వేడిగా తాగితే.. ఆహా.. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం.. అనుభవించాల్సిందే.. అనుభూతి పొందాల్సిందే..
చరిత్రను తెలిపే మ్యూజియం..
కప్పు కాఫీ వెనుక పెద్ద చరిత్ర ఉందండోరు.. అవును నిజమే.. పెద్ద చరిత్రే ఉంది. ఆ చరిత్ర మొత్తాన్ని కళ్లకు కట్టినట్లు వివరించే కాఫీ మ్యూజియం అరకులోనే ఉంది. ఇదంతా ఇప్పుడు మనల్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన దాని వెనుక మరో కథ ఉంది. అరకు కాఫీహౌస్‌కు కేరాఫ్‌గా ఓ కుటుంబం ఉంది. ఆ కుటుంబం తరతరాలుగా కాఫీని ప్రేమిస్తూ బతికేస్తుంది. ఈ కుటుంబం అంతా ఒకరకంగా అంకితభావంతో కాఫీ అసలు రుచిని పోగొట్టకుండా.. ఇంకా చెప్పాలంటే కల్తీ కాకుండా కాపాడుతోంది. అందుకు సరికొత్త హంగులను, సొబగులను అద్దుకుంటూ మార్కెట్ పోటీని తట్టుకుని నిలబడుతున్నారు. అందుకు ప్రధానంగా స్వచ్ఛత.. స్థాన బలమే కారణం అని చెప్పాలి. వీరికి కొన్ని నియమాలున్నాయి. ఈ సంస్థలో స్థానికులకే ఉపాధి లభిస్తుంది. బయట ప్రాంతాల వారికి ఏమాత్రం అవకాశం ఉండదు. వీరంతా స్థానిక గిరిజనులే.. మొత్తం 170 మంది పనిచేస్తున్నారు. వీరిలో 40 మంది వరకూ మహిళా కార్మికులు పనిచేస్తున్నారు. మిగిలిన వారిలో కూడా అత్యధికంగా యువతే ఉండటం మరో విశేషం. ఈ కుటుంబం ఇక్కడే స్టాల్‌ను ఏర్పాటు చేసి, ఈ కాఫీ రుచినీ సందర్శకులకు అందిస్తున్నారు. రుద్రవీణలో ఒక సన్నివేశంలో ఏది పట్టుకున్నా సంగీతం వినిపించినట్లు.. ఈ మ్యూజియంలో అణువణువునా కళాత్మక దృశ్యాలే కనిపిస్తాయి. ఇక్కడ స్వాగతద్వారం నుండి ప్రాంగణంలో అన్నీ కళాత్మకంగా రూపొందించారు. ఇక లోపలికి అడుగుపెట్టగానే.. కూర్చునే కుర్చీ, టేబుల్స్ (పాత కుట్టుమిషన్స్‌ను వినూత్నంగా రూపొందించారు), సాయంత్రం స్నాక్స్ అందించే బళ్లు కూడా వినూత్నంగా, కళాత్మకత ఉట్టిపడేలా ఉంటాయంటే అతిశయోక్తి కాదు.. ఎవరైనా చూసి తరించాల్సిందే. ఈ కాఫీ మ్యూజియంలో లభ్యమయ్యే కాఫీలు, తయారైన చాక్లెట్లు, కాఫీ చరిత్రను ఈ మ్యూజియం నిర్వాహకుల్లో ఒకరు (పేర్లు, వివరాలు ఇవ్వొద్దని కోరారు) ఇలా వివరించారు.

'మొదట నాన్నగారు ఫిల్టర్ కాఫీ చేసేవారు. దీని గురించి అధ్యయనం చేయాలనుకుని అన్నదమ్ములం ముగ్గురం విదేశాలకు వెళ్లాం. మొత్తం ఆరునెలల పాటు ఆ అధ్యయనం కొనసాగింది. మరికొన్ని విషయాలు ఆరునెలలు మన దేశంలోనే నేర్చుకున్నాం. కాఫీ స్వచ్ఛంగా అలాగే ఉండాలనేది మా లక్ష్యం. అదే సందర్భంలో ఇక్కడికి వచ్చే వారికి ఆహ్లాదాన్ని పంచడానికి మా గిరిజన సంస్కృతినే ప్రధానంగా చేసుకుని, కాఫీ హౌస్‌ను 2005, అక్టోబర్‌లో ఏర్పాటు చేశాం. 2006లో ప్రారంభించామని చెప్పుకోవాలి. 2015 నాటికి కాఫీహౌస్‌కి మంచి గుర్తింపు లభించింది. కాఫీ పంట కోసం 4, 5 గ్రామాలను దత్తత తీసుకున్నాం. వాళ్ల దగ్గర నుండి కాఫీ పళ్లను సేకరిస్తాం. వాటిని మేమే ప్రాసెస్ చేసుకుంటాం.
