ప్రజాశక్తి - బాపట్ల జిల్లా : బాపట్ల లో 10వ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం బాపట్ల మున్సిపల్ హైస్కూలులో జరుగుతున్న 10వ తరగతి పరీక్షలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని చెప్పారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పివిజె.రామారావు, బాపట్ల డి.ఎస్.పి శ్రీనివాసరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్ర, మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్, తహశీల్దార్ కవిత, తదితరులు పాల్గొన్నారు.










