జాగరూకతలో స్వప్నం కనులని వీడింది.
చూపుల్లోంచీ హృదయాలు ఒలికిపోయాయి.
ఇక్కడంతా మనుషులు గాయాలై పడి ఉన్నారు.
నేను మీకేమయినా చెప్పానా,
విరగడం అంటే ఇష్టమని.
నేనేదో పూలభాషతో ఉంటాను.
మొక్కల పచ్చదనాన్ని రాయబోతాను.
కూడబలుక్కుని వచ్చి నిషిద్ధ కంపనాలకి గురిచేస్తారు.
స్థాణువునై చూస్తాను,
మీ లెక్కలు నాకు తెలియక, కుదరక.
ఊరుకూరికే ఉలికిపాటుని ఇస్తారు.
మింగుడుపడని మాటలతో దేహానికిి
కొంచెం రక్తపోటు అధికం అంతే..
అయినా ఏముందీ?
ఎముకల్ని కప్పుకున్న కాస్త చర్మం తప్ప.
మరి ఇక ఉదాసీనత అంతే..
నాపాటికి ప్రపంచాన్ని ఈ మెలకువ కన్నుతో
కాస్త జాగాలో చూస్తాను.
ఏ నిదురలోనో సమాంతర సృష్టితో ఒక కలకంటాను.
మహాభిలాషతో సౌందర్యాన్ని ప్రేమలో ముంచి
అత్తరు పూసిన కాగితానికి నన్ను కానుక చేస్తాను.
మీరే చెప్పండి, ఎప్పుడైనా మీ స్వేచ్ఛా పంజరాలలోకి
నా అడుగులు పడ్డాయా?
మీ స్వతంత్ర నాడులలోకి నే వేణువుని ఊదానా?
ఏ మార్మిక అస్వస్థతలో మీరున్నారో..?
భాషని చిత్రిక పట్టడం ఆపండి..
బండి అనురాధ
anuradhabandi2022@gmail.com