ఈ కాఫీ హౌస్‌లో మ్యూజియంను కూడా పెట్టాలని అందుకు అనుగుణంగా బొమ్మలు, చరిత్ర తయారు చేయించాము. ఈ మ్యూజియంలో కాఫీ చరిత్రని తెలిపే చిత్రాలను ఏర్పాటు చేశాం. ఇథియోపియాలో పుట్టిన కాఫీ అరకు వరకు ఎలా వచ్చిందనే విషయాన్ని ఇక్కడికి వచ్చేవారికి వివరిస్తాం. మనదేశానికి కాఫీ దొంగతనంగా వచ్చింది. ఈ కమ్మటి కాఫీ వెనుక చిక్కని చక్కని కథ ఉంది. అలాగే కాఫీ రుచులతో నిరంతరం రీసెర్చ్ చేస్తుంటాం. ఆ రీసెర్చ్ ద్వారా కాఫీకి వివిధ రకాల పళ్లు, ఫ్లేవర్స్ ను కలుపుతూ సరికొత్త రకాల చాకెట్లను తయారుచేస్తాం. అలాగే కాఫీని కూడా వివిధ రకరకాల రుచులలో అందిస్తాం' అన్నారు.
కాఫీహౌస్‌కు సమాంతరంగా వచ్చిన వారి అభిరుచులకు తగినట్లు చేతివృత్తులతో తయారుచేసిన బొమ్మలు, ఇయర్ రింగ్స్, పర్సులు, కీ చైన్లు తదితరాలు కూడా ఇక్కడ విక్రయానికి ఉంచారు. వీటితో పాటు చాక్లెట్స్ కూడా రకరకాలు ఇక్కడ లభ్యమవుతాయి. వీళ్లే చాక్లెట్ హౌస్ కూడా ఏర్పాటు చేశారు. దాని గురించి మరింత వివరంగా మరోసారి తెలుసుకుందాం. సాయంత్రం వేళ స్నాక్స్ వంటివి కూడా ఏర్పాటు చేసి, గిరిజన సాంప్రదాయ నృత్యాలు గిరిజనులతోనే ప్రదర్శితమవుతాయి. ఈ కాఫీహౌస్‌కి వచ్చినవారు అక్కడ సమయం తెలియకుండా గడిపేస్తారంటే ఇవన్నీ కారణం. కాఫీతో పాటు ఇవన్నీ ఉంటే 'ఆహా.. వహ్ అరకు!' అనాల్సిందే.

కథలోకి వెళితే..
ఈ కాఫీని కనిపెట్టింది ఓ గొర్రెల కాపరి. ఒకరోజు గొర్రెలను మేతకు తీసికెళితే.. ముదురు రంగు ఆకుల మధ్యలో ఉన్న ఎర్రటి పళ్లను అవి తిన్నాయి. ఆ పళ్లు తిన్న గొర్రెలు ఉత్సాహంగా ఉండటాన్ని గొర్రెల కాపరి గమనించాడు. దాంతో తనూ కొన్ని పళ్లు తీసుకుని తిన్నాడు. తనలో కూడా కొంత మార్పు రావడం గమనించాడు. దీంతో కొన్ని పళ్లను కోసుకుని, మత పెద్దకు అందజేశాడు. ఆయన అవి తింటే దుష్ఫలితాలు ఉంటాయంటూ.. అక్కడే ఉన్న నిప్పుల కొలిమిలోకి ఆ పళ్లను విసిరేశాడు. కాసేపటికి ఆ మంటల్లో పడిన పళ్లు, వాటిలోని గింజలు కాలి మనోహరమైన పరిమళం రావడం ఆరంభించింది. వెంటనే ఆ కొలిమిలో నుంచి వాటిని తీసి, చల్లార్చే ప్రయత్నంలో నీటిలో వేశారు. ఆ నీటిని రుచి చూడగా కమ్మదనంతో పాటు ఉత్సాహం కలగడాన్ని గమనించారు. ఇక అప్పటి నుండి రాత్రివేళల్లో ప్రార్థనా సమయాల్లో, ఉపవాస వేళల్లో నిద్ర రాకుండా.. ఆకలి వేయకుండా.. చురుకుగా ఉండేందుకు కాఫీ డికాక్షన్ చేసుకుని తాగేవారు. అలా తొలిసారి కాఫీ ప్రపంచానికి పరిచయమైంది. 13వ శతాబ్దంలో అరేబియన్ కాఫీహౌస్‌లు ఈ కాఫీని అందించేవి. కాఫీని సుగంధద్రవ్యాలు, యాలకులు, దాల్చినచెక్క వేసి అందించిన దేశం టర్కీ. మద్యం వినియోగం నిషేధం ఉన్నందున అరబ్ దేశాల్లో కాఫీని ప్రత్యామ్నాయంగా వాడేవారు. 1652లో లండన్ కాఫీహౌస్‌తో యూరప్, ఇటలీలో కాఫీహౌస్‌ల వైభవం పెరిగింది. టర్కీ వాసులు తమ సాంప్రదాయాన్ని అనుసరించి యువతులకు కాఫీ తయారుచేయడం నేర్పించేవారు. అప్పట్లో అక్కడి భర్తలకు కాఫీ తయారుచేసి ఇవ్వకపోతే విడాకులు ఇచ్చే చట్టాలు కూడా వుండేవంట. తొలినాళ్లలో అరబ్బులు దీన్ని లాభదాయకమైనదిగా భావించి, కాఫీ విత్తనాలు ఇతర దేశాలకు ఎగుమతులు నిషేధించేవారంట. ఒకవేళ ఎగుమతులు చేసినా.. పచ్చి కాఫీ గింజలను కాకుండా, వేయించిన లేదా వేడినీటిలో ముంచిన వాటిని మాత్రమే ఎగుమతి చేసేవారు.

మనదేశానికి ఎలా వచ్చింది ?
దీనికీ ఓ కథ ఉందండోరు.. క్రీ.శ. 1600 సంవత్సరంలో మహ్మదీయ యాత్రీకుడైన బాబావుడాన్ పవిత్ర మక్కా యాత్రకు వెళ్లాడు. అక్కడ కాఫీ పానీయాన్ని రుచి చూసి, కొన్ని కాఫీ గింజల్ని తీసికెళ్లడానికి ప్రయత్నించగా.. అక్కడ చట్టాలు అడ్డువచ్చాయి. అయితే, మార్గమధ్యంలో కాఫీ చెట్ల నుండి దొంగతనంగా ఏడు కాఫీ గింజలను తీసుకుని, నౌకాయానంలో కర్నాటక రాష్ట్రంలో చిక్కమంగళూరు రాష్ట్రంలో తన నివాసానికి అతి సమీపంలో ఆ కాఫీ గింజలను నాటాడు. అలా మన దేశానికి కాఫీ వచ్చింది. ఇదీ చక్కని చిక్కని కాఫీ కథ... ఇదంతా కాఫీ ఒక్క సిప్ మాత్రమే.. ఇంకా కాఫీని ఆసాంతం ఆస్వాదించాలంటే అరకు కాఫీహౌస్‌లో ఫుల్ కాఫీ తాగాల్సిందే మరి.
ఇవి చాలా ఖరీదు..
రుచిని బట్టి ప్రపంచంలో ఖరీదైన కాఫీలున్నాయి. కాఫీ గింజలు ఎక్కడి నుంచి సేకరిస్తారనే దానిని నుంచి మొదలు తయారయ్యే పద్ధతి వరకు అన్నీ కాఫీ రుచినీ, ధరనీ నిర్ణయిస్తాయి. 2016 ఏప్రిల్‌లో నేషనల్ జియోగ్రఫిక్ ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. ప్రపంచంలోనే ఖరీదైన కాఫీగా కోపిలువాక్ (Kopi Luwak) నిలిచింది. పునుగు పిల్లి (CIVET CAT) విసర్జితాలతో ఈ కాఫీ విత్తనాలను తయారుచేస్తారు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. అమెరికాలో దీని ధర 60 నుంచి 90 డాలర్ల వరకు ఉంటుంది. దీంతోపాటు ఏనుగు విసర్జితాల నుంచి తయారుచేసే బ్లాక్ ఐవరీ కాఫీ (Black Ivory Coffee), పనామా దేశ కొండల్లో పండే ఎస్మెరాల్డా స్పెషల్ కాఫీ (Esmeralda Special coffee), ఫ్రాన్స్‌లో లభ్యమయ్యే సెయింట్ హెలెనా కాఫీ (St. Helena coffee), లాటిన్ అమెరికా కొండల్లో పండించే ఎల్ ఇన్జెట్రో (El Injerto) ఈ ఖరీదైన కాఫీల జాబితాలో ఉన్నాయి.
ఇలాంటి అనేక ప్రపంచ ప్రసిద్ధి పొందిన కాఫీలతో పోటీపడుతూ విశాఖ మన్యంలోని అరకు కాఫీ తన ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరించింది.
తోటల నుంచి ప్రాసెసింగ్‌కి..
కాఫీ గింజలను మొక్కల నుంచి వేరు చేసిన తరువాత ప్రాసెసింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ ప్రాసెసింగ్‌కి సంబంధించి నిర్వాహకులు ఇలా వివరించారు. 'ప్రాసెసింగ్ అంటే ఎండబెట్టడం నుంచి కాఫీ పొడి తయారుచేయడం వరకూ. మేం ఈ మిషన్లను లక్షకుపైగా ఖరీదు చేసి కొన్నాం. వీటిలో ముందుగా ఎండబెట్టిన కాఫీ గింజలను మరింత వేడి చేస్తాం. ఆ తరువాత వేడి చేసిన గింజలను మిషన్‌లోని జల్లెడపై ఉంచి, అరగంట సేపు రోస్టింగ్ చేస్తాం. అనంతరం పొడి చేసే యంత్రం సహాయంతో కాఫీ పొడి చేసి.. దానికి రుచిని పెంచడం కోసం ఒక రకమైన దుంప నుంచి తయారైన చకోరి అనే పొడిని కలుపుతాం. అనంతరం పావు కిలో, అర కిలో ప్యాకెట్లుగా తయారుచేసి రిటైల్‌గా అమ్మకాలు చేసేవారికి ఇచ్చేస్తాం. అయితే ఈ ప్రాసెసింగ్ మిషన్ల ద్వారా మేం కేవలం రోజుకి 40 కిలోలు మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నాం. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన మిషన్లను ప్రభుత్వం రాయితీకి అందిస్తే రోజుకి 500 కిలోల వరకు ఉత్పత్తి చేయగలం' అని చెప్పారు.

అంతర్జాతీయ ఖ్యాతి
ప్రపంచంలో కాఫీని అధికంగా పండించే దేశాల్లో మనదేశానిది ఏడో స్థానం. బ్రెజిల్ 25 లక్షల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తితో మొదటి స్థానంలో ఉంది. మనదేశం మూడున్నర లక్షల మెట్రిక్ టన్నులతో ఏడో స్థానంలో ఉంది. మనదేశంలో 12 రాష్ట్రాలు కాఫీని పండిస్తున్నాయి. అందులో ఎక్కువ భాగం దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో 'అరబికా' రకం కాఫీని పండిస్తారు. ప్యారిస్‌లో 'అరకు కాఫీ' బ్రాండ్ పేరుతో 2017లో కాఫీ షాప్ తెరిచారు. ఇది మనదేశం వెలుపల ఏర్పాటైన మొట్టమొదటి 'అరకు కాఫీ' షాప్. నాంది ఫౌండేషన్‌కు అనుబంధంగా మహీంద్రా గ్రూప్‌కు చెందిన అరకు గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ దీన్ని ప్యారిస్‌లో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అరకు కాఫీ రుచులు జపాన్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్ దేశాలకూ పాకాయి. పారిస్‌లో జరిగిన ప్రిక్స్ ఎపిక్యూర్స్-2018 పోటీల్లో (Prix Epicures-2018) అరకు కాఫీ బంగారు పతకం గెల్చుకుంది. రుచికరమైన కాఫీ బ్రాండులకి పేరొందిన బ్రెజిల్, సుమత్రా, కొలంబోతో పాటు ఇతర దేశాలను వెనక్కి నెట్టి, అరకు కాఫీ బంగారు పతకాన్ని పొందడం గొప్ప విశేషం.

కాఫీ ది బెస్ట్!
'మెదడుతో పనిచేసేవారు కాఫీ తాగుతారు. శారీరక శ్రమ చేసేవారు టీ తాగుతారు!' అని కొందరు పెద్దలు చెప్తున్న మాట. కానీ కాఫీ గింజలలో ఉన్న కెఫి అనే పదార్థము మనిషిని ఉత్సాహపరుస్తుందని తెలుస్తోంది. ప్రతిరోజూ కాఫీ తాగితే గుండెజబ్బులు, మధుమేహము వచ్చే అవకాశము తగ్గుతుంది. కాఫీ వాడకం వల్ల వృద్ధాప్యమూ దూరమవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాఫీలోని కెఫిన్.. న్యూరోట్రాన్స్మిటర్స్ అయిన 'నార్ ఎడ్రినాలిన్, అసిటైల్ కొలిన్, డోపమైన్' స్థాయిలను ఎక్కువ చేస్తుంది. వీటిమూలాన పనిలో ఏకాగ్రత, చురుకుతనము, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి. కెఫిన్ తక్కువ మోతాదు ఉత్సాహాన్ని పెంచి, అలసటను తగ్గిస్తుంది. కెఫిన్ మెటబాలిక్ రేట్‌ను ఎక్కువ చేస్తుంది. తాత్కాలికంగా హుషారుగా ఉండేటట్లు చేస్తుంది. కెఫిన్ క్యాన్సర్ నివారణిగా.. అది వచ్చే అవకాశాలు తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు.
కెఫిన్ 'పార్కిన్‌సోనిజం' జబ్బు వచ్చే అవకాశాలు తగ్గిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. కెఫిన్ 'టైప్ 2 మధుమేహం' వచ్చే రిస్క్ తగ్గిస్తుందని ఆధారాలు ఉన్నాయి. కెఫిన్ కొన్ని కాలేయ క్యాన్సర్లు రానీయదని పరిశోధనలు చెప్తున్నాయి. అసలు రోజుకు మూడు కప్పులు కాఫీ తాగితే చాలు.. మతిమరుపు దూరం అవుతుందంటున్నాయి తాజా పరిశోధనలు. ఇంకా చెప్పాలంటే.. కాఫీ తాగి బతికేయొచ్చు అన్నంత ఫ్యాషన్‌గా కాఫీ గురించి చెప్తున్నారు.
రోజూ కాఫీ తీసుకుంటే దానిలో ఉండే కెఫిన్ వల్ల యాంటీ ఆక్సిడెంట్లు మెదడులోకి చేరే కాలుష్యాలను అడ్డుకుంటుంది. దీంతోపాటు పార్కిన్‌సన్ వ్యాధి నిరోధానికి కూడా మంచి ఔషధంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. అయితే 14-16 ఏళ్ల వయస్సు వాళ్లు తాగకూడదు. ఆహార నియంత్రణ చేస్తుంది. అందుకే ఉపవాసాలు చేసేవాళ్లు కాఫీ ఎక్కువగా తాగుతుంటారు. కాఫీ వాడకం గురించి వచ్చిన కొత్త నివేదిక ప్రకారం రోజూ కాఫీ తాగేవారి శరీరంలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు చేరిన కారణంగా మెమరీ పవర్ పెరిగినట్టు గమనించారు. సహజసిద్ధమైన నీటితోనే శుద్ధి చేయాలి. మినరల్ వాటర్స్‌తో చేయకూడదు.
'అరకు వచ్చినవారంతా కచ్చితంగా మా వద్ద అరకు కాఫీని కొంటారు. కొందరు ఇక్కడ కాఫీ తప్పక తాగుతారు. కానీ మాకు సరైన సౌకర్యం లేక, మేమే సొంతంగా కర్రలతో షెల్టర్ తయారుచేసుకుని, వాటిలో అమ్మకాలు చేస్తున్నాం. ప్రభుత్వం మా కోసం మంచి స్టాళ్లను ఏర్పాటు చేస్తే, చూసేవారికీ బాగుండి, మరింత అమ్మకాలు పెరుగుతాయని నమ్ముతున్నాం' అని నిర్వాహకులు చెప్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం నిర్వాహించాలనుకుంటే, కాఫీ స్వచ్ఛతను కాపాడాలనీ, తమతో పాటు ఇక్కడ పనిచేసే వారందరికీ ఉపాధి గ్యారంటీ ఇవ్వాలనీ వారు కోరుతున్నారు. వీరిది న్యాయమైన కోర్కె. ప్రభుత్వం ఆ వైపు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రుచికి కారణం అదే..
అరకు కాఫీ అంత రుచిగా ఎందుకని అనుకుంటున్నారు? ఆ రుచికి ప్రధాన కారణం మన్యంలోని వాతావరణమేనని ఆంధ్ర విశ్వవిద్యాలయం మెటరాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ రామకృష్ణ గారి మాట. 'సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉండే విశాఖ ఏజెన్సీ కాఫీ తోటల పెంపకానికి అనువైన ప్రదేశం. ఇక్కడి చల్లని వాతావరణం కాఫీ తోటల సాగుకి ఎంతో అనుకూలం. ఏజెన్సీలోని కాఫీ తోటలన్నీ పొడవాటి మిరియాలు, సిల్వర్ ఓక్ చెట్ల మధ్యలో సాగవుతాయి. ఈ చెట్ల మధ్య ఉండే కాఫీ మొక్కలపై సూర్యకిరణాలు నేరుగా పడవు. అంతేకాదు ఇక్కడ పొగమంచూ నేరుగా నేలను తాకదు. దీనితో చల్లదనం మరింత పెరిగి, కాఫీ సాగుకు అనువుగా ఉంటుంది. సముద్ర మట్టానికి వందల అడుగుల ఎత్తులో ఉండే నేలల్లో క్షారగుణం తక్కువగా ఉంటుంది. ఇదీ కాఫీకి ప్రత్యేక రుచిని తీసుకొస్తుంది' అంటూ ఆయన విశ్లేషణ చేశారు.

ఎర్రగా మారిన తర్వాతే..
సేంద్రీయ పద్ధతుల్లో అరకు కాఫీని పండిస్తారు. కాఫీ మొక్కల నుంచి రాలిపడే ఆకులనే వాటికి మళ్లీ ఎరువుగా వేస్తూ.. మిరియాలు, సిల్వర్ ఓక్ వంటి చెట్ల నీడలో వీటిని పెంచుతారు. ఈ తోటల్లో పనిచేసే కూలీలకు ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది. కాఫీ మొక్కకు వచ్చే పిక్కను మూడు దశల్లో పరిశీలిస్తూ.. ఎర్ర రంగులోకి మారిన వాటిని మొక్క నుంచి వేరు చేస్తారు. వీటినీ 'చెర్రీఫ్రూట్' అని పిలుస్తారు. ఎర్రగా మారిన కాఫీ పిక్కలను ఎప్పటికప్పుడు వేరు చేస్తూ.. వాటిని ప్రాసెసింగ్ కోసం పంపిస్తారు. ఈ గింజలను స్వయంగా తమ సొంత యూనిట్లతో కాఫీ పొడిని తయారుచేస్తుంటారు.


మ్యూజియం ఏర్పాటు..
అరకులో పండే కాఫీ అరబికా అనే రకం. ఇది ఎగుమతి చేసే అత్యుత్తమమైన నాణ్యత కలిగిన కాఫీ. ఇక్కడ నుంచి 21 కంపెనీలకు ఎగుమతి అవుతుంది. సుమారు 68 రకాల కాఫీలు అరకు వెళితే తాగొచ్చు. అక్కడ సాయంత్రం వేళల్లో స్నాక్స్, గిరిజనులతో నృత్య కార్యక్రమాలు వంటి ఏర్పాటు ఉంది. చక్కని కాఫీ తాగుతూ గిరిజన సంస్కృతినీ ఆస్వాదించవచ్చు. ఆ మ్యూజియంలో అన్నీ సవివరంగా నిలువెత్తు ఫొటోలతో.. కింద వివరణాత్మక క్యాప్షన్లతో ఏర్పాటు చేశారు. ఇందులో పనిచేసే వారంతా గిరిజనులే. దీని నిర్వాహకులు కాఫీని ఎంతగా ప్రేమించారంటే.. వాళ్ల జీవితాల్ని దాదాపు దీనికే అంకితం చేశారు. లాభాపేక్ష కన్నా అంకితభావంతో కాఫీని.. ఆ రుచిని.. స్వచ్ఛంగా.. నిజాయితీగా కాఫీ ప్రేమికులకు కలకాలం అందాలనే తపనే వారి మాటల్లో మనకు వినిపిస్తుంది.
శాంతిశ్రీ
8333818985